ప్రపంచ చరిత్రలో మనం!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఈ వ్యాసపరంపర ప్రారంభంలో ఒకసారి చెప్పాను… కానీ చాలా వ్యాసాలు గడిచాయి కనుక మరోసారి గుర్తుచేసుకోవలసివస్తోంది…
1986లో కాబోలు…నేను మొదటిసారి కోశాంబీని చదివినప్పుడు ఎంత సంభ్రమాశ్చర్యాలు చెందానంటే కొన్ని రోజులపాటు భూమికి ఆమడ ఎత్తులో ఊరేగాను. అప్పుడు నా కళ్ళను కమ్మేసిన విస్మయపు మెరుపు ఇప్పటికీ అలాగే ఉందేమో కూడా. నాలోని పురాచరిత్రాసక్తికి ఇంధనం అందించిన ఆ పుస్తకం, Myth and Reality. పురాకాలాన్ని ఒక అద్భుతంగా నా ముందు ప్రదర్శించిన అంశాలు ఆ పుస్తకంలో చాలా ఉన్నాయి.

వాటిలో పణుల గురించి చెప్పినది ఒకటి.

ఋగ్వేదంలో పణుల ప్రస్తావనను ఉటంకిస్తూ కోశాంబీ ఇంకో మాట అన్నారు. అదేమిటంటే, పురాచరిత్రకు చెందిన ఫొనీషియన్లే పణులు కావచ్చునని! మనం ఒక మిత్ గానూ, విశ్వాసంగానూ చూడడానికి అలవాటుపడిన ఋగ్వేదాన్ని(అలాగే ఆయా సందర్భాలలో మహాభారతం లాంటి ఇతిహాస కథలను, పురాణ కథలను కూడా) ఆయన ఆ మాటద్వారా చరిత్ర వాకిట నిలబెడుతున్నారు. అదే నాలో ఉత్తేజానికి, విస్మయానికి కారణం.

ఆ తర్వాత రాంభట్ల ఆ పురాకాలపు అద్భుతత్వంలోకి నన్ను మరింతగా తీసుకెళ్లారు. కోశాంబీకి, రాంభట్లకూ ఒక పోలిక ఉంది. రాంభట్ల శైలి వ్యాకరణ సూత్రాలలా ఉంటే, కోశాంబీ శైలి గణితసూత్రాలలా ఉంటుంది. అన్నట్టు కోశాంబీ గణితశాస్త్రజ్ఞుడు కూడా. మనదేశానికి సంబంధించి కోశాంబీ, రాంభట్లా ప్రస్తావించిన అనేక పురాచారిత్రక వివరాల గురించీ; వ్యక్తులు, తెగలు, ప్రదేశాల పేర్లు వగైరాల గురించీ అదనపు సమాచారాన్ని సంపాదించడానికి నాకు చాలాకాలం పడుతూ వచ్చింది. అది ఇప్పటికీ పూర్తి కాలేదు. విచిత్రంగా, ఆ అదనపు సమాచారమూ; కోశాంబీ, రాంభట్ల నిర్ధారణలకు ధ్రువీకరణా పాశ్చాత్య పురాచరిత్రకారుల రచనల్లో కనిపిస్తూ వచ్చాయి. పురాకాలంలో ప్రపంచమంతా— కనీసం భారత్, మధ్యాసియా, పశ్చిమాసియా, యూరప్ ల మేరకే చూసినా— ఒకే చరిత్రను పంచుకున్నాయనడానికి ఇది సాక్ష్యం.

