ఈమె ‘చేతల’ సరస్వతి…

సరస్వతి

 

“ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? ఆర్థిక ప్రగతి అయిదు శాతమో పది శాతమో ఉంటే సంతోషం రెట్టింపు అవుతుందా? సున్నా శాతం ఎదుగుదల ఉంటే ఏమవుతుంది? ఇది ఒక రకంగా స్థిరమయిన ఆర్థిక విధానం కాదా? సాధారణమైన జీవనం గడుపుతూ అన్నిటినీ తేలికగా తీసుకోగలగటం కంటే మించినది మరేదైనా ఉందా?” — మసనోబు ఫుకుఒకా.

ఈరోజు కొంతమంది మాట్లాడే ఈ మాటలు జపాన్ ప్రకృతి సేద్యకారుడు ఫుకుఒకా నలభై ఏళ్ల కిందటే చెప్పాడు.

మేడిన్ చైనా విశ్వరూపం చూసి మురిసి , అమెరికన్ డాలర్ మెరుపు కలల్లో తూగి, మేక్ ఇన్ ఇండియా సంస్కృతిలోకి రాకెట్ వేగంతో “ఆ విధంగా ముందుకు పోతున్న” మనకు, ఫుకు ఒకా ఓ ఆదిమానవుడిలా కనిపిస్తాడు. కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఉన్న పర్యావరణ వాదులనబడే జీవులు కూడా అలాగే కనిపిస్తారు. మనమే చేతులారా పెంట పోగులా తయారు చేసుకున్న భూమ్మీదనుంచి, పోగేసుకున్న డబ్బుతో సహా పారిపోయి (బడుగు జీవాత్మలను ఇక్కడే వదిలేసి) ఏ గాలక్సీ ల్లో ఇళ్ళు కడదామా అనేంత ప్రగతి యుగంలో ఉన్నప్పుడు ఒక్క అడుగు వెనక్కు వెయ్యడమంటేనూ, ఒక్క రోజైనా ఎండని గానీ చలిని గానీ భరించడమంటేనూ డబ్బు చేసుకున్నవాళ్ళలో చాలా ఎక్కువమందికి ఎంతో కష్టం. ఆర్ధిక ప్రగతి రాల్చే చుక్కలు సరిగ్గా ఇంకని బతుకుల్లో మాత్రమే మిగిలిన పంచభూతాల తీవ్రతను నిజానికి అందరూ సమానంగా అనుభవించాలని చెప్పే పర్యావరణ వాదులను దూరం పెట్టేవాళ్ళే ఎక్కువ.

***

‘సరస్వతి కవుల’ అసలైన పర్యావరణ వాది. పర్యావరణ సంరక్షణ గురించిన చర్చలు పూర్తయిన తరువాత ఆ విషయాలు మాట్లాడేవాళ్ళ లో ఒక్కరు కూడా ఆ మీటింగ్ గదిలో ఫ్యాన్లూ లైట్లను ఆపకుండా వెళ్ళిపోతే ఎంతో చిరాగ్గా ‘ఇదేం అన్యాయం?’ అంటూ వ్యాసం రాసేసే సున్నితమైన మనసున్న మనిషి. రకరకాల సంస్థల్లో పనిచేసేవాళ్ళలో, చెప్పిన విషయాన్ని తమ జీవితంలో చేసి చూపించేవాళ్ళు అరుదు. చెప్పిందే చేసే సరస్వతి అందువల్లేనేమో, సంస్థల్లో కంటే ఒంటరిగానే తనపని తను చేసుకుంటూ పోతోంది.

నర్సీపట్నం దగ్గర రంగురాళ్ళ కోసం తవ్వకాలు విపరీతంగా జరిగే రోజుల్లో ధైర్యంగా అక్కడికి ఓ కామెరా పట్టుకుని వెళ్ళిపోయి ఆ విషయం మీద, అక్కడ జరిగే అన్యాయాలమీద 2004 లో చిన్న డాక్యుమెంటరీ తీసింది. దీనితో ఆమె చాలామంది దృష్టిలో పడింది. కొన్నేళ్ళపాటు ఆ ప్రాంతం మీద జరిగిన రేప్ ను కొద్ది రోజుల్లోనే ఒక్క విషయమూ వదలకుండా రికార్డ్ చేసింది. ఆ రోజుల్లో పత్రికలూ బాగానే రాశాయి. కానీ సరస్వతి కామెరాతో రికార్డ్ చేసింది కాబట్టి ఆ విషయమేమిటో పూర్తిగా తెలుసుకోవాలనుకునే భవిష్యత్తుకి అది ‘కుప్పుసామయ్యర్ మేడీజీ’… ఈ మేడీజీ లు డాక్యుమెంటరీల వల్లే సాధ్యమౌతున్నాయి కాబట్టే మనం బతుకుతున్న కాలంలో ఇవి గొప్పవి. విషయంతో బాటు ‘కలాపోసన’ కూడా చేయగల్గితే డాక్యుమెంటరీలను మించినవి ఏముంటాయి ? హోషంగ్ మర్చంట్ మీద “My  Dear Gay Teacher” అంటూ సరస్వతి తీసిన డాక్యుమెంటరీ లో కాస్త కళాపోషణ కూడా కనిపిస్తుంది. సరే ఇదిలా ఉంచితే, “Behind The Glitter” అనే రంగురాళ్ళ కథ ఏమిటో సరస్వతి డాక్యుమెంటరీ ద్వారా గుర్తు చేసుకుంటే …

