‘అతనికంటె ఘనుడు’

SAM_0344శ్రీ శ్రీ శ్రీ  గిరజాల  బోడిబాబు  మాఊరికే కాదు చుట్టుపక్కల మూడూళ్ళకి  మహా మహా వైద్యగాడు గా చెలామణీలో ఉన్నాడు.  వాడినడిగితే హోలు తూ.గో. జిల్లాకే తాను తలమానికం అని చెపుతాడు అరగిద్ద మొహం పెట్టుకుని .  నేను నమ్మలేదు  మీరూ నమ్మకూడదు . నాకు వాడు  యమలోకానికి దారిమర్చిపోయి,  భూలోకంలో సెటిల్ అయిపోయిన యమకింకరుడిలా  అనిపిస్తాడు.  వాడు  ఎంబీబిఎస్స్ ఎఫ్ఫార్సీయెస్ కాకపోయినా కనీసం ఆరెంపీ అయినా , అవునో కాదో అని నాకో గొప్ప అనుమానం.

ఆ మాటే అంటే అత్తగారు అంతెత్తున లేచారు. నీకేం తెలుసూ నిమ్మకాయపులూసూ… బోడిబాబు తాత ‘పెదబోడిబాబు‘ కి ఆయుర్వేదంలో ఎంత పట్టుండేదో ….మనిషిని కళ్ళతో చూసి మందిచ్చేవాడు  – ఆ మందు ని అంతదూరం నించీ వాసన చూస్తే రోగం  రెక్కలు కట్టుకు ఎగిరిపోయేది  అంటూ ఇంతని అంత చేసి చెప్పుకొచ్చేవారు.

‘గాడిదగుడ్డేం కాదూ ……. ! మా అమ్మమ్మ గొప్ప సంగీత విద్వాంసురాలు (మా లోగిట్లో ). అలా అని నేను ‘ సరిగమ పా’ అంటే అది సంగీతం అయిపోతుందా?  ఇంటన్నానుకదా అని  ఇల్లాజికల్ కథలు చెప్పకండి. అసలు మీ బోడిబాబుల్నీ వాడి తాతబాబుల్నీ ఐ డోంట్ కేర్ ‘ అని మనసులో గట్టిగా అనుకొని, పైకి మాత్రం  “అదికాందండీ   నేను రామిండ్రీ  విమలమ్మ ఆస్పత్రిలో పుట్టేను  కాబట్టి, నాకు దగ్గొచ్చినా దురదొచ్చినా అక్కడ చూపించుకుంటేనే తగ్గుతుందట . వేరే వైద్యాలు అచ్చిరావంట  మా అమ్మమ్మ చెప్పేరు”  అని  వివరంగా చెప్పేను. ఎంచక్కా నాకు జరమో జలుబో వస్తే …..అక్కడికే పోతానుకానీ, మీ బోడి వైద్యాలు  నాకొద్దుబాబూ అని అత్తమాటకు ఎదురాడేసాను.

“చాల్లే  బడాయి….ఆ వంకన బండెక్కి రామిండ్రీవెళ్ళి  మొగుడితో షికార్లు తిరగాలనీ , సినిమాలు చూడాలనీ ఉంటే అలాక్కానీ  , దానికోసం మా బోడిబాబు వైద్యానికి  వొంకలు పెట్టకు  ఠాట్ …..” అంటూ నా నోరు మూయించేసారు . నా బొందిలో ప్రాణముండగా  బోడివైద్యానికి  దొరక్కూడదు అని ఊర్లో చావుమేళం వినిపించినప్పుడల్లా అనుకునేదాన్ని. ఎవరో కవి చెప్పినట్టూ  అనుకోలేదని ఆగవు కొన్నీ ……!

ఓనాడు ఏం తోచక నేనొక్కదాన్నే కూర్చుని  పులీమేకా ఆడుకుంటుంటే ,మా అబ్బులుగాడు   తంపటేసిన తేగలు గంపతో  తెచ్చి అరుగుమీద గోనేసి అక్కడ వొంపేసి పోయేడు.  సాయంత్రానికి సల్లారతాయండి అంటూ…..

చల్లారేకా వేడి తేగ దొరకదు కదా అని ఒకటి తీసుకు తినేసి, మధ్యలో చందమామ తీసి  చీల్చి చూస్తే అబ్బాయొచ్చింది.  అయ్యో అమ్మాయయితే బావుంటుంది కదా  అని , ఇంకో తేగా ఇంకో తేగా తింటూ చందమామలు చీలుస్తూ ఉన్నా …..మొత్తం పూర్తయ్యేసరికి,  ఇరవైమూడు అబ్బాయిలూ రెండో మూడో అమ్మాయిలూ వచ్చాయి . హమ్మయ్యా….”  అమ్మాయే పుడుతుందీ అచ్చం అమ్మలాగే వుంటుందీ ” అని హాయిగా పాడుకుని బ్రేవ్ మని త్రేంచి వెళ్ళి పడుకున్నాను.

సాయంత్రం , పెద్దవీధి రామాలయంలో శ్రీరామాంజనేయ యుద్ధం రికార్డు వేసే టైం కి మెలకువొచ్చింది. కడుపులో పుట్టిన సుడిగుండం నన్ను ఈడ్చి అవతలపారేసింది. ఇంకేవుందీ అరుగుచివరి కూర్చుని బొళక్…బొళక్ మని ఒకటే కక్కులు.

ఒకటి రెండు….ఆరు…తొమ్మిది…..అంతే , ఇంక  లెక్కెట్టలేక  కక్కటం మానేసి  తలపట్టుకు కూలబడ్డాను. నూతి దగ్గరనుంచీ  “సిన్నయ్యగారూ…..” అని మధ్యమంలో  అరుచుకుంటూ నరసమ్మ స్లోమోషన్ లో  లగెత్తుకు రావడం మాత్రం గుర్తుంది.

కళ్ళు తెరిచేసరికి రెండు ప్రశ్నార్ధకాలూ, ఒక హాశ్ఛర్యార్ధకం, ఒక బ్రేకెట్ ఫేసూ ( ఇది అత్తగారిదే   పెద్దయ్యగారికి గుట్టెక్కువకదా)  నా మొహంలోకి  చూస్తూ నిలబడ్డాయి.  పోన్లే  బతికే ఉన్నాను అనుకొని తృప్తిగా కళ్ళుమూసుకున్నాను.