ఇందులో ఒక తమాషా ఉంది. ఎంత ప్రపంచ చరిత్ర రాస్తున్నా భారతీయ చరిత్రకారుల రచనలు పాశ్చాత్య కేంద్రితం(centric) గానూ, పాశ్చాత్యచరిత్రకారుల రచనలు భారత్ కేంద్రితంగానూ ఉండవు. అంటే, తను పాశ్చాత్య చరిత్ర చెబుతున్నానన్న స్పృహ భారతీయ చరిత్రకారునిలోనూ, తను భారత్ చరిత్ర చెబుతున్నానన్న స్పృహ పాశ్చాత్య చరిత్రకారునిలోనూ నిర్దిష్టంగా ఉండదన్న మాట. పురాకాలానికి చెందిన ఒక ప్రాంతం, ఒక రాజ్యం, లేదా ఒక తెగ గురించి రాసేటప్పుడు అది అసలే ఉండదు. కానీ చాలాచోట్ల ఉభయుల రచనల్లోనూ ఉమ్మడి అంశాలు, పేర్లు దొర్లుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పుకుంటే, రాంభట్ల అందించిన ఒక ఆసక్తికర సమాచారాన్నీ, పేర్లనూ పట్టుకుని పాశ్చాత్య చరిత్రకారుల రచనల్లో వాటి వివరాలు మరిన్ని సంపాదించడానికి నాకు పదిహేనేళ్లు పట్టింది. సరే, రాంభట్ల గారికి సోర్సు చెప్పే అలవాటు అంతగా లేకపోవడమూ ఒక కారణం. పై అనుభవం ఎంతో వివరంగానూ, ఉత్కంఠతో కూడిన ఒక కథలానూ చెప్పుకోవలసినది కనుక ఇప్పుడు నేను అందులోకి వెళ్లను.

ప్రస్తుతానికి వస్తే, ఋగ్వేదంలో పేర్కొన్న పణులు, పురాచరిత్ర కాలానికి చెందిన ఫొనీషియన్లే కావచ్చునన్న కోశాంబీ ఊహను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికిప్పుడు నాకు అందుబాటులో ఉన్న హెచ్.జి. వెల్స్ రచన A SHORT HISTORY OF THE WORLD ఆధారంగా ఫొనీషియన్ల గురించి చెప్పుకుందాం.
***
అంతకంటే ముందు కొంత పూర్వచరిత్రలోకి వెళ్ళక తప్పదు…

ఇప్పటి నుంచి 9వేల సంవత్సరాల వెనక్కి వెడితే, అంటే క్రీ.పూ. 7000 నాటికి దిగువ మెసపొటేమియా (నేటి ఇరాక్ ప్రాంతానికి ఇది పురాతన నామం. ఇక్కడి పురాతన జనం సుమేరియన్లు. వీరి పేరు మీద దీనిని సుమేరియా అని కూడా అన్నారు. రెండు నదుల మధ్య ఉంది కనుక ‘లంక’ అని కూడా అనచ్చు)లో యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల మధ్య సుమేరియన్లు నగరరాజ్యాలు స్థాపించుకున్నారు. దాదాపు ఇదే సమయంలో నైలు నదీ లోయలో ఈజిప్ట్ ప్రజలూ నగర రాజ్యాలను స్థాపించుకున్నారు. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే తొలి రాజ్యాలు.

నగరాలు వేటికి అవే స్వతంత్ర రాజ్యాలు. ప్రతి నగరానికీ ఒక దేవుడూ, పూజారీ ఉంటారు. పూజారే రాజుగా ఉంటాడు. ఒక నగరం ఇంకో నగరాన్ని ఆక్రమించుకోవచ్చు. ఆ నగర దేవుణ్ణి ఎత్తుకు పోయి తమ నగరంలో ప్రతిష్టించుకుంటే, ఆ నగరం వారి స్వాధీనంలోకి వచ్చేసినట్టే. ఓడిపోయిన నగరం గెలిచిన నగరానికి కప్పం చెల్లించుకుంటుంది. సుమేరియన్ల నగరం ‘నిప్పూరు’లో ఒక పురాతన శాసనం దొరికింది. ఆ శాసనంలో తొలి ‘సామ్రాజ్యం’ పేరు నమోదైంది. దాని పేరు ‘ఈరిచ్’. ఈ నగర దేవుడూ, రాజుగా ఉన్న పూజారీ పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్రసముద్రం వరకూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

