వీలునామా – 35, 36 భాగాలు

veelunama11

veelunama11

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ప్రేమ విజయం

హేరియట్ వస్తూ వస్తూనే, ఆస్ట్రేలియాని, వలస వచ్చిన వాళ్ళనీ, నగరాలనీ విమర్శించి పారేసింది. నిజానికి తను ఇంకో పదేళ్ళు ముందొచ్చినట్టయితే ఇంకా ఎక్కువ తిట్టిపోయడానికి వీలుగా వుండేది. స్టాన్లీ, బ్రాండన్ ఇద్దరూ మెల్బోర్న్ ని అందాల నగరమని పిలవడం ఆమెకి హాస్యాస్పదంగా తోచింది. వాళ్ళిద్దరు మాత్రం మెల్బోర్న్ నగరం ఎంత అభివృధ్ధి చెందిందో, కట్టడాలెంత త్వరగా పూర్తవుతున్నాయో, డబ్బెంత హాయిగా సంపాదించుకోవచ్చో చెప్పి చెప్పీ ఆమెని విసిగించారు.

అయినా ఆమెకి మెల్బోర్న్ కానీ, విక్టోరియా రాష్ట్రం కానీ ఏ మాత్రం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే కారణం కూడా ఆమె చెప్పలేదు. ఇళ్ళూ వాకిళ్ళూ, డబ్బూ, దస్కమూ నాగరికతా, నాజూకూ అన్నీ బానే వున్నా, ఇంగ్లాండు లా లేదుగా అన్నదామె.ఆమె విక్టోరియాకి రావడానికి కారణం కేవలం కుతూహలం. ఎలాగూ ఇంగ్లండుతో పోలిస్తే వేరే రకంగా వుంటుందన్న విషయం ఆమె ఊహించిందే. అయితే అన్ని రకాలుగా ఇంగ్లండు ముందు తీసికట్టుగా వుందన్నది ఆమె ఉవాచ. అన్నిటికంటే ముఖ్యంగా వేడీ దుమ్మూ! ఆ వేడికి ఆమె తెచ్చుకున్న దుస్తులన్నీ వేసుకోవడం కుదరలేదు. కానీ, ఇంగ్లీషు సమాజం తమ దుస్తుల మీదా నాగరికత మీదా వుధించిన నియమాలను ఉల్లంఘించడానికీ లేదు. పాపం, ఈ రెండిటి మధ్యా నలిగిపోయి ఆమెకి విక్టోరియా అంటే మహా చికాకు పట్టుకుంది. అంత ఎర్రటి ఎండల్లోనూ అచ్చమైన బ్రిటిష్ పౌరుడిలా డాక్టర్ గ్రాంట్ నల్లటి సూటూ, నల్లటి హేటూ ధరించడం ఆమెకి కొంత ఉపశమనం.

“మా డెర్బీషైర్ లో వున్న శాంతీ తీరుబడీ లేదు, పోనీ లండన్ లో వున్న చైతన్యమూ నాగరికతా లేవు. ఈ మెల్బోర్న్ నగరాన్ని చూసా మీరంతా ఇంత మురిసిపోయేది,” అని ఆమె బ్రాండన్ ని వేళాకోళం చేసింది. కానీ, బ్రాండన్, స్టాన్లీ మెల్బోర్న్ నగరం పూరి గుడిసెలతో వున్న పల్లెటూరి స్థాయి నుంచి, డబ్బూ వెలుతురూ నింపుకున్న వీధుల నగరం వరకూ ఎదగడం కళ్ళారా చూసి వున్నారు. ఎదుగుదలలో వాళ్ళ భాగస్వామ్యమూ వుంది.వారికి ఆ నగరం బ్రతక నేర్చిన తనమూ, సాహసమూ నేర్పింది. అందుకేవాళ్ళిద్దరూ ఈ కొత్త మనిషికి మా నగరం నచ్చకపోవడమేమిటి అని గింజుకున్నారు.

లిల్లీ ఫిలిప్స్ కి మెల్బోర్న్ లో పరిచయస్తులూ స్నేహితులూ లేరనే చెప్పొచ్చు. కానీ డాక్టరు గ్రాంట్ కీ, స్టాన్లీకి చాలా మందే సన్నిహితులున్నారు. చెల్లెలికోసం స్టాన్లీ చాలామందిని తమ ఇంట్లో విందులకి ఆహ్వానించాడు. కానీవాళ్ళంతా హేరియట్ కళ్ళకి మొరటుగా అనాగరికంగా అనిపించారు. అయినా వాళ్ళతో ఆమె చనువుగానే మసిలింది.తన చదువూ, తెలివితేటలూ, సంభాషణా చాతుర్యమూ అన్నీ కలిసి అక్కడివాళ్ళని ఉక్కిరి బిక్కిరి చెస్తాయనీ, తన నోటి వెంట వచ్చే ప్రతీ మాటకీ ఆ అనాగరికులంతా పరవశించిపోతారనీ ఊహించుకుందామె. కానీ, పాపం, తన అభిప్రాయాలనెవరూ పట్టించుకోరనీ, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ బ్రతుకు గురించీ తను చేసే గంభీరమైన వ్యాఖ్యల్ని మర్యాదకోసం చిరునవ్వుతో వింటారే కానీ, ఒక్కటికూడా వినిపించుకోరనీ అర్థమైనప్పుడు కోపమూ, ఉక్రోషమూ పట్టలేకపోయింది.అసలు ఆడా మగా అంత పూసుకొని తిరగడమే ఆమెకి కంపరంగా వుంది. తమ ఇంగ్లండులో స్త్రీ పురుషులు ఒకరినొకరు కళ్ళతో, చిరునవ్వులతో పలకరించుకుంటారు కనీ, ఈ వికవికలూ పకపకలూ ఎరగరు! కానీ ఈ విషయం గురించి ఆమె ఏదైనా వ్యాఖ్యానించి నట్టయితే అందరూ ఆమెని “మీరూ డాక్టరు గారితో చనువుగానే వుంటున్నారు కదా?” అని ఎదురు ప్రశ్నిస్తారన్న భయంతో నోరు మెదపలేదు.