కళ్ళుమూసుకున్నట్టూ చెవులు మూసుకోలేం కదా ! కళ్ళకి రెప్పలు పెట్టిన దేవుడు చెవులకి డిప్పలు పెట్టడం ఎలా మర్చిపోయాడబ్బా!!

“అమట్నీ…..నరసమ్మోయ్ నన్నట్టుకోయే అని పేద్ద గావు కేకెట్టేసి చిన్నయ్యగారు అమాoతం అరుగుమీంచీ…….” నరసమ్మాయణం వినిపించేస్తుంది నరిసి . నేను ఇలానే ఇంకాసేపు కళ్ళుమూసుకుంటే  భారత భాగవతాలు కూడా కల్పించేస్తుంది. పైగా వాటిలో దశావతారాలూ తానే  అని నమ్మించేస్తుంది.

దేనికయినా అద్దూ ఆపూ ఉండొద్దూ – అబ్బాయిగారి వెటకారం

రాయమంద్రం తీసుపోదారాండీ , తొట్టి తగిలించేమంటారాండీ  – అబ్బులుగాడి ఆరాటం

పుట్టింటివాళ్ళకి కబురు చెప్పొద్దూ..మళ్ళీ మాటొస్తుందేమో – మాంగారి అనుమానం

ఏవని కబురెడతాం….ఏ సంగతీ తెలవాలికదా ! ఒరేయ్ అబ్బులూ నువ్వెళ్ళీ ఉన్నపళంగా వెంటపెట్టుకురా – అత్తగారి అల్టిమేటం

రాగం తాళం తప్పినా ఒకే ప్రశ్నని బృందగానంలా  వినిపించాయి నాలుగు స్వరాలూ….. ఎవరినెవరినెవరినీ…….????

నా గుండె పీలగా కొట్టుకుంటూ నాకేదో సంకేతం పంపిస్తోంది…….  ఆ ‘ ఎవరు ‘ ఎవరైతే కాకూడదని  చెవులు రిక్కించుకుని  దేవుడ్ని ప్రార్ధించానో ఆ పేరే మా సావిట్లో ప్రతిధ్వనించింది. ఇంకేవుందీ….  బోడిబాబుకి కబురెళ్ళింది.

కలలో ‘ కైలాసరధం’  కనిపించినట్టూ  నేను  కంగారుగా లేచి కూర్చున్నాను.  ఎలాగో ఓపికతెచ్చుకుని మంచం దిగి పరిగెట్టాలని ప్రయత్నించినా “ఈ పరిస్థితిలో మర్యాదలేవిటీ  అక్ఖరలేదు  పడుకో”  అంటూ అత్తగారు నన్ను మళ్ళీ మంచంలో కుక్కేసారు .

అవకాశంకోసం చూస్తున్నట్టూ  టింగ్మంటూ నా చెవిదగ్గర చేరి…” గుస…గుస…గుసా …”  అంటూ ఆరా తీసారు. అందరూ ఆసక్తి గా  నన్నే చూస్తున్నారు.  ‘ చీ… పొండీ ‘  అంటూ   సినిమా హీరోయిన్ లా  అనవసరంగా సిగ్గుపడిపోయి, అబ్బులుగాడు తేగల గంప దింపటం దగ్గరినుంచీ జరిగిందంతా పూస గుచ్చినట్టూ చెప్పేసరికీ….. “ఇంతా చేసి పైత్యం వాంతులా  సరిపోయింది సంబడం” అంటూ  ….అత్తగారు గబగబా  ఇంట్లోకి పరిగెట్టి ఓ చేత్తో మిరపకాయలూ, మరో చేత్తో ఉప్పూ పట్టుకొచ్చి, దిష్టి తీసి అవతల పారేసి వచ్చారు.” ఈ మాట ఎవరితోనన్నా అన్నావు కనక.   రాజుగారి  కోడలు గంపడు తేగలు తినేసి పైత్యం తెచ్చుకుందటా అని  ఊరు ఊరంతా చెవులు కొరుక్కుంటారు  అప్రదిష్ట” అన్నారు.

చెప్పనులెండి ఆయన ప్రేమగా ఓ తేగబద్ద పెట్టారు అది సయించలేదు అని చెపుతాను.

” ఇంకా నయం …..” అన్నారు గాభరాగా …..” సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు పెద్దలు  .మొగుడూ పెళ్ళం ముక్క బద్దా పంచుకు తింటారని తెలిస్తే దిష్టి కాదూ  ! అలాక్కూడా చెప్పకు” అన్నారు.

పోనీఒకే ఒక్క తేగ  మీరూ నేనూ పంచుకు తిన్నాం అని చెప్పనా ….అన్నాను అమాయకత్వం ఒలకపోస్తూ …..(అత్తగారిని ఆకట్టుకునే అవకాశం ఎప్పుడోకానీ రాదు కదా. వచ్చినప్పుడు వాడేసుకోవాలి మరి)

హారి భగవంతుడా మరీ ఇంత అమాయకురాలివేంటే …..అసలెందుకూ చెప్పటం . ఆ ముదనష్టపు  తేగల సంగతి మర్చిపో, అసలు వాటిమాటెత్తకు అన్నారో లేదో……

అవునూ మధ్యాహ్నం  పొలం నుంచీ  తేగలు పంపించాను.  ఎక్కడా కనిపించవేం అన్నారు మీసాలు సర్దుకుంటూ మా మాటలు సగం సగం వినబడ్డ మాంగారు.

అత్తగారు గతుక్కుమని  హుష్ ..ఏవిటా గావుకేకలూ , తేగలు  ఈగలెత్తుకెళ్ళాయి  అనేసరికి  , ఒహో అలాగా అనేసి ఊరుకున్నారు మాంగారు.

మరి… పెళ్ళాం మాటమీద  ఆ మాత్రం నమ్మకం ఉండాలి మొగుడుకి.  చూసి నేర్చుకోండి అంటూ కళ్ళెగరేసి  సోగ్గాడికి సంసారోపనిషత్   బోధించాలని ప్రయత్నించాను . మొద్దుపిల్లాడిలా తల అడ్డదిడ్డంగా ఊపేసారు ఏవర్ధవయిందో ఏంటో!

