అనుబంధాల టెక్నాలజీ

chinnakatha
‘ప్చ్’ అన్నాడు అప్రయత్నంగా శేషాచలం.
‘ఏమిటి శేషు అంత నిరాశ గా వున్నావు” పార్కులో పక్కనే కూర్చున్న రామనాధం అన్నాడు శేషాచలం తో.
“ఏమిటో చాలా విషయాలు అర్థం కావటం లేదు”
“రిటైర్ అయినవాళ్ళం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినవాళ్ళం, ఇప్పుడు అర్థం కాని విషయాలు ఏముంటాయి?” నవ్వుతూ అన్నాడు రామనాధం.
“అది మనజీవితం రామూ, సమస్యలు వచ్చాయి…ప్రయత్నం చేసాము, కష్ట పడ్డాము…ఎన్నో ఎదుర్కున్నాము. కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నది చిత్రమైన సమస్య….”
“నాకు తెలియకుండా నీకు వచ్చిన చిత్రమైన సమస్య ఏమిటో”
“చిన్నప్పుడు మనమెలా పెరిగామో ఒక సారి గుర్తు చేసుకో.”
“ఎలా పెరిగాము …గవర్నమెంటు స్కూలులో పాఠాలు, రాత్రి పూట నాన్నమ్మ చెప్పే రామాయణ కథలూ, తాతగారితో షికారు వెళ్ళినప్పుడు చెప్పే పులి వేట కథలూ…చెరువులో చేపలు పట్టడం ….. మామిడి చెట్టెక్కి కాయలు కోయడం…ఇంకా గోళీల ఆట, జిల్లకోడి అంటూ కట్టేని ఎగర కొట్టడం….ఓహ్ …ఎంత బాగుండేది కదా”
“అవును కదా ….ఇన్ని విశేషాలతో పెరిగిన మనం ….మన సాంప్రదాయాలు ఎన్నో తెలుసు కున్నాం. మరి ఈతరం వాళ్లకు ఏమి చెప్పబోయినా, ఏది నేర్పబోయినా ఎందుకు నచ్చడం లేదు? పైగా ఈ వయసులో మనవాళ్ళకు దగ్గర కావాలని, వాళ్ళతో ఆడుకోవాలని అనిపిస్తుంది కదా….’
“ఓహ్ ..అదా నీసమస్య…..కాలం మారిందిరా..’
“మారింది కానీ పెద్దమనవడికీ..చిన్న మనవడికీ..మద్య కాలం కూడా చాలా మారింది..”
“ఎలా ?”
“ఇలా ……”

