a tale of winter…

DRUSHYA DRUSHYAM

హైదరాబాద్ నగరంలో మింట్ కాంపౌండ్ సమీపంలో ఈమె.
ఒక బట్టల మూటలా ఆమె.

ఏమీ కానివారిని
ఈమె అంటామా ఆమె అంటామా?

ఎపుడూ నిర్లిప్తంగా ఉంటుందామె.
ఏ ఆలోచనా ఈమె చేస్తూ ఉన్నట్టుండదు.
కానీ, తనదైన ఉనికి ఒకటి థింకర్ శిల్పం వలే మనల్ని కట్టి పడేస్తుంది.
పీడిస్తుంది కూడానూ.

ఈమె ఒక తల్లి వేరు.
కూతురుంది. భర్తా ఉన్నాడు.

దాదాపు రెండు దశాబ్దాలుగా ఫుట్ పాత్ మీదే జీవిస్తున్న కుటుంబం ఆమెది.
అక్కడి ఎండా వానా చలీ ఆ చెట్టు నుంచి పడే ఎండపొడా అంతానూ కలగలసిన స్థలపురాణం ఈమె.

సరే. ఒక దృశ్యం.
ఈమె అక్కడే ఆ మూల మలుపులో ఇలా కూచుంటుంది.
ఒక రోజు మట్టిని నేలమీద సాపు చేస్తూ ఉంటుంది. మరో రోజు ఆ మట్టిని తలపై చల్లుకుంటూ స్నానం చేస్తూ కనిపిస్తుంది. ఇంకోరోజు ధ్యానంలో కూచున్నట్టు కూచుంటుంది. మధ్యలో చిన్న డివైడర్ లాంటిది ఉంది. అడ కూచుంటుందోసారి.

ఇవి ఉదయాలు.
సాయంత్రాలు దగ్గర్లోని మజీద్ ముందు కూచుని ఉంటుంది.
ఒక్కోసారి మజీద్ పక్కనున్న ఇరానీ కేఫ్ లో ఛాయ కావాలన్నట్టు నిలబడి ఉంటుంది.

భర్త ఉన్నాడు. ఆయన స్థిమితంగానే ఉంటాడు. ఈమెనైతే అందరూ పిచ్చిదనే అనుకుంటారు.
ఆయన ఆకు నములుతూ ఉంటాడు. ఈమె కూడా ఏదో నముల్తుందిగానీ అర్థం కాదు.

ఒక మూసిన తలుపుల ఇంటి ముందరి ఒక చప్టా వంటిది ఒకటి ఉంటుంది.
ఈమెకు కాస్త దూరంలో ఆయన కాలుమీద కాలు వేసుకుని అక్కడ కూచుంటాడు.

బిడ్డా ఉంది. ఇరవై ఏళ్లుంటుంది. ఇప్పటికి మూడుసార్లు కానుపయింది.
పోయిన ఏడు ఎవరో కానుపు చేయిస్తామని, కాన్పు అయ్యాక బిడ్డను తమకే ఇవ్వాలని ఒప్పించి హాస్పిటల్ కు తీసుకెళ్లారట. బిడ్డ పుట్టగానే వీళ్లను బయటకు గెంటేశారట. ఆ దినాల్లో ఆమెను చూస్తే, గుండె తరుక్కుపోయింది. డైజెస్ట్ కానీ జీవన వాస్తవికత వల్ల వాంతి రావడం తక్కువ. ఒక కవిలా రాయవలసి వస్తే, వాళ్ల దీనావస్థకు గుండెలు అవిసిపోయి ఇక మళ్లీ ప్రపంచంపై స్పందనలుండవిక…

బిడ్డ బాలింతగా ఉన్నా ఈ తల్లిది పిచ్చినవ్వే.
డెలివరీ అయినా అంతే. అయి వచ్చాకా అంతే.

ఒక నిర్లిప్త గాయం.
ఆమె. ఈమె. ఆకాశంలో సగం అనిపించదు.మట్టిలో మెట్టిన భూదేవి అనిపిస్తుంది.