బోడిబాబుకోసం వెళ్ళిన అబ్బులు చివర్ల నల్ల నల్లరంగు రాసిన  పోస్టు కార్డు లా  తిరుగుటపాలో వచ్చేసాడు. హమ్మయ్యా…వీడికి బోడిబాబు దొరకలేనట్టుంది. ఎక్కడ ఎవరి ప్రాణాలు పిండుతున్నాడో ! నే పడ్డ వేళమంచిదయింది అనుకొని ఊపిరి పీల్చుకునానో లేదో …..

“బాబుగారు పొగడ్రి రాసుకొచ్చేత్తాను పదమన్నారండి,” అంటూ చావుకబురు చల్లగా చెప్పేడు.

“వీడి సోకు సంతకెళ్ళా   ….ప్రాణాలు పోతున్నాయన్నా పొగడ్రు రాసుకోకుండా రాడేంట్రా వాడు?” మాంగారు ముచ్చటగా అడిగారు .

“సొగసు తక్కువా సోకెక్కువా సన్నాసికి,  చావుకు కబురెడితే తద్దినానికి దిగబడతాడు. వస్తాడులెండీ కాంగారేం ….” సోగ్గాడి స్వగతం.

“ఏవైనా బోడిబాబు నీట్నెస్సు ఇంకెవరికీ రాదు,” మెచ్చుకోలుగా అంటున్నారు అత్తగారు.

పిలుపు అందాకా పొగడ్రు రాసుకునీ , నడినెత్తిన ఆనవాలుగా మిగిలిన నాలుగు వెంట్రుకలనీ సమాంతరంగా  అన్నివైపులకీ సర్ధీ, సర్ధీ సర్ధీ…. ఇస్త్రీచొక్కా తగిలించి, ఫుల్ హేండ్స్ ని  సగం వరకూ నీటుగా మడిచి, కాలర్ సర్దుకుని, జేబురుమాలుకు సెంటురాసుకుని, నల్ల కళ్ళద్దాలు నెత్తిని తగిలించుకుని గానీ గుమ్మందాటడు బోడిబాబు.

ఆ ఆలశ్యమే ఒక్కోసారి రోగులపాలిట అమృతం అవుతుంది . ఇకనో ఇప్పుడో వాలిపోతాడు ఎలా తప్పించుకోవాల్రా భగవంతుడా అని నేను మిగుల చింతిస్తూ వుండగా ….చేత్తో ఇత్తడికేను తో  పిల్లంక మామ్మయ్య  (మాంగారి మేనత్త) గుండ్రాయిలా డుబుడుబుమంటూ దొర్లుకొచ్చేసారు. మామ్మ ని చూడగానే  నాకు కొంచెం ధీమా వచ్చింది. ఆవిడ  తనవెనక సగం   భూగోళాన్ని దాచేయగలరు  మరి.

ఆవిడ చేతిలో కిళం పట్టిన ఇత్తడికేను  చూస్తూనే  అక్కడున్నవాళ్ళంతా  గుండుదెబ్బ తప్పించుకున్న పిట్టలగుంపులా  తలో దిక్కూ ఎగిరిపోయారు. ఆ  కేనులో ఉండేవాటిని సున్నండలు అని ఆవిడ పిలుచుకున్నా  వాటిని కళ్ళతో నూ ముక్కుతోనూ చూసినవాళ్ళంతా అవేవో గ్రహం నుంచీ జారిపడ్డ మట్టిబెడ్డలు అనీ, వాటినించీ వెదజల్లబడుతున్న సుగంధం ఈ నేలకూ ఈ గాలికీ చెందినది కాదనీ వాదిస్తారు . అసలు ఒక్కరయినా నోట్లో పెట్టకుండా ఆ వాదనలేంటీ ? అని కాపరానికొచ్చిన కొత్తల్లో అబ్బాయిగారితో అంటే ….. అది నోట్లో పెట్టుకున్నాకా ఇంక వాదన ఉండదే ….రోదనే  అంటూ గోడమీద దండేసిన ఫొటో చూపించారు. అది పిల్లెంక తాతయ్యది.

ఆవిడ కొనే రూపాయి పాలనే పెరుగు చేసి, దేవతలు పాలసముద్రం చిలికినంత ఓపిగ్గా చిలికి రోజూ గోరంత వెన్న తీసి, దాన్నే దాచీ… కాచీ అలా తయారయిన నెయ్యితో  యుగానికొక్కటిగా తయారయిన సున్నుండలు ఆ మాత్రం కంపు రావటం సహజమే కదా!’  పైగా పుల్లలు పొదుపుచేస్తూ బియ్యాన్నీ  మినుములనీ ఓసారి  మూడుకుకి అలా చూపించి ఇలా తీసేస్తారట. అదో పచ్చికంపు.

పిల్లంక వాళ్ళకి పొదుపని తెలుసుకానీ మరీ ఇంతా….’ అని హాస్చర్యపడీ ….పడీ  పోయారంట తాతయ్య.

అలా అంతా ప్రాణభయంతో పారి పోగా మర్యాదకోసం మా అత్తగారూ, మంచంలోంచి లేవలేక నేనూ అక్కడే చిక్కడిపోయాం . “కోడలు కళ్ళుతిరిగి పడిందటగా ఏవన్నా విశేషమా… ఇందా పట్టూ  సున్నుండ” అంటూ మామ్మయ్య పట్టలేని సంతోషంతో కేన్ లోంచీ  ఎండిపోయిన మారేడుకాయలాంటిదాన్ని  తీసి, మా అత్తగారి నోటికందిచడాని మీదమీదకొచ్చేసరికి, ఎటు పరిగెత్తాలో పాలుపోక మా అత్తగారు పిల్లిముందు ఎలకలా అటూ ఇటూ గెంతుతున్నారు.