‘నిప్పూరు’లో ‘ఊరు’ ఉంది చూడండి; అది మన తెలుగు ‘ఊరు’కు సమానార్థకమే. సమానార్థకమేమిటి, అది పదహారణాల తెలుగు మాటే కావచ్చు. అసలు మెసపొటేమియాలో ‘ఊరు’ అనే పేరుతోనే ఒక నగరం ఉండేది. మెసపొటేమియాకు చెందిన గిల్గమేశుని ఇతిహాసంలో(The Epic of Gilgamesh) గిల్గమేశుని నగరం పేరు ‘ఊరు’. ఇందులోని ఎంకిడు అనే పాత్రకు, మన రామాయణ, భారతాలలోని ఋష్యశృంగుని కథకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ ‘ఎంకిడు’ అనే పేరు కూడా తెలుగు పేరులానే ధ్వనిస్తూ ఉండచ్చు. వీటి గురించి మరింత వివరంగా చెప్పుకునే అవకాశం ముందు ముందు వస్తుందేమో చూద్దాం. దానిని అలా ఉంచితే, ఆఫ్రికా ఊళ్ళ పేర్లలో కూడా ‘ఊరు’ ఉన్నట్టు ఇంతకుముందు చెప్పుకున్నాం. రూట్స్ నవలలో కుంటా కింటే ఊరి పేరు జఫూరు.

పద్ధతిగా వ్యవసాయమూ, సేద్యపునీటి వ్యవస్థా, దేవాలయనిర్మాణమూ ప్రారంభమైంది కూడా మెసపొటేమియా, ఈజిప్టులలోనే. సామాజిక వ్యవస్థలు ఏర్పడిందీ అక్కడే. అంటే, ఈ ప్రాంతాల ప్రజలు కొంత మేరకైనా కడుపులో చల్ల కదలకుండా స్థిరజీవితానికి అలవాటుపడినవాళ్ళన్నమాట. స్థిరజీవితం ఉన్నచోటే నాగరికత పుడుతుంది. చరిత్రకు తెలిసినంతవరకు వీరే తొలి నాగరికులు. సుమేరులకు లిపి కూడా తెలుసు.

ఆ తర్వాతి కాలంలో, అంటే, క్రీ.పూ. 6000-3000 మధ్యలో టైగ్రిస్ నది ఎగువన అసీరియన్లు నగరాలను స్థాపించడం ప్రారంభించారు. అప్పుడే, ఆసియా మైనర్(నేటి టర్కీ చుట్టుపక్కల ప్రాంతం)లోనూ, మధ్యధరా సముద్ర తీరంలోనూ, దీవుల్లోనూ చిన్న చిన్న తెగలు నాగరికతవైపు అడుగులేస్తున్నాయి. ఇదే కాలంలో భారత్, చైనాలలో కూడా ఇదే విధమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. అంటే, ఇది మన దేశంలో సింధు నాగరికతకు చెందిన కాలం అన్న మాట.
ఇలా ఉండగా సుమేరు, ఈజిప్టు ప్రజల ప్రశాంత జీవన సరస్సును కల్లోల పరిచే ఒక పెద్ద పరిణామం త్వరలోనే జరిగింది— అది సంచార తెగల రూపంలో!
ఆ కాలంలో మూడు ముఖ్య ప్రాంతాలలో, మూడు ముఖ్య రకాలకు చెందిన సంచారజీవులు ఉండేవారు. మొదటి రకం, యూరప్ అడవుల్లో వేటాడుతూ, పశువులను కాచుకుంటూ జీవిస్తున్న నోర్డిక్ జాతివారు. క్రీ.పూ. 1500కు ముందు వీరు తొలి నాగరికులకు తెలియరు. రెండవ రకం, తూర్పు ఆసియాలో విశాల పచ్చిక మైదానాలలో జీవించే వివిధ మంగోల్ తెగలు, హున్నిస్ తెగలు. వీరు అప్పటికి గుర్రాలను మచ్చిక చేస్తున్నారు. వేసవి, శీతాకాల శిబిరాల మధ్య సంచారజీవితం గడుపుతున్నారు. హున్నిస్ తెగలకు, నోర్డిక్ తెగలకు మధ్య రష్యా చిత్తడి నేలలు, కాస్పియన్ సముద్రమూ అడ్డుగోడలుగా ఉన్నాయి. మూడవరకం, సిరియా, అరేబియా ఏడారుల్లో సంచారజీవితం గడుపుతున్న సెమిటిక్ తెగలు. వీరు గొర్రెలను, మేకలను, గాడిదలను కాచుకుంటున్నారు. వీరూ, పర్షియా దక్షిణ ప్రాంతంలో ఉన్న నల్లజనం ఈలమైట్లూ మొదటిసారిగా తొలి నాగరికుల(సుమేరియన్లు, ఈజిప్షియన్లు) సంపర్కంలోకి వచ్చారు. సెమెటిక్ తెగలవారు ఒకపక్క తొలి నాగరిక ప్రాంతాలపై దాడులు చేస్తూ, మరోపక్క వారితో వర్తక వ్యాపారాలు సాగించేవారు.

