పూల రాణి కూతురు

flower queens daughter 2

MythiliScaled

అనగా అనగా ఒక రాజకుమారుడు. ఒక రోజు ఉదయాన ఉల్లాసంగా గుర్రం మీద షికారు వెళ్ళాడు. పోగా పోగా  పెద్ద మైదానం వచ్చింది. దాని మధ్యనొక బావి. అందులోంచి ఎవరో ఏడుస్తూ పిలుస్తున్నట్లు వినబడింది. చూస్తే లోపల ఒక ముసలావిడ పడిపోయి ఉంది. రాజకుమారుడు గబ గబా ఆమెని పైకి లాగాడు. ఆమె ఎక్కడిదో ఏమిటో అడిగాడు.

” నాయనా, నీ దయ వల్ల బతికాను. లేదంటే ఇక్కడే చచ్చిపోయిఉండేదాన్ని . మా ఊరు ఇక్కడికి దూరం. ఈ పక్కన  పట్టణం లో పొద్దున్నే సంత జరుగుతుంది. అందులో గుడ్లు అమ్ముకునేందుకని చీకటితో బయల్దేరి చూపు ఆనక ఇలా పడిపోయాను, ఇంక వెళ్ళొస్తాను ” – ఆమె చెప్పింది.

రాజకుమారుడు  – ” అవ్వా, నువ్వు నడిచే పరిస్థితిలో ఎక్కడున్నావు, ఉండు, నిన్ను దిగబెడతాను ” అని ఆమెని ఎత్తి గుర్రం మీద కూర్చోబెట్టుకుని బయల్దేరాడు. అడవి అంచున ఉన్న ఆమె గుడిసెకి ఇద్దరూ వెళ్ళారు. దిగి లోపలికి వెళ్ళబోతూ ముసలావిడ ” ఒక్క నిమిషం ఆగు, నీకొకటి ఇస్తాను ” అని , ఒక చిన్న గంటను తీసుకొచ్చి ఇచ్చింది అతనికి. ” బాబూ, నువ్వు వీరుడివి, అంతకు మించి ఎంతో దయగలవాడివి.  పూలరాణి కూతురు అందం లోనూ, మంచితనం లోనూ నీకు తగిన భార్య. ఆమె నాగేంద్రుడి కోటలో బందీగా ఉంది. విడిపించి పెళ్ళి చేసుకో. ఈ గంట ని ఒకసారి మోగిస్తే గండ భేరుండాల రాజు వచ్చి నీకు సాయం చేస్తాడు. రెండు సార్లు మోగిస్తే నక్కల రాజూ, మూడు సార్లు మోగిస్తే చేపల రాజూ వచ్చి నీ కష్టం తీరుస్తారు. వెళ్ళిరా, నీకు శుభం జరుగుతుంది ” అని మాయమైంది, గుడిసె తో సహా.

అప్పటికి రాజకుమారుడికి ఆమె ఎవరో దేవకన్య అని అర్థమైంది. గంటని భద్రంగా దుస్తులలో దాచుకుని కోటకి వెళ్ళాడు. వాళ్ళ నాన్నకి అంతా చెప్పి పూలరాణి కుమార్తెని వెతికేందుకు మరుసటి రోజున ప్రయాణమయాడు. ఏడాది పొడుగునా తెలిసిన ఊళ్ళూ తెలియనివీ గాలించాడు. పూలరాణి కూతురు ఆచూకీ ఎక్కడా తెలిసిందే కాదు. బాగా అలిసిపోయాడు. చివరికి ఒక రోజు ఒక చిన్న ఇంటి ముందర చాలా ముసలిగా కనిపించే ఒకతన్ని చూసి అడిగాడు – ” తాతా, నాగేంద్రుడు ఎత్తుకుపోయిన పూల రాణి కూతురు ఎక్కడుంది ? ”