ఆపదలో ఉన్నది నేనుకాదు కాబట్టీ నీరస దరహాసంతో  ఆ ఆటని తిలకిస్తూ వుండగానే … ఊర్లో ఉన్న పిన్నత్తగార్లూ, పెద్దత్తగార్లూ,తోడికోడళ్ళూ, ఆడబడుచులూ  అంతా( ఇస్త్రీ చీరలు కట్టుకుని ) కట్టకట్టుకుని పెరటిగుమ్మం తోసుకుని వచ్చేసారు బోడిబాబుకు కబురెట్టారట   ఏం జరిగిందీ? ఎవరికి మూడిందీ? అంటూ అందరూ ఆరాగా అడిగేస్తున్నారు. ఆ వెనకే నరసమ్మ చెంగుమంటూ సీన్లోకి ఎంటరయిపోయి, సూడండమ్మా ఎంత ఘోరం జరిగిపోయిందో అన్న ఎక్స్ ప్రెషన్ తో గుక్కతిప్పుకోకుండా,  ఏం జరిగిందీ, ఎలా జరిగిందీ…..అన్నది వివరంగా ఒక్క ముక్క పొల్లుపోకుండా వివరించేసింది.

మా అత్తగారు తలపట్టుకున్నారు గుట్టూ – రట్టూ  సామెత గుర్తుచేసుకుని.

అపార్ధం చేసుకున్న అమ్మలక్కలు  “అయ్యో….ఈ మాత్రానికే అంత బెంగ పెట్టేసుకుంటారా… పోతేపోయిన తేగలు . మళ్ళీ తవ్వుకుని తంపటేసుకోవచ్చు దానికేం భాగ్యం.  ఏవయినా  కోడలంటే మీకు…ఎంత ఇదో…ఎంత అదో… మీలాంటి అత్తాగారిని  సినిమాల్లోకూడా చూడలేం బాబూ “ అంటూ ముఖ స్తుతి  కావించారు. అత్తగారు ఆనందాన్ని దాచుకుంటూ వచ్చిన అందరికీ టీలు ఆర్డరిచ్చారు.

‘ఈ యాలప్పుడు టీలేటండీ  మతిలేపోతేసరీ….’ అని అందరికీ వినిపించేలా సణుక్కుంటూ వెళ్ళింది నరసమ్మ. నాక్కొంచెం బాధేసింది వాళ్ళొచ్చింది  నన్ను పరామర్శించడానికా, మా అత్తగారిని  చెట్టెక్కించడానికా అని.

“వచ్చినవాళ్ళు ఎలానూ వచ్చారు కాసేపు కూర్చోండర్రా ”  అంటూ మా పిల్లెంక మామ్మయ్య అరుగుమీద చాప పరిచి, కాను మూత తీసేసరికి, అమ్మో….బాబో….మాకు అర్జెంటు పనులున్నాయ్, అవతల కొంపలు మునిగిపోతున్నాయ్ అని వచ్చిన తోవనే  గేలాపెత్తేసారు అమ్మలక్కలు.

నరసమ్మ పని తప్పిందని టీ గిన్నె దించేసింది.

వీధిలోంచీ  అబ్బులుగాడు “బోడిబాబుగారొచ్చేత్తానారహో….” అని  టముకేసుకుంటూ వచ్చేస్తునాడు. అత్తగారు  అభయ హస్తం చూపించారు ఇక అయ్యింది నీ పని అన్నట్టు. నాకు ఆవిడమీద ఇంతెత్తుకోపం వచ్చేసింది.  ‘మీకు విడాకులిచ్చేసాను ఫో ….’ అని  బెదిరిద్దామని చూస్తే  దరిదాపుల్లో కనిపించలేదు ‘ నలమహారాజు’ . ఇంక ఎవరిని బెదిరించాలో ఈ ఆపదనించీ ఎలా బయటపడాలో అర్ధం కాక కుడితిలో పడ్డ  ఎలకలా కుక్కిమంచంలో పడి కొట్టుకుంటున్నాను.  చివరి ప్రయత్నంగా మనసులోనే  కేశవనామాలు పఠించాను (నాకొచ్చిన మంత్రాలు అవొక్కటే). ఘుమఘుమలాడిపోతూ  బోడిబాబు మూత ఊడిపోయిన సెంటుబుడ్డిలా దొర్లుకొచ్చేసాడు.  కడుపులో వికారం మళ్ళీ మొదలయింది.

ఊరికే  చెప్పారా ‘అనగా అనగా రాగం  తినగా తినగా రోంగo’ అనీ….  ‘నీకీశాస్తి జరగాల్సిందే’ నన్ను నేను నూటపదారోసారి తిట్టుకున్నాను.

బోడిబాబుగారు  ఒకసారి కళ్ళజోడుతీసి మళ్ళీ తలకి తగిలించుకుని, కాలర్ సర్దుకుని, జేబురుమాలుతో పీట తుడుచుకుని చొక్కా ఎత్తి పట్టి కూర్చున్నాడు. అబ్బులు చేతిలోంచీ యమపాశంలాంటి మడత సంచీ అందుకుని బోర్లించాడు. సూదులూ, ఇంజెక్షన్ బుడ్లూ, రకరకాల రంగుబిళ్ళలూ, ఒకటో రెండో సెలైన్ సీసాలూ. గాజు సీసాల్లో పొడులూ, లేహాలూ…..అత్తగారు ఆ సరంజామాని అద్భుతంగా చూస్తున్నారు. ఎలా చస్తావో నువ్వే కోరుకో అని నాకు బోలెడు ఆప్షన్స్ ఇచ్చినట్టూ నాకేసీ, వాటికేసీ మార్చిమార్చి చూస్తున్నారు.

నరసమ్మ గ్లాసుతో నీళ్ళుతెచ్చి బోడిబాబు పక్కన పెట్టింది. ‘టేంక్సు’ చెప్పి గ్లాసెత్తెయ్యబోతే…..”అయబాబోయ్  బోడిబాబుగారో అయ్యి యేణ్ణీళ్ళండీ  ఇండీసనుకోసం  అట్టుకొచ్చేను” అనేసింది గాభరాగా.

‘ఓసి నరసమ్మోయ్ ఇండీషనేంటే  అపశకునపక్షీ……’ నా  ప్రాణాలు గిలగిలా కొట్టుకున్నాయి.

