నీ ఉనికి ఏ రంగు?!

drushya druhyam-52

ఒక ఛాయా చిత్రం చేస్తున్నప్పుడు ‘తొలుత ఏది ఆకర్షిస్తుందీ’ అంటే చెప్పలేం. దీనత్వమా ధీరత్వమా అంటే, నలుపా ఎరుపా అంటే ఏమని చెబుతాం?

కష్టమేగానీ, ఒకటి సత్యం. ప్రధానంగా ‘మనిషి ఉనికి’ అని చెప్పాలి. అయితే, ఆ మనిషి ఉనికిలో వర్ణమూ ఉంటుంది. అది ముదురు వన్నెలతో వెలుగుతున్నప్పుడు ‘ఆ ఛాయ’ ధీరత్వానికి, నిబ్బరానికి సూచికే అవుతుంది. ఎరుపు ‘వర్ణమే’ అవుతుంది.

అయితే, అందరికీ తెలుసు, ఛాయా చిత్రలేఖనంలో రంగుకూడా చిత్రాన్ని ప్రధానం చేస్తుందీ అని! కానీ, అది మరింత చక్కగా ఫొటోగ్రఫీ చేసేలా దానంతటదే సూచనలు ఇస్తుందని తెలుసా? తెలిసింది. అదే ఈ చిత్రం.

+++

నిజానికి మనిషి స్థితీ గతీ ఎటువంటిదైనా జీవితానికి రంగు, రుచీ, వాసనా… వీటన్నిటితో కూడిన ‘ఉనికి’ ఉన్నది. సాహిత్యంలో శ్రీశ్రీ కాబోలు, ‘రసన’ అన్నట్టు, ఛాయాచిత్రలేఖనంలో కూడా ఈ ‘రసన’ ఉన్నది. అదే ఈ చిత్రం.

జీవితం ప్రకాశవంతంగా ఉంటుందని, మనిషి ఎక్కడున్నా, ఎలా జీవిస్తున్నాచీమూ నెత్తురూ ఉన్నంత వరకూ కళను పోగొట్టుకోడని…ఆ ‘రసన’ అన్న దానిని అడుగడుగునా, అణువణువునా ఛాయాచిత్రం రికార్డు చేసినంత వాస్తవికంగా చిత్రలేఖనం కూడా చేయదని ఒక నమ్మిక కలుగుతున్నది. ఈ చిత్రమూ ఆ నమ్మికకు దాఖలు.

ముఖ్యంగా మహిళ. ఆమె చీర సింగారమే, ఆమె ఉనికి బంగారమే. ఎక్కడున్నా ఒక శోభ. తృప్తి.

అయితే, తనను తాను రక్షించుకోవడానికి ఆమె ధరింపు అంతా కూడా ఒక చిత్రం. అదే ఈ చిత్రం.

నిజానికి ఫ్లెక్సీపై విశ్రమిస్తున్నఈ మహిళా, అమె పరిసర జీవితమూ అంతా కూడా ఒక దీనావస్థకు ప్రతిబింబమే. అట్లని మనిషిని వారి ఈస్తటిక్స్ ను పేదరికం కారణంగా విస్మరించడం కూడదనే ఈ చిత్రం. అదే ఈ దృశ్యం.

ఆమె తనను తాను అనువుగా మలుచుకున్నది. అంతా కూడా ఆ చీరలోనే, అట్లే, ఆ ఫ్లెక్సీపై. ఆ అనుభవం ఈ చిత్రం.

ఎక్కడున్నా తనకు అనువైన పరిసరాలలో, వీలైనంత భద్రంగా, శాంతిని ఎరిగి, కాసింత విశ్రాంతిని కళాత్మకంగా అసుసంధానం చేసుకోవడమూ ఈ చిత్ర విశేషం. లైఫ్@ఆర్ట్ – ఈ చిత్రం.

తానే అని కాదు, ఎందరినో చిత్రిస్తుండగా బతుకు ఎక్కడున్నా దివ్యంగా శోభిల్లడం చిత్రమేమీ కాదు. అది సహజత్వం. ముఖ్యంగా వీధుల్లో జీవించే వారెందరినో చిత్రిస్తూ ఉండగా ఇంకొక విశేషమూ గమనంలోకి రావడం అదృష్టం.

భరించలేని దుర్గంధం వస్తున్న చోట కూడా ఎన్నోజీవితాలు స్థిరంగా నిలబడటం విశేషమే. అటువంటి ఒకానొక చోట, ఒక వృద్ధ మహిళ అగర్ బత్తీలు వెలిగించుకుని ఉండటం ఒక గమనింపు. ఆ చిత్రం చేసి పెట్టాను కూడా. దీనర్థం మనిషి అనివార్యమైన జీవన ప్రస్థానంలో ఓడిపోలేదని! గుబాళింపు కోసం కాదు, సహజంగా జీవించలేని నిస్సహాయతలో ఒక వెలుగింపు. నిరాశ్రయంలో కూడా ఒక ఆశ్రయం. అంతే. అటువంటిదే ఈ చిత్రం. ఆమెను చూడండి.

ఒకరని కాదు, వందలు, వేలు, లక్షలు కూడానేమో! మహానగరంలో ఎందరో సామాన్యులు. అందరికీ వందనాలు.

+++

ఆమె, ఇంకా ఎందరో, వాళ్లంతా లతలూ, పూవులూ అన్నిటినీ దగ్గరే వుంచుకోవడం…ఫలమూ, పుష్ఫమూ జాగ్రత్త చేసుకోవడం… నగరంలో వీధి మనిషి జీవితం… ఒక రంగుల కళ. చూడండి, ఆర్ట్@స్ట్రీట్. అదే ఈ చిత్రం.