flower queens daughter 2

” నాకైతే తెలీదుగాని, ఈ దారమ్మటే, అటూ, ఇటూ చూడకుండా   ఒక సంవత్సరం వెళ్ళావా, ఇటువంటి ఇల్లే ఇంకొకటి వస్తుంది. అది మా నాన్నది. ఆయనకి  తెలిసి ఉండచ్చు, బహుశా ” ముసలివాడు జవాబు చెప్పాడు. రాజకుమారుడు అలాగే వెళ్ళాడు .  ముసలివాడి తండ్రి , ఇంకా ముసలివాడు – కనిపించాడు. కాని అతనికీ సమాచారం తెలీదు. అతని సలహా ప్రకారం ఇంకొక ఏడు అదే దారి వెంట ప్రయాణించి అతని తండ్రి ఇంటికి చేరాడు రాజకుమారుడు. ఈ ముసలితాత మాత్రం చెప్పాడు – ” అవును, ఆ నాగేంద్రుడి కోట ఆ కనబడే కొండ మీదేగా ఉంది ! ఇవాళే ఆయన నిద్ర మొదలెడతాడు, ఈ ఏడంతా నిద్ర పోయి వచ్చే ఏడంతా మేలుకుంటాడు. అయితే, ఆ పక్కన కొండ మీద నాగేంద్రుడి తల్లి ఉంటోంది. రోజూ  రాత్రి విందు చేస్తుంది ఆవిడ, పూలరాణి కూతురు ప్రతి రాత్రీ  అక్కడికి వెళుతుంది ” .

రాజకుమారుడు తాతకి కృతజ్ఞతలు చెప్పుకుని రెండో కొండ ఎక్కి నాగేంద్రుడి తల్లి కోటకి వెళ్ళాడు. అది బంగారపు కోట, కిటికీ లకి వజ్రవైఢూర్యాలు తాపడం చేసి ఉన్నాయి. తలుపు తెరిచి లోపలికి వెళ్ళేలోపు ఏడు సర్పాలు వచ్చి అతన్ని అడ్డగించాయి. రాజకుమారుడు యుక్తిగా జవాబు చెప్పాడు – ” నాగ రాణి ఎంతో అందమైనదనీ పెద్ద మనుసున్నదనీ విన్నాను. ఆవిడ దగ్గర కొలువు చేసేందుకని వచ్చాను ” . సర్పాలు ఆ మాటలకి సంతోషించాయి, రాజకుమారుడిని వెంటబెట్టుకుని నాగరాణి దగ్గరికి తీసుకు వెళ్ళాయి.

రత్నాలు చెక్కిన సిం హాసనం మీద నాగరాణి కూర్చుని ఉంది. ఆమె నిజంగానే చాలా అందంగా, కాని భయం పుట్టించేట్లుగా ఉంది… ” ఎందుకొచ్చావు ? ” రాజకుమారుడిని అడిగింది. అతను తడబడకుండా మళ్ళీ చెప్పాడు – ” మీ సౌందర్యం గురించీ  గొప్పతనం గురించీ,  కథలు కథలుగా విని, మీ దగ్గర పని చేసేందుకు వచ్చాను ”

 

నాగరాణి – ” సరే, చూద్దాం. ఇదుగో, నా గుర్రాన్ని ఆ కనిపించే మైదానం లో కి వరసగా మూడు రోజులు మేతకి తీసుకుపోయి  భద్రంగా వెనక్కి తేగలిగితే, అప్పుడు పనిలో చేరచ్చు. లేదంటే నా నౌకర్లు నిన్ను చంపి తినేస్తారు ” అంది.