అబ్బులుగాడు మోకాళ్ళమీద వంగి ఆసక్తి గా   చూస్తూ  పతంజలి కథల్లో  మందిచ్చి ప్రాణం తీసే పకీర్రాజు  వెనకాల గోపాత్రుడులా బోడిబాబుకు తెగ సలాహాలిచ్చేస్తున్నాడు.  నేను మంచందిగి పారిపొయే అవకాశం లేకపోలేదని గ్రహించినట్టూ మా అత్తగారు నా తలదగ్గర కొచ్చి మంచం  పట్టిమీద కూర్చున్నారు.

అప్పుడు అడిగాడు  బోడిబాబు  “ఏటండీ తేడా ఏం  తినేహేరూ ?? ”

నరసమ్మ ఉత్సాహంగాగొంతు సర్ధుకుంది. అత్తగారు  దాన్ని కళ్ళతోనే వారించి, ఆ ఏవుందీ ….అది వద్దు వద్దూని మొత్తుకుంటున్నా నేనే ఓ ముద్ద ఎక్కువ తినిపించాను . అజీర్తిచేసినట్టుంది .  అలా వాంతిచేసుకుని ఇలా మంచానపడింది. ఏంటో ఈ కాలం పిల్లలు …. అందులోనూ మా కోడలు మరీ అపురూపం  అన్నారు. గుట్టూ రట్టూ బేలెన్స్ చేస్తూ …

ఊ … కొడుతూ కథ వినేశాడు బోడిబాబు.

“సిన్నయ్యగారు  సాలా నీరసవయిపోయేరండి బోడిబాబుగారూ…. అది తగ్గటానికి సూదిమందెయ్యాలండి,” నరసమ్మ సూచన

“నీరసం తగ్గితే సరిపోద్దేటే …బలం రావొద్దూ  ఓ పంచేయ్యండి బోడిబాబుగారూ ….రెండో నాలుగో సెలైన్ కాయలెట్టెయ్యండి” అబ్బులుగారి సలహా.

మీరు నోరుమూసుకోండి ఏం చేయాలో  వాడికి తెలీదా? అంటూ వాళ్ళమీద కేకలేసి  త్వరగా  పైత్యం సర్దుకుని పనుల్లో దిగేలా గుళికో లేహ్యమో  చూసివ్వయ్యా అత్తగారి ఆర్డర్ .

అన్నిటికీ తలాడిస్తూ బోడిబాబు క్రతువు ప్రారంభించాడు. వాడి స్పెషాలిటీ నే అది. ‘రోగి కోరిందీ వైద్యుడు ఇచ్చిందీ ఒకటే’ అన్న సామెతని నిజం చేయడానికే పుట్టినట్టుంటాడు. ఆయుర్వేదంలో అల్లోపతీని మిక్స్ చేసి కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు.

పొట్లం విప్పి  అందులో  పొడిని నీళ్ళతో కలిపి ఉండలు గా చేసాడు . సీసాలో రంగునీళ్ళని సిరంజ్ లోకి తోడాడు . .ఇంకా ఏవేవో చేసి, ఒరేయ్ అబ్బులూ నువ్వీ సెలైన్ కాయట్టుకుని  అలా నిలబడు అంటూ వాడిభుజానికి దాన్ని తగిలించి, ఉండలు నరసమ్మ చేతికిచ్చి, చెవిలో ఏదో చెప్పాడు. అది పాత కోపాలన్నీ గుర్తు తెచ్చుకుని నావైపు క్రూరంగా చూసి నవ్వినట్టనిపించింది. మా అత్తగారు ఎలర్ట్ అయిపోయి , నా భుజం గట్టిగా పట్టుకున్నారు. బోడిబాబు  మారువేషంలో ఉన్న మాంత్రికుడిలాగా నావైపు  వచ్చేసాడు.

చావు ఎదురుగా ఉన్నప్పుడు పుట్టుకొచ్చేవాటినే  చావు తెలివితేటలు అంటారా? ఏమో!

కనీసం మృత్యుంజయ మంత్రమయినా నేర్పితివికాదేవమ్మా  అని నన్ను పదారేళ్ళు పెంచిన అమ్మమ్మని కసి తీరా తిట్టుకుని   మంచీ మర్యాదా అవతలకి విసిరేసి, అత్తగారిని ఇవతలకి ఒక్క లాగు లాగి ఓపికంతా కాళ్ళలోకి తెచ్చుకుని ఒక్క  గెంతులో గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను.

ఆ వెనకే …….చచ్చాన్రోయ్ అని అత్తగారి ఆర్తనాదం.

“ఏం పర్లేదు కుంత ఓర్చుకోండి  అయిపోయింది. అయినా మీరడ్డం పడ్డారేటండీ పెద్దయ్యగారూ…” అంటూ ఆవిడ  భుజానికి ఈ పక్కన దించిన సూదిని ఆ పక్కనించీ పీక్కుంటూ అంటున్నాడు బోడిబాబు. ఎలాగూ మంచాన పడ్డారుకదా సిలైను కాయెటేత్తాను. కూసేపలా పడుకోండి అంటే ఆవిడ ‘ నాకొద్దులేరా బాబూ  అదిగో  పిల్లెంక ఆయ్యగారికి ఈ మధ్య నీరసం అంటున్నారు అదేదో ఆవిడకి ఎక్కించు’  అనేసరికి  బోడిబాబు అటు మళ్ళాడు.  ఆ వెనకే సెలైన్ స్టేండు ని ( అబ్బుల్నీ) తీసుకుపోయాడు.

అల్లోపతిలో రోగాని కి  మందు , హోమియోపతిలో రోగికి మందు …..మరి ఈ బోడోపతీలో …….!!!!

ఇంతాచేసి,  రుబ్బురోలు పొత్రంలా వాచిపోయిన భుజానికి వేణ్ణీళ్ళ కాపడం పెట్టుకుంటూ అత్తగారంటారుకదా …. ….. వీడు తాతని మించిపోయాడేవ్! వాడిచ్చిన మందును వాసన అయినా చూడాల్సొచ్చేది,  మన బోడిబాబును కళ్ళతో చూస్తేనే రోగం పారిపోతుంది.