బిడ్డ. ఆమె కాన్పుకు ముందు వారం కనిపించలేదు. కాన్పు అయిన మూడో రోజు మళ్లీ ఇక్కడే…ఇదే వీధిలో…

అమాయకంగా నవ్వుతూ కనిపించింది. ఆ నవ్వు ముడతల్లో తెగని బొడ్డుతాడు కనిపించి మనసు కమిలిపోయింది.భర్తా, బిడ్డా కాకుండా అప్పుడప్పుడూ ఇంకో మహిళ కనిపిస్తుంది. ఆమె వీళ్లకు బంధువట.
ఇద్దరు పిల్లల్ని వేసుకుని వస్తుంది. కనిపిస్తే చేయి చాపుతుంది. కానీ వీళ్లెవరూ చేయి చాపరు.అడుక్కునే మనుషులు కాదు. బతుకులు.
అంతే.ఆంజనేయస్వామి దేవాలయం టర్నింగ్ నుంచి వీళ్లు మొదలవుతారు.
ముందు భర్త…పక్కనే కూచుని నవ్వుతూ బిడ్డ.
పది అడుగులు దాటాకా పూర్తిగా నేలపైనే కూచుని ఈ పిచ్చి తల్లి.ఈ చిత్రం ఈ వారం తీసిందే.
ఒక వాటర్ కలర్ చిత్రంలా ఆమె ఇలా కూచుండి కనిపించింది.
కన్నీరు రాదు. వస్తే ఆ చిత్రం ఇక చిత్రంచలేం.

ఎందుకో ఈ వారం వాళ్లిద్దరూ కనిపించలేదు. ఒక్కత్తే, ఇలా మోకాళ్లలో తల వంచుకుని ఉంది.
చలికాలం అయినందువల్లో లేక బయట ఉన్నది… లోన లేనిదీ ఏమీ లేదన్నట్టు ముసుగు తన్నినట్టూ ఈ మూట.తోడుగా మరికొన్ని మూటలు. ఒక గిలాస. అందులో ఒలిచిన బత్తాయి ఆకలిని, రుచినీ గుర్తు చేస్తూ…

మొత్తంగా మనిషి..ఆ మనిషి మూటలు.
ఈ మూటల్లో ఏముంటాయన్న కుతూహలం కాకుండా చెట్లు నీడలోంచి పడుతున్న నీరెండ వెలుతురు విస్తర్లు.. అవి అధికంగా అవి ఆకర్శించాయి. మనుషులు ఎలాగైనా బతకనీయండి. కానీ, వెలుతురు ఉంది. వెలుతురులో ఉన్నారు. చీకట్లోకి తలవంచుకున్నా వెలుతుర్లోనే ఉండటం జీవితపు రహస్యం అనిపిస్తుంది.

రోడ్డు మీద రహదారిని చెప్పే తెల్లటి మరకా ఒకటి. అదీ ఏదో చెబుతుంది.
బహుశా మన గురించి.

విశేషం ఏమిటంటే, వీళ్లను ఒక ఆశ్రమంలో వుంచడానికి ప్రయత్నం ఒకటి చేశాను. కానీ ఉండలేమన్నారు.
ఇరానీ కేఫ్ యజమాని కూడా చెప్పాడు. ఆ పని తామూ గతంలోనే చేశామని. ఉండరని!

ఇల్లు వాళ్లకు అలవాటు లేకపోవడం ఒకటి చిత్రంగానూ, విచిత్రంగానూ అనిపిస్తుంటే, ఒక పదేళ్లుగా ఈ దారి వెంట వెళుతూ వాళ్లను గమనిస్తూ ఉన్నందువల్లో ఏమో ఇక వాళ్లను ఎక్కడైనా చేర్చాలన్న ఆలోచన చచ్చిపోయింది.

కానీ అక్కడికి రాగానే గుండె మూలుగుతుంది.
ఆ బాధలోంచే ఈమెను, అతడిని, బిడ్డనూ ఎన్ని చిత్రాలు చేశానో.
విచారకరమైనవే కాదు, నవ్వు తెప్పించేవి కూడానూ.

బిడ్డ తండ్రి మోకాళ్లపై నిలబడటం…
తన ఎత్తున్న బిడ్డ అతడి మొకాళ్లపై నిలబడి నవ్వుతూ ఒకసారి కనిపించింది.
పిచ్చిగా అనిపించింది. కానీ, ఆ పాప నవ్వు చూసి ఆ నవ్వులో శృతికలప వలసే వచ్చింది.
చిత్రమేమిటంటే, బిడ్డ చేష్టలు చూసి ఈ తల్లి పళ్లన్నీ కనబడేలా నవ్వినప్పుడు ‘వీళ్లు నవ్వుతారు’ అనిపించి నవ్వు వచ్చింది. ‘చిత్రం’ చేశాను.

ముగ్గురూ కూచుండి మౌనంగా మాట్లాడుకున్నప్పుడూ ఎన్నోసార్లు చూశాను.
ఏం మాట్లాడుకుంటారో అర్థం కాదు. కానీ పరిపరి విధాలుగా వాళ్లను ‘చిత్రాలు’గా చేశాను.