తొంభైల్లో విశాఖ దగ్గర, నర్సీపట్నం దాపునున్న కొండల్లో వజ్రాల్లాంటి రంగురాళ్ళు దొరుకుతున్నాయని తెలియగానే నెమ్మదిగా తవ్వకాలు మొదలయ్యాయి. 2000 సం. లో alexandrite అనే మరీ విలువైన, నగల్లో వాడే రాయి దొరుకుతోందని తెలియగానే అక్కడి ఘరానా మనుషులే కాకుండా పక్క రాష్ట్రాలవాళ్ళు కూడా దిగిపోయేరు. అక్కడే ఉండే చిన్న చిన్న గూండాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, అందరూ సిండికేట్లు గా తయారైపోయి తవ్వకాలు జోరు చేశారు. అక్కడే బ్రతికే కొండవాళ్లకు, ఎక్కడినుండో కూలిపనికి వచ్చిన వాళ్లకు ఆ రాళ్ల విలువేమిటో తెలీదు; దొరికిన రాళ్ళను యజమానులకు అప్పచెప్పటం, రెండొందలో మూడొందలో తీసుకుంటూ, వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన బందెల దొడ్లలో బతకటం తప్ప… నిదురలో ఆదమరుపుగా వున్న ఆ కొండ పల్లెల్లోకి ఒక్కసారిగా ప్రైవేటు బస్సులూ, గుళ్ళూ గోపురాలూ, జీన్ పేంటులూ, కాస్మెటిక్స్, సెక్స్ అవసరాలు తీర్చే ఆడవాళ్ళూ, ఎయిడ్స్ రోగాలూ, అన్నీ బారులు తీరాయి. కాస్త డబ్బులు కళ్ళ చూసిన వాళ్ళు ఆ గ్రామాల్లోనే పక్కా ఇళ్ళు కట్టుకుంటే, ఎక్కువమంది వెర్రివాళ్ళు కూలోళ్లుగానే మిగిలారు. ఈ వరసనంతా అక్కడి జనం పూర్తిగా ఎరుక పరిచారు సరస్వతి డాక్యుమెంటరీలో.

“మా పరంటాన వజ్రాలు పడ్డాయి. మా కుర్రోలు ఓ పదిమంది ఎల్నారు. ఎల్తే ఒకో పదిమంది నాలుగు ఉజ్జీలు కట్టుకొని ఆలే తవ్వుకుంటన్నారు గానీ ఈలని తవ్వనివ్వలేదు” – అంటాడు అమాయకంగా ఓ మనిషి.

“ఇదంతా అయిపోయేక మా బాధలేటి? మొత్తానికి అడివి పీకేస్తుంటే మా పిల్లలకేముంటదక్కడ?” అనెంతో బాధగా అడుగుతుంది మరో కొండ మనిషి.

ఇంకో ఆడమనిషి భర్త అనుమతితోనే తను కుటుంబ కష్టాలు తీర్చటం కోసం అక్కడికొచ్చి వ్యభిచారం చేస్తున్నట్టు సామాన్యంగా చెప్తుంది.

ఎర్ర చందనం స్మగ్లర్లు రాయలసీమ అడవుల్లో చేసిన ప్రకృతి భీభత్సం లాటిదే ఇదీ అయినా, సరస్వతికి కాస్త జాగ్రత్తగానైనా ధైర్యంగానే ఈ డాక్యుమెంటరీ తీసే అడ్డంకులు లేని వెసులుబాటు 2004 లో దొరికింది. ఫారెస్టు అధికారుల్ని కూడా చంపి పారేసేంత క్రౌర్యం చందనం స్మగ్లర్లు చూపిస్తే, అంత అవసరం లేకుండా అమాయకుల్ని ఉపయోగించి ‘కరక’ లాంటి గ్రామాల్లో రంగురాళ్ళు తవ్వేసుకున్నారు పెద్దమనుషులూ వ్యాపారులూ. ఎవడికో ఆ రాళ్ళను ఇవ్వటం కోసం కొండ తవ్వుతూ కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.