ముక్కుతూ మూల్గుతూ మంచాన పడున్నదానివి  ఒక్క గెంతులో గదిలోకెళ్ళి పడ్డావంటే అదంతా ఎవరి ఘనతా!

***

(మీకూ తెలిసేవుంటుంది :  తేగలో మధ్యన పుల్లలా ఉండేదాన్ని చందమామ అంటాం. (అదేం చిత్రం?)

ఆ చందమామని నిలువుగా పట్టుకుని రెండుచేతులతో చీల్చినపుడు అది సమంగా రెండు బద్దలవుతుంది లేదా, అడ్డదిడ్డంగా విడుతుంది . దాన్ని బట్టి, పాసవుతానా ఫేలవుతానా, రాత్రి బస్సు వస్తుందా రాదా, అందులో చుట్టాలు దిగుతారా దిగరా, అక్కలో అత్తలో కడుపుతో  ఉంటే వాళ్ళకి పుట్టేది  ఆడపిల్లా మగపిల్లాడా…..అలా ఎన్నెన్నో క్లిష్టమయిన సమస్యలకు  సమాధానాలు చెప్పేది తేగలో చందమామ.

శుభవార్తలు తెచ్చే కార్డు చివర్ల పసుపు రాసినట్టు, దుర్వార్తలు తెచ్చే కార్డులకి నల్లరంగు (సిరా)  పూస్తారు. ఇప్పుడసలు కబుర్లు మోసుకొచ్చే కార్డులే లేవనుకోండీ!

Download PDF

48 Comments

 • లలితా

  మీ కలం మరీ పదునెక్కి పోతోంది రోజు రోజుకీనూ !!
  ఎంచక్కని ఫ్లో…

  ఇదో, ముందే చెప్తున్నా.. ఇవన్నీ మీరు పుస్తకం వెయ్యకపోతే ఊర్కునేది లేదంతే

 • లలితగారండోయ్, సుజాతగారి మాటే నాదీనూ ! సంతకం పెట్టి మరీ ఇవ్వాలి నాకు పుస్తకాన్ని :)

 • లలిత says:

  పుస్తకమే !!!
  సుజాత గారు మీరుమరీనూ :)
  తృష్ణ గారూ అబ్బా చాల్లెద్దురూ :))

  “నరసమ్మోయ్ మన సుజాతగారికీ ఓ స్ట్రాంగ్ టీ పెట్టుకొచ్చేయ్
  ఆచేత్తోనే తృష్ణ గారికి కూడా ….ఈవిడకి ఓ స్పూన్ పంచదార ఎక్కువెయ్యాలి “

 • చాల బాగా రాసారు… తేగలు తింటూ గోదారెంట పరిగెడుతూ చదివినట్లు అనిపించిది.వంశీ గుర్తుకొచ్చారు :)

  • లలిత says:

   యమా అర్జెంటు కేసు కదండి , అందుకే పరిగెత్తించాల్సి వచ్చింది . ధన్యవాదాలు

 • శ్రీనివాస్ పప్పు says:

  సందెపొద్దుల్లో గోదారి మీద ప్రయాణంలా ఉంది కధాగమనం.సుజాత గారన్నట్టు కొంచం పదునెక్కుతున్నారు బాగానే ఆవకాయ కోసిన కత్తిలాగ.

  • లలిత says:

   <> నయం సుత్తి లాగా అనలేదు . ధన్యవాదాలు మాస్టారు

 • బ్రహ్మాండం. నవ్వి నవ్వి చచ్చాను.

 • చల్లారేకా వేడి తేగ దొరకదు కదా అని ఒకటి తీసుకు తినేసి, మధ్యలో చందమామ తీసి చీల్చి చూస్తే అబ్బాయొచ్చింది. అయ్యో అమ్మాయయితే బావుంటుంది కదా అని , ఇంకో తేగా ఇంకో తేగా తింటూ చందమామలు చీలుస్తూ ఉన్నా …..మొత్తం పూర్తయ్యేసరికి, ఇరవైమూడు అబ్బాయిలూ రెండో మూడో అమ్మాయిలూ వచ్చాయి . హమ్మయ్యా….” అమ్మాయే పుడుతుందీ అచ్చం అమ్మలాగే వుంటుందీ ” అని హాయిగా పాడుకుని బ్రేవ్ మని త్రేంచి వెళ్ళి పడుకున్నాను.

  :))బలే రాసారు ఎక్కడా ఆపకుండా,పెదవిపై నవ్వులు చెరిగి పోకుండా చదివించారు..

  నాకూ ఓ పుస్తకం.. బుక్ చేసేసుకున్నా

  • లలిత says:

   రాధిక గారు ఆ నవ్వుని అలాగే ఉంచుకోండి ఓ నెలపాటు :)

 • చదువుతున్నంతసేపు నవ్వులు పూస్తూనే ఉన్నాయి :))
  ఇది అసలు సిసలైన కథ…”లలిత-అత్తగారి కథలు” సీరీస్ లో ఉండాల్సిన కథ!
  ఇంకా రాయండి ఇలాంటివి. పుస్తకం అచ్చయ్యాక “ఆ రచయిత్రి నాకు బాగా తెలుసు” అని గర్వంగా చెప్పుకుంటాను. :)

  • లలిత says:

   సౌమ్య పుస్తకానికి పేరు కూడా పెట్టెసావా ! …… సోమలింగం సామెతలాగా . థాంక్ యు

 • suresh peddaraju says:

  super…hilarious…:))

 • Chandu S says:

  వంశీ స్టైల్లో అత్తగారి కథలు చదివిట్లుంది లలితగారు. చాలా చోట్ల మెరుపులున్నాయి.

 • నిజమేనండి. మీ కలం పదునెక్కింది. మాకు నవ్వులు విరబూస్తున్నాయి . ….దహా.