రాత్రిళ్లు మజీద్ దగ్గరే ఉన్న చప్టాపై వాళ్లు ముగ్గురూ కూచుండి కనిపిస్తే, ‘త్రీ మంకీస్’ వలే అనిపించి గాంధీ సమాధి ఏదో గుండెలో కదులుతుంది.
కానీ. నిజం. వీళ్లు ఇక్కడి వారందరికీ తెలుసు. ఇలా వెళ్లేవారందరికీనూ తెలుసు.
వాళ్లు నవ్వుతారు. చిర్నవ్వు చిందిస్తారు. చల్లగా అనిపిస్తుంది. వింటర్ టేల్.
లోపల మృత్యువును తడిమే  జీవితపు దరహాసాలు. అందరికీ తెలుసు.

కానీ, ఒకటి మాత్రం నిజం.
రహదారి సాహిత్యం ఒకటి ఉన్నందువల్ల ఈ కాలిబాట మీది జీవితాలు అగోచరంగా ఉన్నాయి.
వాళ్లను చూసి మనం తోవలో ఆగి ఫొటో తీసినట్టు ఒక కథ రాయడం కాదు. వాళ్ల జీవితాలు ఎలా తెల్లారుతున్నాయో మరెలా నిద్రిస్తున్నాయో, మూగన్నుగా కలవరిస్తున్నది ఏమిటో ఎవరైనా రాయాలి.

ఎండకూ చలికి గాలికీ వాళ్లు అలా చెదలు పట్టని పుస్తకంలా ఎలా గంభీరంగా మన ప్రపంచ షెల్పుల్లోనే పడి ఉండటం పట్ల మనం దయ చూపాలి. వాళ్లను కనిపెట్టి చదవాల్సిందే. అందుకు చలికాలం మంచిది.

ఒక దుప్పటి కప్పి సేవానిరతిని ప్రదర్శించడం సులభం.
కానీ, ఒక్కో పువ్వును తెంపి కొంగులో వేసుకున్నట్టు, ఒక్కో చిత్రాన్ని రచించి గుండెతడి చేసుకున్నట్టు, సాహిత్యకారులు ఎవరైనా ఒకరు వీళ్ల బతుకుల్ని మూటగట్టాలి. లేదా ఆ మూటలు తెరవ ప్రయత్నించాలి.

భరద్వాజలా కాదు. జీవన సమరంలా కానే కాదు.
శ్రీశ్రీలా మార్పు కోసమూ కాదు. అధోజగత్ సహోదరుల్లా చూడటం కోసం కానైతే కాదు.
ట్యాంక్ బండ్ నడుం కింద చేతులేసిన తిలక్ లా కాదు. సుషుప్తిలోని మనిషి మృగచేతన చీకట్లో కరేల్మని కదిలే విధంగానూ కాదు.

సమాజం గురించి కలవరపడే బుద్ధిజీవుల్లా కానే కాదు. వ్యక్తిగతంగా శ్రద్ధ చూపే సామాన్యుల్లా.
ప్రజలుగా కాదు, మానవులుగా…

అంతదాకా చలికాలమే.
ముడుచుకుని ఆమె, మూటలో ఈమె.

a tale of winter…
నేను చిత్రిస్తూనే ఉంటాను, కాలిబాట మీది దృశ్యాదృశ్యాలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

Download PDF

5 Comments

  • చాలా బాగుందండీ మీరు చిత్రానికి చిత్రించిన దృశ్యాదృశ్యం….

  • Satyanarayana Rapolu says:

    ప్రజలుగా కాదు, మానవులుగా…

  • చాలా బావుంది. “ఒక దుప్పటి కప్పి సేవానిరతిని ప్రదర్శించడం సులభం.
    కానీ, ఒక్కో పువ్వును తెంపి కొంగులో వేసుకున్నట్టు, ఒక్కో చిత్రాన్ని రచించి గుండెతడి చేసుకున్నట్టు, సాహిత్యకారులు ఎవరైనా ఒకరు వీళ్ల బతుకుల్ని మూటగట్టాలి. లేదా ఆ మూటలు తెరవ ప్రయత్నించాలి.”

  • “ఒక దుప్పటి కప్పి సేవానిరతిని ప్రదర్శించడం సులభం.
    కానీ, ఒక్కో పువ్వును తెంపి కొంగులో వేసుకున్నట్టు, ఒక్కో చిత్రాన్ని రచించి గుండెతడి చేసుకున్నట్టు, సాహిత్యకారులు ఎవరైనా ఒకరు వీళ్ల బతుకుల్ని మూటగట్టాలి. లేదా ఆ మూటలు తెరవ ప్రయత్నించాలి.” చాలా బావుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)