ఇక్కడ స్థిరజీవులకు, సంచారజీవులకు మధ్యనున్న తేడా గురించి హెచ్. జీ. వెల్స్ రాస్తారు.

స్థిరజీవనం సాగించే వ్యవసాయదారులకన్నా సంచారజీవులు దృఢంగా ఉంటారు. జనాభా పరిమితంగా ఉంటుంది. వీరికి శాశ్వత దేవాలయాలు కానీ, పటిష్టమైన పూజారివ్యవస్థ కానీ ఉండవు. అలాగని వీరిది అంతగా అభివృద్ధి చెందని జీవన విధానమని అనుకోనవసరం లేదు. వ్యవసాయదారులతో పోల్చితే, వీరిది అనేకవిధాలుగా సంపూర్ణజీవితం. ప్రతి వ్యక్తీ తన రక్షణ తను చూసుకోగలిగేలా ఉంటాడు. గుంపులో ఒకడుగా ఉండడు. వీరిలో నాయకుడికే ఎక్కువ ప్రాముఖ్యం, పూజారికి తక్కువ ప్రాముఖ్యం.

విస్తారమైన ప్రదేశాలను చూస్తారు కనుక సంచారజీవులకు విశాల జీవన దృక్పథం అలవడుతుంది. స్థిరజీవుల తీరు తెన్నుల్ని వారు ఆకళించుకుంటారు. అపరిచితులను చూడడానికి అలవాటుపడతారు. పచ్చికభూముల విషయంలో వారు ఇతర తెగలతో పోటీ పడవలసివస్తుంది. ఆ పోటీ సహజంగానే ఘర్షణలకు దారితీస్తుంది. కనుక అందుకు అవసరమైన వ్యూహాలను వారు రచించుకోవలసివస్తుంది. కనుమలు, కొండలు, గుట్టల మీదుగా ప్రయాణిస్తూ ఉంటారు కనుక, వ్యవసాయదారులకు కన్నా వారికి లోహాలతో ఎక్కువ పరిచయం ఏర్పడుతుంది. ఆవిధంగా వారు మంచి లోహశాస్త్రనిపుణులు(metallurgists) అవుతారు. కంచును కనిపెట్టినదీ, ఇనుమును కరిగించడం నేర్చిందీ కూడా సంచారజీవులే ననడానికి ఆధారాలున్నాయి. ముడి ఇనుమునుంచి ఇనుమును వేరు చేసి తయారు చేసిన తొలి పరికరాలలో కొన్ని, తొలి నాగరికతాప్రాంతాలకు చాలా దూరంగా, మధ్య యూరప్ లో దొరకడం ఇందుకొక సాక్ష్యం.