సరస్వతి ఇంకా రకరకాల సమస్యల మీద NGOల కోసం పది పన్నెండు డాక్యుమెంటరీలు తీసింది. వీటిలో ఆమె రైతుల సమస్యలు చర్చించింది. రసాయనిక వ్యవసాయంతో రైతు పడే పాట్ల లోతులను తాకింది. సేంద్రీయ వ్యవసాయం మంచిదని హితబోధ చేసింది. మూసీనదిని పాడు చేసిన మనుషుల, అధికార్ల మురికితనాన్ని బైటపెట్టింది. చేపలు పట్టేవాళ్ళ జీవితాల్లో మరపడవలు రేపిన కల్లోలాన్ని కాస్త చూడమంది. ఈమధ్య పోలవరం బాధితుల గోడును రికార్డు చేసింది. థర్మల్, అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు చేసే నిరసనల్లో పాల్గొంది. కొవ్వాడలో రాబోయే అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టడానికి ప్రయత్నం చేసింది.

ప్రజల బాధల్ని డాక్యుమెంటరీలుగా చేస్తూ సంపాదించే ఆ కాస్తడబ్బుమీద బతకటం కూడా సరైనపని కాదని భావించేంత రొమాంటిక్ సరస్వతికి సమస్య తమ ఇంటి గుమ్మం దాకా వచ్చేవరకూ మనుషులు ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ బతికే భద్ర జీవితాలను ఉతికి ఆరేసే తత్వంతో ఎదుటి మనిషి ఇబ్బందిగా అటూ ఇటూ చూసి నత్తగుల్లలా ముడుచుకుపోయే పరిస్థితి కల్పిస్తుందీమె. అయినా ఆమె నిజాయితీకి మాత్రం ఎవరూ వంక పెట్టలేరు.

***

“నీ స్నానానికి ఒక్క బకెట్ నీళ్ళు మాత్రం ఇవ్వగలను” – అంది సరస్వతి.

ఆమె ఇప్పుడు ఓ కొండరాళ్ళ వరుస నానుకున్న చిన్న పొలంలో వ్యవసాయం చెయ్యటానికి ప్రయత్నిస్తోంది. ఇది అన్ని సౌకర్యాలతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుని పచ్చిగాలి పీల్చటం కోసం చేసే డబ్బున్న హాబీ వ్యవసాయం కాదు. పట్నాల్లో పరుగులతో విసుగెత్తి పల్లెస్వర్గానికి వెళ్ళిపోవాలని కలలు కనే మధ్యతరగతి రొమాన్స్ కూడా కాదు. అసలైన రైతు తత్వాన్ని ఇంకించుకుని, ఆధునికత్వాన్ని వదిలించుకుని, నేలతో మనసును ముడేసుకోవాలనుకునే ఆలోచన నుండి పుట్టిన ఆచరణ. పొలంలోనే ఓ రెండు గదులూ, చిన్న వరండా, పైన రేకుల కప్పు. మట్టి, ఇటుక, పైన సన్నని సిమెంట్ పూతతో కట్టిన ఆమె చిన్న ఇంటి ముందు వేప, సీతాఫలం చెట్లు, వంటింటి వాడకం నీళ్ళతో పచ్చగా మెరిసే అరటి చెట్లు… మెరిసే మూడు సోలార్ పానెల్స్ నుంచీ వచ్చే శక్తి ఓ రెండు బల్బులూ, ఓ ఫ్యాన్ వాడుకుందుకు సరిపోతుంది. ఈ చక్కటి నిరాలంకారమైన దృశ్యం అమరేముందు ఆమె పడిన పాటు తక్కువేమీకాదు.

ఆ ఉదయపు పచ్చి గాలుల్లో వరండా ముందు ఏపుగా ఎదిగి చిన్నగా ఊగుతున్న కంది మొక్కలు. కొన్నేళ్లలో తప్పక చెట్లయి నీడా, పళ్ళూ ఇస్తామని చెప్తున్న మామిడి మొక్కలు. ఎప్పటికీ నీ తోడు వదలం అంటున్న మొండి ఆముదం చెట్లు. ట్రాక్టర్ చాళ్ళ వెంట పురుగుల్ని హుషారుగా ఏరుకుంటున్న కొంగల వయ్యారి నడకలు … చిన్న హైకూ కవితలా బతికేస్తే సరిపోదా?