రాజకుమారుడు ఒప్పుకుని నాగరాణి గుర్రాన్ని మేతకి తీసుకువెళ్ళాడు. కానీ ఆ మైదానం లో అడుగు పెట్టగానే గుర్రం  కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా  దొరకనేలేదు.  రాజకుమారుడు దిగాలుగా అక్కడొక బండరాయి మీద కూర్చుండి పోయాడు.  పైకి చూస్తే  ఆకాశం లో పెద్ద గద్ద ఎగురుతోంది. అతనికి వెంటనే దేవకన్య ఇచ్చిన గంట సంగతి గుర్తొచ్చింది. అప్పటివరకూ దాని సాయాన్ని ఉపయోగించుకోవాలని అతనికి అనిపించనేలేదు. జేబు లోంచి తీసి మోగించాడు. మరుక్షణం లో రెపరెపమని రెక్కల శబ్దం. గండ భేరుండాల రాజు ప్రత్యక్షమై రాజకుమారుడికి మోకరిల్లాడు. ” నీకేం కావాలో నాకు తెలుసు. తప్పిపోయిన గుర్రాన్ని నా అనుచరులని పంపి తెప్పిస్తాను,  అది మబ్బుల్లో దాక్కుని ఉంటుంది ” అని హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. రాజకుమారుడు అక్కడే, అలాగే  ఉండి పోయాడు. సాయంత్రమవుతూండగా గుంపులు గుంపులుగా పెద్ద గద్దలు ఎగిరి వచ్చాయి, వాటి ముక్కులతో పట్టుకుని గుర్రాన్ని తీసుకొచ్చాయి. రాజకుమారుడు దాన్ని నాగరాణికి అప్పగించాడు. ఆమె ఆశ్చర్యపోయింది.

” ఈ రోజు నువ్వు ఈ పని పూర్తిచేసినందుకు నిన్ను బహూకరిస్తాను ” అని ఒక రాగి కవచాన్ని అతనికి ఇచ్చి తొడుక్కోమంది. విందుజరుగుతున్న సభకి రాజకుమారుడిని తీసుకువెళ్ళింది.  నాగ కన్యలూ నాగ కుమారులూ జంటలు జంటలుగా అక్కడ నృత్యం చేస్తున్నారు. వాళ్ళ  ఆకారాలూ దుస్తులూ అతి పల్చగా, వింత వింత రంగులలో కదులుతున్నాయి. వాళ్ళలో నాగరాణి కూతురు కూడా ఉంది. తల్లిలాగే ఆమె కూడా అందంగా ఉంది,  క్రూరంగానూ ఉంది. రాజకుమారుడిని చూసి బావున్నాడని అనుకుంది గాని అతను ఆమె వైపు చూడనేలేదు. అందరికన్నా వేరుగా   పూల రాణి కూతురు కనబడింది. మల్లెపూవులూ గులాబీలూ కలిపినట్లు  సుకుమారంగా  వెలిగిపోతోంది . ఆమె దుస్తులు అరుదైన పూల రేకులతో అల్లినవి. ఆమె నర్తిస్తుంటే పూల వనాలు పరిమళిస్తున్నట్లుంది.  ఆమెతో నర్తించే అవకాశం, కాసేపటికి రాజకుమారుడికి వచ్చింది . రహస్యంగా ఆమె చెవిలో  – ” నిన్ను రక్షించేందుకు వచ్చాను ” అని చెప్పాడు. ఆమె అతి మెల్లగా అంది – ” మూడో రోజున నువ్వు గుర్రాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చినప్పుడు ఆ గుర్రపు పిల్లని బహుమతిగా నాగరాణిని అడుగు ”

వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూస్తూనే ఇష్టపడ్డారు. విందు అర్థరాత్రి దాటే దాకా సాగి, ముగిసింది.

తెల్లవారాక మళ్ళీ గుర్రాన్ని మైదానం లోకి తీసుకు వెళితే అది ఎప్పటిలాగే మాయమైంది. ఈ సారి గంట మోగిస్తే నక్కల రాజు వచ్చి అడవిలో  దాక్కున్న గుర్రాన్ని తెచ్చిపెట్టాడు. ఆ రాత్రి నాగరాణి వెండికవచం ఇచ్చి అతను తొడుక్కున్నాక విందుకు తీసుకు వెళ్ళింది.  నాట్యం జరుగుతుండగా పూలరాణి కూతురు ” రేపు కూడా నువ్వు గెలిస్తే , గుర్రపు పిల్లతో మైదానం లోనే వేచి ఉండు. విందు పూర్త యేలోపున ఇద్దరం ఎగిరి వెళ్ళిపోదాం ” అంది.