  • లలిత says:

   మీరు చెప్పారు కాబట్టి నమ్మేస్తా లెండి . మీ ద.హా లు మాకు మణి మాణిక్యాలు

 • rajkumar says:

  అద్బుతం.. కుమ్మెశారు…ఇరగదీసారు…
  అసలు ఇలా ఎలా రాసేసారండీ బాబూ… అరాచక:

 • దాట్ల దేవదానం రాజు says:

  దాట్లోరి కోడలికి ఇన్నిన్ని సామెతలు…అంతంత ఎటకారాలు… పరుగు పందెంలా రయ్యమని సాగే తూగోజి యాసలు…ఇంకా పల్లెల్లోని అతౄతలూ…ఆరాటాలూ…ఎవరో అన్నట్టు… ఇక తప్పదు..అత్తగారి కధలు రాసేయాల్సిందే.అభినందనలు

  • లలిత says:

   నమస్తే మాస్టారు ,
   మీ అభినందనలు అందుకోవటం ఎంతో ఆనందంగా వుంది.

 • sailabala says:

  చాల బాగా రాసారండి . ఇవి అన్ని పుస్తకం వేయాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళల్లో నా పేరు కూడా వేసుకోండి … నిజంగా చదువుతుంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది.

 • Vainika says:

  అయ్య బాబోయ్ ఇంత బాగుందేన్టండి బాబు.. సూపర్ అసలు! :-) మరి నాకు కూడా ఒక బుక్ …..

 • లలిత says:

  హ..హ..ఏంటో ! అంతా కుడబలుక్కుని వచ్చినట్టునారు
  నేనేదో గోదారి ఈదేసానని సంబరపడుతుంటే మీరంతా కలిసి నన్ను సముద్రంలోకి విసిరేసేలా వున్నారు .
  సారంగ వారు నాక్కొంచెం చోటిచ్చారు . నన్ను ఇలా నిలబడనీయండి బాబూ …అదే పదివేలు .
  పుస్తకం అన్నవాళ్ళంద్ఫరికీ ఒక్కో పిల్లంక సున్నుండ పెట్టించేయాలి .

  • Satyabhama says:

   “అమ్మా, కథ చెబుతానని పిలిచి ఇలా కూర్చోబెట్టి, పిల్లంక సున్నుండ పెట్టెయ్యడం.. ఏమన్నా న్యాయంగా ఉందామ్మా?” (నాకు శ్రీవారికి ప్రేమలేఖలో రాళ్ళపల్లి గుర్తుకొచ్చాడు)

 • మీ చివరి కామెంట్ చూసి ‘పుస్తకం’ అన్న మాటని మింగేస్తున్నానండీ లలిత గారూ..
  సూపరంటే సూపర్ గా ఉందీ కథ.. మళ్ళీ నెల దాకా ఎదురు చూడాలన్నమాట మీ అత్తగారు పంచే నవ్వుల కోసం.. :)

  • లలిత says:

   బావుందమ్మా …పాట్లు నాకూ పేరు అత్తగారికా!

 • రామ్ says:

  సిన్నయ్య గోరూ !!!

  పైన వాళ్ళందరి తో పాటు నాక్కూడా ఓ …. పిల్లంక సున్నుండ ….. పుస్తకం కోసం దేనికైనా రెడీ !!

  నెల రోజులు ఆగిన ఆత్రం ఏమో ….. వెంటనే అయిపొయింది చదవడం . ఇంకా నెల ఆగాలంటే ఈ క్రింది ప్రశ్నలు సోదాహరణం గా వివరింపుడు :

  1. ‘శ్రీ శ్రీ శ్రీ గిరజాల బోడిబాబు … తలమానికం’ ఎట్లాయెను ?
  ఆయుర్వేదంలో అల్లోపతీని మిక్స్ చేసే వీరికీ – తమన్ కీ -ఎట్టి చుట్టరికము ఉండెను?

  2 బ్రేకెట్ ఫేసూ అనగా నేమి

  3. రాయమంద్రం కీ రామిండ్రీ కీ మధ్య దూరం ఎంత?

  4. నరసమ్మ గ్లాసుతో నీళ్ళు తెస్తే – ‘టేంక్సు’ ఏ విధమున నిండెను ?

  • రామ్ says:

   ఇంతకీ పై ప్రశ్నలు మీ పుస్తకం ‘ దాట్లేసిన గోదావరి ‘ కి పబ్లిసిటీ కోసం అన్న మాట !!

   • లలిత says:

    రామ్ గారు , మీకు ఒకటీ రెండూ సరిపోవు ఓ కేనుడు పంపించాలి .
    కొత్త ‘పదబంధాలు’ తయారుచేసి , నన్నే ఇరుకున పెట్టేస్తున్నారు గా!

 • పోయిన్సారి కబుర్లు బుర్రగుంజులా ఉంటేనండీ.. ఇయేమో తంపటి తేగలా ఉన్నాయండీ.. ఆయ్..

  బావుందండీ ఈదేసిన గోదారి. నిడివి కాస్త ఎక్కువయినట్టనిపిస్తున్నా చదివించేస్తున్నారు. సంభాషణలని కథలోంచి వేరు చేసి చూపిస్తే బావుండేదేమో కదా. మళ్ళీ వెనక్కెళ్ళి అవి ఎవరన్న మాటలో చూసుకోనక్కర్లేకుండా..

  ఇలా..

  ఇంతాచేసి, రుబ్బురోలు పొత్రంలా వాచిపోయిన భుజానికి వేణ్ణీళ్ళ కాపడం పెట్టుకుంటూ అత్తగారంటారుకదా.. “వీడు తాతని మించిపోయాడేవ్! వాడిచ్చిన మందును వాసన అయినా చూడాల్సొచ్చేది, మన బోడిబాబును కళ్ళతో చూస్తేనే రోగం పారిపోతుంది. ముక్కుతూ మూల్గుతూ మంచాన పడున్నదానివి ఒక్క గెంతులో గదిలోకెళ్ళి పడ్డావంటే అదంతా ఎవరి ఘనతా!”