ముందురోజు రాత్రి దబదబా తలుపులు కొడుతున్న చప్పుడయి ఉలిక్కి పడ్డాను. ఊరికి దూరంగా ఉన్న ఆ పొలంలో ఇద్దరమే ఉన్నామన్న ధ్యాస టకీమని నెత్తిమీద కొట్టింది నన్ను. ఇంతకీ అది ఉడతలు చేసే హంగామా అట. రేకులమీదా తలుపులమీదా కొడుతూ సరస్వతి ప్రపంచంలో మేమూ సభ్యులమే అని ప్రకటన చేస్తూ ఉంటాయట. దూరంగా ఉన్న నల్లటి ఎత్తయిన రాళ్ళ వరుసలో ఉన్న రంగులున్న, రంగుల్లేని పిట్టలూ, నెమళ్ళూ అలా ఓ సారి పొలాన్ని పరామర్శించి, పాట కచేరీలు కూడా చేసి వెళ్తూ ఉంటాయి.

ఆ కొండలో ఎన్నో పక్షులూ జీవాలూ ఉన్నాయని, దానిని అలాగే వదిలెయ్యమని సరస్వతి అధికారులతో, కోర్టుతో ఎంత మొత్తుకున్నా విదేశాలకు సమాధిరాళ్ళు పంపించి డబ్బు చేసుకునే మనుషులు దాన్ని వదలలేదు. ఆ రాళ్ళ అదృష్టం బాగుండి అవి ఆ విదేశీ సమాధుల షోకుకు పనికిరాక పోవటంతో కాంట్రాక్టర్ ఆ పని వదిలి వెళ్ళాడు. ఇంకే నరుడి దృష్టికి ఆ నల్ల రాళ్ళు మళ్ళీ పగులుతాయో చెప్పలేం.

వర్షాధారపు భూముల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ నిలబడటానికి అమ్మ సాయంతో నడుం వంచి తను చేస్తున్న ప్రయత్నం ఒక్కో సంవత్సరం ఒక్కో రకం ఫలితాన్ని ఇస్తోంది. ఆ ఊళ్ళో ఉన్న రైతులంతా కొర్రలు, జొన్నలు వంటి పంటలు ఉంటాయని కూడా మర్చిపోయిన గ్రీన్ రెవల్యూషన్ తరం. వాళ్ళంతా నీళ్ళ కోసం తాపత్రయపడుతూనే మందులు జల్లి జోరుగా వరి మాత్రమే పండిస్తూ ఉన్నపుడు సరస్వతి కొర్రలు పండించింది. “మా దేశానికి కొర్రలు మల్ల తెచ్చినవా బిడ్డా” అని అనుభవాల ముడతలతో మొహాన్ని సింగారించుకున్న ఓ పండు ముసలామె మురిస్తే, ఆ మొహంలోని ముడతలన్నీ సాగి ఆనందంతో మెరవటం మరవలేను.

ఏదెలా ఉన్నా, ఏ శక్తులు ఎంత భయపెట్టినా, తను సమాజంలో కోరుకుంటున్న మార్పే తానయి బతికే ఇలాంటి సరస్వతులు చేస్తున్న పనే వృధా పోకుండా ఎప్పటికైనా భూమిని బతికిస్తుంది.

సరస్వతి డాక్యుమెంటరీల కోసం ఇక్కడ చూడండి.

http://saraswatikavula.weebly.com/

-ల.లి.త.

lalitha parnandi

 

 

 

 

 

 

 

 

Download PDF

4 Comments

 • ‘ఆర్ధిక ప్రగతి రాల్చే చుక్కలు సరిగ్గా ఇంకని బతుకుల్లో మాత్రమే మిగిలిన పంచభూతాల తీవ్రతను …’
  ‘అనుభవాల ముడతలతో మొహాన్ని సింగారించుకున్న ఓ పండు ముసలామె మురిస్తే, ఆ మొహంలోని ముడతలన్నీ సాగి ఆనందంతో మెరవటం’
  ‘ఏదెలా ఉన్నా, ఏ శక్తులు ఎంత భయపెట్టినా, తను సమాజంలో కోరుకుంటున్న మార్పే తానయి బతికే ‘
  ఆహా.ఎంత పవర్ ఫుల్ వాక్యాలు!
  సరస్వతి గారి గురించి తెలుసుకోవటం బాగుంది.

 • నిశీధి says:

  చాల మంచి ఆర్టికల్ , very informative . Thanks for sharing with us

 • sasi kala says:

  భూమి తల్లి ఈ బిడ్డను చూసి మురిసి పోయి ఉంటుంది . అభినందనలు

 • saraswati says:

  naa gurinchi evaru eppudu inta baaga rayaledu. i am not sure if i deserve so much praise. but thanks very much lalita. also you have picturized the life on farm very well.. many many thanks once again.
  of course, you are a brilliant writer. that is why everything sounds so good.

  warmly
  saraswati

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)