మరోవైపు, స్థిరజీవనులకు వస్త్రాలు నేయడం, కుండలు చేయడం, ఇతర నిత్యావసరవస్తువులను తయారుచేయడం తెలుసు. ఇలా సంచార, స్థిరజీవనుల మధ్య ఉన్న జీవన వైవిధ్యం ఒకవిధమైన ఇచ్చిపుచ్చుకునే సంబంధాలకూ దారి తీయడంలో విశేషం లేదు. అందులో ఒకవైపు దోచుకోవడం, ఇంకోవైపు వర్తక సంబంధాలను నెరపడం–రెండూ ఉంటాయి. ప్రత్యేకించి సుమేరియా గురించే చెప్పుకుంటే, దానికి ఒక పక్క ఎడారులున్నాయి. ఇంకో పక్క వివిధ ఋతువులు ప్రభావం చూపే ప్రాంతం ఉంది. సంచారజీవులు పంటభూములకు దగ్గరలో గుడారాలు వేసుకుని ఉండడం పరిపాటి కావచ్చు. వీరు వర్తకానికీ, దొంగతనానికీ కూడా పాల్పడుతూ ఇండచ్చు. నేటికీ జీప్సీలలో ఇది చూస్తూ ఉంటాం. (మన దగ్గర కూడా పల్లెటూళ్లలోనూ, పట్టణ, నగర శివార్లలోనూ ఖాళీ ప్రదేశాలలో గుడారాలు వేసుకునే సంచారజీవుల్ని ఇప్పటికీ చూస్తూ ఉంటాం). సంచారజీవులు తమ వెంట తెచ్చిన విలువై రాళ్ళ(నవరత్నాలు)నూ, లోహాలనూ, తోలునూ; వేటాడే జాతులవారైతే జంతుచర్మాలనూ ఇచ్చి, స్థిరజీవనులనుంచి కుండలు, పూసలు, గాజు, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకునేవారు.

ఇలా ఉండగా…

క్రీ.పూ. 2750 (జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం క్రీ.పూ. 2350) నాటికి ఈ సెమెటిక్ తెగలలోంచి ఒక మహానాయకుడు అవతరించాడు. అతను చదువుసంధ్యలు లేని ఒక బర్బరుడు(బార్బేరియన్). అతను సుమేరియా మొత్తాన్ని జయించాడు. పర్షియా సింధుశాఖనుంచి మధ్యధరాసముద్రం వరకూ ఆధిపత్యాన్ని స్థాపించుకున్నాడు. అతని పేరు సారగాన్. అతని ప్రజలు అక్కడియన్లు. సారగాన్ తన ప్రజలకు సుమేరు లిపిని నేర్పించి, సుమేరు భాషను అధికారభాషగా, విద్యావంతుల భాషగా అమలు చేశాడు. ఇతను, ఇతని వంశీకులు సుమేరు ప్రజలతో, వారి భాషా సంస్కృతులతో పాలు, నీళ్లలా కలసిపోయారు.

200 ఏళ్ళ తర్వాత అమొరైట్లు సుమేరియాను ఆక్రమించుకుని తొలి బాబిలోనియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. దీనిని హమ్మురాబీ(క్రీ. పూ. 2100… జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం క్రీ.పూ.1728) మరింత పటిష్టం చేశాడు. ప్రపంచానికి తొలి శిక్షాస్మృతిని ఇచ్చిన రాజుగా ఇతన్ని చెబుతారు.

ఇతని కాలంలోనే సెమెటిక్కులు ఈజిప్టును ఆక్రమించుకుని షెపర్డ్ రాజుల పేరుతో పాలించారు. అయితే, వీరు ఈజిప్టు భాషాసంస్కృతులతోనూ, ప్రజలతోనూ మమేకం కాలేదు. క్రీ. పూ. 1600 లలో ఈజిప్టులో పెద్ద యెత్తున ప్రజోద్యమం తలెత్తి వీరిని పారదోలింది.