“ఎందుకు విరాజ్ ఇలా ?” అన్నాడు శేషాచలం
“నేనేమీ చెయ్యలేను నాన్నా” చేతులు పైకి ఎత్తేసి అంటూన్న కూతురు భావన ను చూసి నిర్ఘాంతపోయాడు శేషాచలం.
తను చేసింది కంప్లైంటు కాదు…వివరణ మాత్రమె…
ఎంత మార్పు వచ్చింది కాలం లో….
పెద్ద మనవడు తేజ ఆరేళ్ళ ప్పుడు చేపలు పట్టడం నేర్పితే ఎంత సంబర పడ్డాడు!
ఎగిరి గంతేసి తాతయ్యను పట్టుకుని గిరగిరా తిరిగాడు. తిరిగి చేపను వదిలెస్తూ చంపడం మంచిది కాదు అంటే ఎంత ఆసక్తిగా విన్నాడు!
రాత్రిపూట తను చెప్పే హనుమాన్ కథలూ, కృష్ణుడి వెన్న దొంగతనాలు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని ప్రశ్నలు వేసేవాడు…
ఇవన్నీ ఇప్పుడు రెండో మనవడు విరాజ్ కు ఎందుకు నచ్చడం లేదు??
వీడికీ ఇదే వయసు కదా…ఎక్కడ తేడా?…
భావనా వాళ్ళు మూడేళ్ళు అమెరికా వెళ్లి వచ్చాక ఇప్పుడే తన ఇంటికి రావవటం….
తేజా తాతను చూసి సంబరపడ్డా చిన్నవాడు ఆరేళ్ళ విరాజ్ దగ్గర చేరలేదు. కొత్త అనుకున్నా..నెమ్మదిగా చేరువ చేసుకోవాలని చూసాడు శేషాచలం.
దగ్గర కూర్చో బెట్టుకుని “ హనుమాన్ కథలు చెబుతా రారా” అంటే
“వద్దు. నాకు తెలుసు “ అని పారిపోయాడు.
“ తెలుసా అన్నీ?”
“తెలియక పోయినా ఐపాడ్ లో చూసుకో వచ్చు”
“పోనీ ఫిషింగ్ పోదామా “
“వద్దు. ఐ డోంట్ లైక్”
“ఎందుకురా బాగుంటుంది”
“టూ ఈజీ తాతయ్యా”
“టూ ఈజీ నా?”
“ ఎస్ తాతయ్యా, I play in the internet games”
“ఇది real గా నాన్నా”
“నో తాతయ్యా “
అదే చెప్పబోయాడు కూతురితో శేషాచలం “అన్నీ తెలుసనుకుంటే ఎలాగమ్మా, నేర్చుకోవాలి కదా. పెద్దలు చెప్పింది వినాలి కదా….” అని
భావన మాత్రం “ నేనేం చెయ్యలేను నాన్నా” అని చేతులు పైకి ఎత్తేసింది.
ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. మన ఆచారాలూ, సాంప్రదాయాలు…పురాణాలు కథలు కథలుగా నేర్పాలనుకోవడం తప్పేలా అవుతుంది?
మనం చెప్పినది వినే పరిస్థితిలో ఎందుకు లేరు?
ఆలోచిస్తే హనుమాన్ కంటే spiderman …..సూపెర్ గా కనపడతాడే మో.
అలాగే చందమామ కథల కంటే dianosaurus, చెక్క బొమ్మలకంటే బార్బీ బొమ్మలు, బ్యాటరీ తో రయ్ మని పరుగెత్తే ట్రక్కులు, కార్లూ….interesting గా కనబడుతున్నాయి…..
ఇలా అయితే మనవడికి దగ్గర కావడం ఎలా?….
శేషాచలం సమస్య ఏమిటో బాగా అర్థం అయ్యింది.
“ఇలాటివి ఈ రోజుల్లో అందరు బామ్మలూ, తాతలూ ఎదుర్కునేదే. పెరుగుతున్న టెక్నాలజీ తో మనం కూడా ఎదుగుదాం అనుకున్నామంటే సరి…..” రామనాధం సమాధానం నచ్చలేదు శేషాచలం కు.
“ఈ వయసులో మనం ఎదగాలంటావా?”
“ఒక సారి ఆలోచించు…మనం పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు వీళ్ళు పెరుగుతున్న కాలం వేరు..రామాయణ కథలు లాటివి ఆనిమేటెడ్ క్యారెక్టర్స్ తో చక్కగా వివరించే C D లు వున్నాయి లేదా తీరిక వున్నప్పుడు కంప్యూటర్ లో చూసుకునే అవకాసం వుంది. ఏది తెలియక పోయినా google search చేసుకునే కాలం వీరిది.
అంతెందుకు నేను సైకల్ నేర్చుకోవడానికి పదిరోజులు పట్టింది ఆ రోజుల్లో. నా మనమడు పదినిముషాల్లో నేర్చుకున్నాడు ఎలా అంటే వాడి ఆటల్లో శరీరాన్ని బేలెన్స్ చేసుకునేవి చాలా వున్నాయి. అందుకే సైకల్ ఎక్కగానే బాలెన్స్ చేసుకుని తొక్క గలిగాడు.
అంతేకాదు ఇప్పటి పిల్లలకు, టెన్నిస్, పియానో, చదరంగం అని ఎన్నో క్లాసులకు తీసుకెడతారు..స్కూల్ లో కూడా సైన్స్ క్లబ్బులూ, వారానికి ఒక టాపిక్ మీద మాట్లాడ్డం నేర్పిస్త్తారు. అందుకే వాళ్ళు అంత అడ్వాన్సెడ్ గా వున్నారు…వీళ్ళు చూసే హ్యారీపాటర్ సినిమాలు, డిస్కవరీ చానెళ్ళు మనం చూసామా ?
కాబట్టి వాళ్లకు దగ్గరవ్వాలంటే మనమూ కాస్త అడ్వాన్స్ అవ్వాలి….ఇదీ నేను తెలుసుకున్న థియరీ…..
ఎక్కవగా ఆలోచించి బి.పీ. పెంచుకోకు..”అంటూ భుజం తట్టాడు రామనాథం.
తనను పాత చింతకాయ పచ్చడి అనుకోకుండా మనమడికి దగ్గర అవ్వడం ఎలా అని ఆలోచించాడు ఆరాత్రి.
మరురోజు పొద్దున్న టిఫిన్లు అయ్యాక
“విరాజ్ …ఈ రోజు నీవు నాకు నీ ఐపాడ్ మీద గేమ్స్ ఆడటం నేర్పుతావా?” అని అడిగాడు మనవడిని.
“ఓ” అంటూ తాతయ్య చేతులు పట్టుకున్నాడు విరాజ్.
ఆ రోజు రాత్రి పక్కన పడుకున్న విరాజ్ ని అడిగాడు స్పైడర్ మ్యాన్ కథ చెబుతావా అని.
“నో తాతయ్యా నీవు చెప్పు నాన్నమ్మని ఫస్ట్ టైం ఎలా కలిసావో….”
దానికి విసుక్కోకుండా తను నాన్నమ్మని పెళ్ళిచూపుల్లో మొదటిసారి చూసిన ఘట్టం చెప్పసాగాడు శేషాచలం.
అనుబందాల టేక్నాలజీ కూడా మారాలి మరి!!!

Download PDF

6 Comments

 • nagarajarao says:

  ఈ కదా చాలా బాగుంది.

  • లక్ష్మి raghava says:

   అమెరికా వెళ్ళిన ప్రతి సారీ ఒక కొత్త అనుభవం! నాకు తోచిన సొల్యుషన్ ఇది. మీకు నచ్చినందుకు ఎంతో బాగా అనిపించింది. నాగరాజారావు గారూ.

 • nagarajarao says:

  ఈ కధ నాకెంతో నచ్చింది. కారణం ఇందులో పాట ముందు కాలం వారు మారేకాలం బట్టి మారుతూ ఉండాలన్న సందేశం ఉంది. అది చాలా మంది తెలుసుకోలేక అనవసరంగా చాలా బాధ పడుతూ ఉంటారు.

 • మీ కథ బాగుంది లక్ష్మి గారూ. మంచి సందేశం.

  • Lakshmi raghava says:

   Dhanyavadaalu భానుమతి గారు, సమ్మెట ఉమాదేవి గారు

 • sammeta umadevi says:

  పిల్లలకు చేరికవ్వాలంటే మును మనం వారి మార్గం లోనే నడవాలి .. వాళ్ళ స్థాయికి చేరుకొని ఏమి నేర్పినా నేర్పాలి ..పిల్లు పెద్దవాళ్ళ దగర ఎన్నో నేర్చుకోవాలి అలాగే పెద్దవాళ్ళు ఇప్పటి సాంకేతికను అంది పుచ్చుకోవాలి …మంచి కథను అందించిన లక్ష్మి గారికి ధన్య వాదాలు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)