  • లలిత says:

   మీరు ఇలా….చెపెతే అలా అల్లుకుపోవటండీ . ధన్యవాదాలు మీ వ్యాఖ్యకూ, అమూల్యమయిన మీ సూచనకూ :)

 • kalyanivutukuri says:

  అస్సలు .. బోడి బాబు .. పేరే బ్రహ్మాండం , ఈదెసిన గోదారి కి .. నవ్వలేక చస్తే , ఇది చదెవెటప్పుదు .. నన్ను ఎవరైనా .. చుస్తే .. ఇంకా అంతే !!అందుకే ఎవరికీ కనబడకుండా వినబడకుండా ( నవ్వు) చదవటానికి చాల ప్రయత్నమే చెయ్యాల్సి వచ్చింది ,” బోడి బాబు .. ముతా తీసిన అత్తర బుడ్డి ల దొల్లు కుంటూ వచ్చేసాడు” , అస్సలు ఎలా ఇలాంటి imagination .. అని ఒక నిమిషం అనిపించినా , అస్సలు ఇంతగా నవ్వించిన .. మీకు .. అభినందనలు .మళ్ళి నెల నాళ్ళు అంటే చాల కష్టం సుమండీ …!!! నాకు …. పు .. పు … ( అదే ఇంగ్లీష్ లో బుక్ ) వేస్తే resevervation చార్ట్ లో ఓ మూల గా నమోదు చేసుకోండి !!!!

  • లలిత says:

   క్షమించండి మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టేసినట్టున్నాను. ఈసారి డోసు తగ్గిద్దాం లెండి . అందాకా ఓ సు…సు..సు..వేసుకోండి ఓ మూల పడుంటారు :)

 • RammohanRao thummuri says:

  చాలా ఏండ్ల తరువాత మళ్లి భానుమతి గారి అత్తగారి కథలు చదివిన అనుభూతి.అట్లాగని ఆమెను ఆనుకరించినట్లు లేదు .మీ ముద్ర మీదే. ఛాయాచిత్రానికి బదులు పారిజాతప్పూలతో వేసిన మీ పేరు ముగ్గు బావుంది.తేగలంటేనే తెలీని నాలాంటి వారుంటారని కూడా ఊహించిన మీ ముందు చూపుకు జోహార్లు.ఇక్కడో చిన్నప్పటి అనుభవం చెప్పాలి మీకు.నేను పుట్టి పెరిగింది
  కరీంనగరం జిల్లా ఎలగందులలో.నేను7,8 తరగతుల్లో ఉన్నప్పుడు వి.వెంకటప్పయ్య గారనే సారు కొత్తగా వచ్చారు మా బడికి.ఆయనది రాజోలు.కొన్ని రోజుల తర్వాత భార్యను తల్లిని తీసుకొచ్చి కాపరం పెట్టారు.నేను వాళ్లింటికి ఇంగ్లీషు ట్యూశన్ కి వెళ్లి ఇంటికి కావలిసిన సరుకులు కూరగాయలు తేవడంలో సహాయపడెవాణ్ని.బామ్మ గారితో కూరగాయలకు వెళితే ఆమె మాండలికం వాళ్లకు అర్థంకాక వాళ్ల మాండలికం ఆమెకు అర్థంగాక భలే చిత్రంగా వుండెది. 50 ఏళ్ల క్రితం సన్నివేశాన్ని మా సారును,బామ్మగారిని గుర్తుచేసుకొని మనస్సులో వారికి నమస్సులు తెల్పుకునేట్లు చేసిన మీ రచనకు నా జోహార్లు

  • లలిత says:

   ఇంత వివరంగా మీ అభిప్రాయాన్ని తెలియచేసి , మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు చాలా సంతోషం అండీ . ధన్యవాదాలు

 • పైన అందరు చెప్పిన మాటే నాదీనండీ… పొయినసారికన్నా ఈసారి కబుర్లు మహత్తరంగా ఉన్నాయి, ఆపకుండా చదివించేశారు, బహుశా మీ శైలికి అలవాటుపడడం కూడా ఒక కారణమేమో.
  ఈవిధంగా రాసేస్తుంటే మీరేయించక్కర్లేదండీ.. మాలాంటి అభిమానులెవరో పూనుకుని వేయించేయరూ ఓ పుస్తకం :-)

 • లలిత says:

  అలాగాండీ …….మరింకనే మీ అడ్రస్సూ ఫోన్ నంబరూ ఇప్పించండి . వచ్చి ఒక నమస్కారం చేసుకుంటాం :)

 • Sri says:

  చాలా కమ్మగా వుంది ఈ కథ.. ముళ్ళపూడి గారి రచన చదివినట్లు వుంది… నాకు మాత్రం మా ఊరి RMP డాక్టర్ గుర్తు వచ్హారు… ” బోడిబాబు మూత ఊడిపోయిన సెంటుబుడ్డిలా దొర్లుకొచ్చేసాడు”… Hats off to you.. You have a rare gift to make people laugh…

 • బ్రిలియంట్. ఎందుకో ఇది అచ్చయినప్పుడు చదవడం పళ్ళేదు. పకీర్రాజుని కూడా తల్చుకున్నారే, పూర్వకవి స్తుతి చేసినట్టు. తేగల్లో చందమామలు .. నిజం నిజం. చిన్నప్పుడు చేస్తూ ఉండే ఘనకార్యప్పనుల్లో ఇంకోటి, సీమచింతకాయలు తినేశాక, దాని గింజ మీద ఉండే నల్లటి తోలు తునగకుండా వొలవటం. అన్నట్టు ఈ సంగతి చెప్పానా, మీ నరసమ్మని చూసినప్పుడల్లా నాకు కాంచనగంగ సీరియల్లో పనమ్మాయి గోదావరి గుర్తొస్తుంది! :)

 • ఎన్నెల says:

  అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్ననుకున్నానండీ…మరి తవరేమో బోడిబాబని సెలవిచ్చారేటండీ..ఆరికీ ఈరికీ ఏవన్నా సమ్మంధముందంటారా! ఉండే ఉంటాదని ఘాఠిగా అందావనుకున్నా గానీ ఆ పిల్లంక సున్నుండ గుర్తొచ్చి ఆగిపోయానండీ..నిజవండీ..తవరిమీదొట్టు! ఆయ్ …

 • venkat says:

  నిజంగా సూపర్ .
  ఎన్నాళ్ళయింది , గోదారి కథ చదివి . చాలా బాగుంది మేడం . ఒక్కసారి ఊళ్ళోకెళ్ళి అందరిని పలకరించినట్టు అనిపించింది .
  గోదారి ఎటకారాలు విరుపులు అన్ని ఒక్క దాంట్లో చూపించేశారు .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)