మూడో రోజునా గుర్రం అదృశ్యమైంది. గంట మోగితే చేపలరాజు వచ్చి నదిలో దాక్కున్న గుర్రాన్ని పట్టుకొచ్చి ఇ చ్చా డు. నాగరాణి రాజకుమారుడిని మెచ్చుకుని, తన అంగరక్షకుడుగా నియమించుకుంటాననీ , ముందుగా ఏదైనా కోరుకుంటే ఇస్తాననీ చెప్పింది. రాజకుమారుడు ఆ గుర్రం పిల్లను ఇమ్మని అడిగాడు. నాగరాణి ఇచ్చింది. ఆ రాత్రి బంగారు కవచం తొడిగించి విందుకి తీసుకు వెళ్ళింది. నాగరాణి తన కూతురితో రాజకుమారుడికి పెళ్ళి చేసి దగ్గర ఉంచుకుందామని ,  విందు ముగిసిన తర్వాత ఇద్దరికీ పెళ్ళి చేసే ప్రకటన చేద్దామని, అనుకుంది.  అతను ఆవిడ కి అంతగా నచ్చేశాడు. అతను ఒప్పుకుంటాడో లేదోనన్న అనుమానం కూడా నాగరాణికి రాలేదు. అయితే విందు పూర్తయేదాకా రాజకుమారుడు ఆగలేదు. ఎవరూ చూడకుండా తప్పించుకుని గుర్రపుసాలలో పిల్లగుర్రాన్ని ఎక్కి మైదానం లో వేచి ఉన్నాడు. అది పేరుకే పిల్లగానీ బలంగా భారీగా ఉంది . త్వరలోనే పూలరాణి కూతురు వచ్చేసింది. ఇద్దరూ కలిసి  గాలి కన్న వేగంగా పూల రాణి కోట వైపుకి ఎగిరి వెళ్ళారు.

Girl with Flowers Painting by Hans Zatzka; Girl with Flowers Art Print for sale

ఈ లోపల  నాగేంద్రుడి సేవకులు వీళ్ళు వెళ్ళిపోవటం చూసి నాగేంద్రుడిని నిద్ర లేపారు. అతను చాలా కోపంగా, ఆవేశంగా ఆమెను మళ్ళీ ఎత్తుకువచ్చేందుకు వెళ్ళాడు. ఇప్పుడు ఏ దివ్య శక్తులూ తనదగ్గర లేకపోయినా   రాజకుమారుడు అతన్నిధైర్యంగా  ఎదుర్కొన్నాడు.  పూలరాణి తన తుమ్మెదల సైన్యాన్ని నాగేంద్రుడి మీదికి పంపింది .  యుద్ధంలో నాగేంద్రుడు ఓడిపోయి వెళ్ళి పోవలసి వచ్చింది.

పూలరాణి తన కూతురి ఇష్టం తెలుసుకుని రాజకుమారుడితో – ” మీ ఇద్దరికీ అలాగే పెళ్ళి చేస్తాను. కాని నా కూతురిని ఇంతకాలమూ వదిలి ఉన్నాను కదా…పూర్తిగా నీకే ఇచ్చేయలేను. ప్రతి ఏడూ చలికాలం లో, మంచు కప్పిన రోజులు మొత్తం ఆమె నా దగ్గర ఉండాలి. మళ్ళీ వసంతం రాగానే నీ దగ్గరికి వస్తుంది ” అని షరతు పెట్టింది. రాజకుమారుడు పూలరాణి కోరికలో న్యాయం ఉందని అనుకుని సరేనన్నాడు. ఇద్దరికీ మాలతి పూల పందిళ్ళ కింద పెళ్ళి అయింది.  రకరకాల పూల తేనె లతో విందులు జరిగాయి.  అవి వసంతపు రోజులే కనుక భార్యను తీసుకుని  రాజకుమారుడు తన రాజ్యానికి వెళ్ళాడు. అతని జీవితం ఆనందం తో నిండింది.