+++

ఆమె వరకైతే అది చీర కొంగు డిజైన్ కావచ్చు, ఎర్రటి గాజుల గలగలలు కావచ్చు. వేపాకు రంగు జాకెట్టూ కావచ్చు. ముందరి పేపర్ ప్లేట్ కావచ్చు.ఆమెది జీవకళ. అందునా కళ అన్నది జీవితంలో సహజాతం అన్నట్లు తాను జీవితాన్ని కళాత్మకంగా ధరిస్తుంది. ఆ ఫ్లెక్సీ కూడా అదే. అది కూడా తన ఎంపిక. ధరింపు,.

అందులోనూ మనుషులున్నరు. అది కూడా చిత్రం.

తానే కాదు, ముఖ్యంగా శ్రామిక జనం… ఎర్రెర్రటి, పచ్చపచ్చటి, ముదురు ముదురు రంగుల్లో జీవితాన్ని పచ్చగా గడుపుతూ ఉంటారు. చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. ముల్లు గుచ్చుకున్నా బాధపడతారు. కడుపు నొచ్చినా చెప్పుకుంటారు. శోఖాలు పెట్టి ఏడుస్తారు. రాగాలు తీసి దుఃఖిస్తారు. నవ్వినా అంతే. జీవితాన్నిజీవిస్తారు. అందుకే వారి చుట్టూ ఒక శాంతి వలయం ఉంటుంది. అదే వారిని భద్రంగా కాపాడుతుంది. మళ్లీ రంగులు…వారి చుట్టూరా ఇంధ్ర ధనుస్సుగా విరుస్తయి. అదే వాళ్ల మహత్యం.

ఈ చిత్రం ఇవన్నీ గుర్తు చేస్తున్నది.

ఆమె ఎర్రని చీర, ఈగలు ముసరకుండా తలను కప్పేసిన ఆ అందమైన కొంగు, ఆమె ధరించిన ఎర్ర గాజులూ, పడుకోవడానికి ఆమె ఎంచుకున్నఅందమైన రంగురంగుల జాతీయజెండా వంటి ఆ ఫ్లెక్సీ,

అందులోని మనుషుల కళ, ఆమె వెనకాలి గోడమీద జాజు చిత్రణమూ….ఇంకా వైడ్ షాట్ ఉంది. అందులో మరింత అందమైన, గాఢమైన వర్ణలేఖనమూ ఉన్నది. ఇది, ఇవన్నీ అంతా కూడా ఆ పరిసర

సౌందర్యాత్మను పట్టిస్తుంది. ఆ ఆడ మనిషిలోని ‘రసన’ తాలూకు చిద్విలాసాన్ని దృశ్యమానం చేస్తున్నది.

అజంతా మృత్యువు హాస్య ప్రియత్వం ఒక బొరుసు. ఇది బొమ్మ .జీవితపు అనివార్య ప్రస్థానాన్నిహుందాగా అంగీకరించిన ‘రసన’

ఆమె, ఇంకా ఎందరో, వాళ్లంతా లతలూ, పూవులూ అన్నిటినీ దగ్గరే వుంచుకోవడం…ఫలమూ, పుష్ఫమూ జాగ్రత్త చేసుకోవడం… నగరంలో వీధి మనిషి జీవితం… ఒక రంగుల కళ. చూడండి, ఆర్ట్@స్ట్రీట్. అదే ఈ చిత్రం.

+++

చిత్రమేమిటంటే, ఇదంతా కూడా జీవితంపట్ల గొప్ప అనురక్తి ఉన్నదని చెప్పకనే చెప్పే చిత్రం. చిత్రణమూ. అదే దృశ్యాదృశ్యం.

మరి ధన్యవాదం.

 ~ కందుకూరి రమేష్ బాబు

 ramesh

Download PDF

3 Comments

  • ముఖ్యంగా శ్రామిక జనం… ఎర్రెర్రటి, పచ్చపచ్చటి, ముదురు ముదురు రంగుల్లో జీవితాన్ని పచ్చగా గడుపుతూ ఉంటారు. చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. ముల్లు గుచ్చుకున్నా బాధపడతారు. కడుపు నొచ్చినా చెప్పుకుంటారు. శోఖాలు పెట్టి ఏడుస్తారు. రాగాలు తీసి దుఃఖిస్తారు. నవ్వినా అంతే. జీవితాన్నిజీవిస్తారు. అందుకే వారి చుట్టూ ఒక శాంతి వలయం ఉంటుంది. అదే వారిని భద్రంగా కాపాడుతుంది. మళ్లీ రంగులు…వారి చుట్టూరా ఇంధ్ర ధనుస్సుగా విరుస్తయి. అదే వాళ్ల మహత్యం….

    గ్రేట్ సర్.. జీవితాన్ని శాంతిమయం కాంతిమయం చేసుకోవడం సామాన్యులకున్నంత జ్ఞానం మరొకరికి ఉండదేమో.. చాలా బాగుంది ఈ చిత్రం చిత్రణ అద్భుతం..

    • నా పిచ్చి గాని, నేను రాసింది ఎవరు నమ్ముతారు అనుకుంటాను అప్పుడప్పుడు. కాదని అప్పుడప్పుడు తెలిసి గొప్ప ఆనందం. థంక్ యు బ్రదర్.

  • Thirupalu says:

    ఎటువంటి గడ్డు పరిస్తితులనైనా తనకు అనుకూలంగా మలుచుకొని జీవిస్తాడనటానికి అందులోనే మనిషి ఉన్నతుడు/ఉన్నతురాలని తెలియజేస్తుంది చిత్రం. అదే మానవ సంస్కృతి కూడా.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)