ఫొనీషియన్ల గురించి చెప్పుకునే ప్రయత్నంలో ఈ చరిత్ర అంతా తడమాల్సివచ్చింది. ఇంతకీ విషయమేమిటంటే, సారగాన్, హమ్మురాబీ, షెపర్డ్ రాజుల్లానే ఫొనీషియన్లు కూడా సెమెటిక్కులు. వీరు సముద్రయానం చేస్తూ నావికులుగా, వర్తకులుగా ప్రసిద్ధి చెందారు. వీరు తొలి నౌకావర్తకులలో ఒకరు. మొదట్లో పశ్చిమ ప్రాంతంలో, ఎక్కువగా స్పెయిన్ లో ఉండేవారు. హమ్మురాబి కాలం నాటికి వీరు మధ్యధరా సముద్రప్రాంతం అంతటా విస్తరించి వలసలు ఏర్పాటు చేశారు. మధ్యధరా తూర్పు తీరం వెంబడి వీరు నెలకొల్పిన రేవు పట్టణాలలో టైర్, సిడాన్ ముఖ్యమైనవి. ఆఫ్రికా ఉత్తరతీరంలో వీరు నిర్మించిన నగరం కార్తేజ్. ఒకప్పుడు పది లక్షల జనాభా ఉన్న పెద్ద నగరం అది.

ఫొనీషియన్లు మధ్యధరా జలాలలో తిరిగిన తొలి నావికులలో ఒకరే కానీ, తొలి నావికులు కారు. వారికి ముందే మధ్యధరా సముద్రతీరంలోనూ, దీవుల్లోనూ కొన్ని పట్టణాలూ, నగరాలూ ఉండేవి. బాస్క్, బెర్బర్, ఈజిప్షియన్ తెగలతో రక్తసంబంధం, భాషా సంబంధం ఉన్న ఏజియన్ జాతి లేదా జాతులకు చెందినవి ఇవి. వీరినే గ్రీకులుగా పొరబడతారు కానీ, కాదు. గ్రీకులకు పూర్వులైన వీరి నగరాలు గ్రీస్, ఆసియా మైనర్, మైసీనియా, ట్రాయ్ లలో ఉన్నాయి. వీరికే చెందిన క్రీటు ద్వీపంలోని క్నోసోస్ అప్పటికి మంచి ఉచ్చ దశలో ఉంది. ఈ ఏజియన్లే చరిత్రకు తెలిసిన తొలి నావికులు.

మన సింధు నాగరికత లానే క్రీటు నాగరికత కూడా ఒక విస్మృతనాగరికత. 19 వ శతాబ్ది చివరిలో జరిపిన పురావస్తు తవ్వకాలలో క్రీటు నగరం క్నోసోస్ బయటపడింది. అప్పటినుంచే ఏజియన్ నాగరికతా వ్యాప్తి గురించి ప్రపంచానికి తెలిసింది. క్రీ.పూ. 1400 నాటికి క్రీటు కూడా మన సింధు నాగరికత లానే హఠాత్తుగా అంతరించిపోయింది. తవ్వకాలలో బయటపడిన క్నోసోస్ శిథిలాలలో అగ్నిప్రమాదం, భూకంపం సంభవించిన ఆధారాలు కనిపించాయి. అవి రెండూ కబళించగా మిగిలిన దానిని గ్రీకులు దోచుకుని ఉంటారని ఊహ.

క్నోసోస్ నిజానికి ఒక నగరం కాదు, ఒక పెద్ద రాజప్రాసాదం మాత్రమే. క్రీటు పాలకుని పేరు మినోస్. ఈజిప్టు ఫారో లానే ఇది కూడా రాచరిక నామం. క్నోసోస్ కు మొదట్లో కోటగోడలు లాంటివి ఏవీ ఉండేవి కావు. రాజప్రాసాదంలో స్నానశాలల వంటి వసతులన్నీ ఉండేవి. క్రీటులో స్త్రీపురుషుల మధ్య పూర్తి సమానత్వం ఉండేది. నాటి క్రీటు స్త్రీలు ధరించిన దుస్తులు నేటి కాలపు దుస్తుల్ని తలపించేలా ఉంటాయి. క్రీటు ప్రజలు ఒక నిరంతర ఉత్సవ వాతావరణంలో ఉల్లాసంగా జీవించినవారుగా కనిపిస్తారు. స్త్రీపురుషుల జిమ్నాస్టిక్సే కాదు, యెడ్ల యుద్ధాలు(bull fights) కూడా క్రీటులో ఉండేవి. ఇప్పటికీ స్పెయిన్ యెడ్ల యుద్ధాలకు ప్రసిద్ధమే.
01bulfight.xlarge1

విశేషమేమిటంటే, ఇప్పటి బుల్ ఫైటర్లు ధరించే దుస్తులకు, అప్పటి క్రీటు బుల్ ఫైటర్లు ధరించిన దుస్తులకు పోలిక ఉండడం!