పూల రాణి కూతురు అక్కడ కాలు పెడుతూనే ప్రజలందరికీ మనసులు తేలికగా హాయిగా అయిపోయాయి.  అక్కడ పూసిన పూలు వాడేవే కావు. శీతాకాలం ఆమె లేనప్పుడు మాత్రం జనం దిగులు పడేవారు,  ఆమె తిరిగి రాగానే తెప్పరిల్లేవారు.

 • Bukovinan fairy tale కి స్వేచ్ఛానువాదం. సేకరణ-  Dr Heinrich von Wlislocki , Andrew Lang

 

 

Download PDF

10 Comments

 • Rekha Jyothi says:

  ఏమీ ఆశించకుండా ముసలావిడకు చేసిన సాయం ఒక అందమైన దారి చూపించిందన్నమాట ! ఎప్పటిలానే ముగింపు పరిమళపు వసంతం చాలా బావుంది Mam ! ” అక్కడ పూసిన పూలు వాడేవే కావు. శీతాకాలం ఆమె లేనప్పుడు మాత్రం జనం దిగులు పడేవారు, ఆమె తిరిగి రాగానే తెప్పరిల్లేవారు.” దాచుకొనేందుకు సుకుమారమైన వాక్యం , TQ Mam .

  • మైథిలి అబ్బరాజు says:

   ధన్యవాదాలు రేఖా… ఆ చివరి వాక్యాలు నా సొంతం….:)

 • Naveen says:

  రాక్షసుడి చెరలోవున్న రామచిలుకను రాకుమార్తెగా మార్చిన ఇలాంటి కథల్లో,అనుభవాల సాధనకు ప్రయత్నం ఏకైక కండిషన్ కావాలన్న నీతి వుంది. విజయమూ, విజ్ఞానమూ ఏప్రయత్నమూ లేని ఫాస్ట్ ఫుడ్ లా ఏ ఒక్కరికి అందకూడదన్న జీవన హెచ్చరిక వుంది.

  ఇదంతా కాదుగాని మర్మభరితమైన మంత్రనగరిలో మనసు తేలుతున్నట్టు వుంది

 • మైథిలి అబ్బరాజు says:

  ధన్యవాదాలు నవీన్ గారూ…

 • Radha says:

  బావుంది మైథిలి గారూ…

 • alluri gouri lakshmi says:

  కధ ఎంత హాయిగా ఉందో ! అభినందనలు మైథిలి గారికి …

 • bhuvanachandra says:

  బాల్యం మళ్ళీ వెనక్కి వెనక్కి నడిచి వొచ్చింది మైధిలి గారూ ……కోడిగుడ్డు కిరసనాయిలు దీపం వెలుగులో చదువుకున్న చందమామలూ బాలమిత్రలూ చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకుని కూర్చుని చదివిన ఈసఫ్ కధలూ వానాకాలంలో వేడి వేడి మిర్చి బజ్జీలు తింటూ చదివిన పంచతంత్రం కధలూ ….ఒకటేమిటీ …ఓహ్ ….వెన్నెలరాత్రుల్లో ఇసుకకుప్పలమీద పడుకుని అమ్మ చెప్పే కధలు వింటూ ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ మైమరచిన రోజులు అన్నీ మళ్ళీ పక్షుల్లాగా రెక్కలు అల్లారుస్తూ గుండె మీద వాలుతుంటే …………………….ఏమని చెప్పనూ …థాంక్స్ తప్ప ……

 • మైథిలి అబ్బరాజు says:

  ఎంత cosy గా ఉంది సర్ మీ వ్యాఖ్య…ధన్యవాదాలు…

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)