క్రీటు వాసులు ఎంతో అందమైన కళాత్మకమైన జీవితం గడిపేవారనడానికి వారి దుస్తుల తీరేకాక, తవ్వకాలలో బయటపడిన మృణ్మయపాత్రలు, శిల్పాలు, చిత్రాలు, నగలు, దంతపు వస్తువులే సాక్ష్యం. వారికి లిపి కూడా ఉండేది. గృహ బానిసలు, పారిశ్రామిక బానిసలు ఉండేవారు. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, డేడలస్ అనే ఒక క్రీటు వాసి విమానం లాంటి ఒక ఎగిరే వాహనాన్ని తయారు చేశాడనీ, అది సముద్రంలో కూలిపోయిందనే వివరం, అనంతర కాలంలో క్రీటును ఆక్రమించుకున్న గ్రీకుల పురాగాథలలోకి ఎక్కింది. మన రామాయణంలో చెప్పిన పుష్పక విమానానికి మూలం ఇదేనేమో తెలియదు. క్రీటులకు ఉల్కాపాతం ద్వారా లభించిన ఇనుము మాత్రమే తెలుసు. గాడిదలే తప్ప గుర్రం తెలియదు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, గ్రీకుల ఆక్రమణ కంటే ముందే క్రీటు దీవి పక్కన తిష్ట వేసిన సెమెటిక్ సంచారజీవులైన ఫొనీషియన్లు క్రీటుపై దాడులు చేస్తూ ఉండేవారు. మరోవైపు ఉత్తర దిశనుంచి గ్రీకు నావికులు దాడులు చేస్తూ ఉండేవారు. ఈ దాడుల ఫలితంగానే క్రీటు రాజప్రాసాదం చుట్టూ కోటగోడలు లేచాయి. ఆ రోజుల్లో నావికులు వర్తకవ్యాపారాలే కాక, దోపిడీలు చేస్తుండేవారని పైన చెప్పుకున్నాం.

ఫొనీషియన్లు క్రీటు వాసుల తర్వాతే చరిత్ర తెర మీదికి వచ్చి ఉండచ్చు కానీ, వారిని కూడా క్రీటులానూ, మరికొన్ని పురా నాగరికతల్లానూ పాత ప్రపంచానికి పరిమితం చేస్తూ కాలగర్భంలోకి నెట్టి వేసే ఒక కొత్త కెరటం త్వరలోనే మరింతగా ఉధృతంగా విరుచుకు పడింది. పైన చెప్పుకున్న గ్రీకులు ఆ కెరటంలో ఒక భాగమే. అది తొలి నాగరిక ప్రపంచాన్ని అంతం చేసి సరికొత్త ప్రపంచానికి జన్మ నిచ్చింది. ఆ కెరటం పేరు, ఆర్యులు!

ఈ మధ్యలో, ఇప్పుడు యూదులుగా మనకు బాగా తెలిసిన హిబ్రూలకు, ఫొనీషియన్లకు మధ్య ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు ఏర్పడి, ఫొనీషియన్ల సముద్రవర్తకం మరింత విస్తరించింది. అందులోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. క్రీటుతో సహా పైన చెప్పినదంతా(మధ్యలో మన గురించిన ఒకటి రెండు ప్రస్తావనలు తీసేస్తే) పాశ్చాత్యచరిత్రకారుని వెర్షన్ మాత్రమే. ఇందులో మన దేశం తాలూకు లింకులను గుర్తించాలంటే రాంభట్ల, కోశాంబీల వెర్షన్లు చూడాల్సి ఉంటుంది. ఇలా అనడమైతే తేలిగ్గా అన్నాను కానీ, పూర్తి స్థాయిలో అది ఇప్పట్లో సాధ్యమని చెప్పలేను.

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)