డాక్టరు గ్రాంట్ తో హేరియట్ నవ్వులూ ఎడతెగని కబుర్లూ నిజంగానే ఎవరి దృష్టినీ దాటిపోలేదు. ఇంకొద్ది రోజుల్లో ఆయన మెల్బోర్న్ వదిలి తన వూరు బెన్ మోర్ వెళ్తాడనుకుంటే ఆమెకి దిగులు ముంచుకొస్తుంది.

“మిమ్మల్నొదిలి వెళ్ళడం నాకూ కష్టంగానే వుంది మిస్ హేరియట్. కానీ, బ్రాండన్ లా నేను పని ఎగ్గొట్టి ఊళ్ళు తిరగలేనుగా! ఊరికి వెళ్ళి నా పని చూసుకోవాలి. మీరు విరివాల్టా ఎస్టేటుకి త్వరగా వచ్చేస్తారుగా? అది మా వూరికి చాలా దగ్గర. మనం మళ్ళీ ఇప్పట్లాగే కలుసుకోవచ్చు.” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు డాక్టర్ గ్రాంట్.

“తొందరగానే వచ్చేస్తాను. నిజానికి మా వదిన ఆరోగ్యం కుదుటపడింది కూడా. డబ్బంతా దండగ చేస్తూ ఆవిడ ఇంకా ఈ మెల్బోర్న్ లో ఎందుకుందో నాకైతే అర్థం కాదు!” హేరియట్ అన్నది.

“అవునవును! ఇహ ఆమె ఆరోగ్యానికేం ఢోకా లేదు.”

“నాకూ విరివాల్టా చూడాలని చాలా అతృతతగా వుంది. పిల్లల వుత్తరాల నిండా ఎస్టేటు కబుర్లే. టీచరు జేన్ కి కూడా చాలా నచ్చిందట. మీరు టీచరు గారిని చూసారా? మీలాగే ఆవిడా స్కాట్ లాండ్ సంతతి.”

“ ఆ టీచరు గారు మన పనమ్మాయి ఎల్సీ వాళ్ళ అక్కట కదా? ఈవిడ లాగే ఈసురోమని వుంటుంది కాబోలు!”

“అయ్యో అలాగంటారే! మా అన్నయ్యకి ఎల్సీ అంటే ఎంతిష్టమో తెలుసా? నావరకు నాకు జేన్ ఎక్కువగా నచ్చుతుంది. చూడడానికి మామూలుగా వున్నా మహా తెలివైంది. విరివాల్టాలో ఆమెని చూడగానే మీరు ప్రేమలో పడిపోతారేమో, జాగ్రత్త!” వేళాకోళంగా అంది హేరియట్.

“ఆ ప్రమాదమేం లేదులే. నాకు మరీ పుస్తకాల పురుగుల్లా వుండే ఆడవాళ్ళంటే చిరాకు. స్త్రీలు చదువుకోవల్సిందే, కానీ తాము ఆడవాళ్ళమన్న మాటే మరిచిపోయేంత చదువేం వొద్దు. అదలా వుంచండి. హేరియట్!మీకు విరివాల్టా వెళ్ళాలని వుంటే మీ వొదినగారు రాకపోయినా, నేను తీసుకెళ్తాను,” సాహసంగా అన్నాడు గ్రాంట్.

“వెళ్ళొచ్చనుకోండి, కానీ అన్నయ్య ఏమంటాడో!” నసిగింది హేరియట్.

“స్టాన్లీ తో నే చెప్తాగా. ఇక్కడ లిల్లీగారు బాగా కోలుకున్నారనీ, ఇక్కడ వున్న మన గుర్రాలు అర్జంటుగా ఎస్టేటు చేర్చాలనీ, అందువల్ల మనిద్దరమూ కలిసి గుర్రాలు తిసుకొస్తామనీ చెప్తాను.”

“నాక్కూడా మెల్బోర్న్ అంటే విసుగు పుడుతోంది. ఇహ ఇక్కడ చూడ్డానికింకా ఏమీ లేదు. విరివాల్టా వెళ్ళిపోతే అక్కడికి వదిన వచ్చేలోపు ఇల్లంతా ఆవిడకొరకు చక్కబెట్టొచ్చు. పైగా, జేన్ టీచరుకు లెక్కలూ, సైన్సూ లాటివే తప్ప సంగీతం బొత్తిగా రాదు. నేనుంటే పిల్లల సంగీతం పాఠాలు మళ్ళీ మొదలుపెట్టొచ్చు. నేను విరివాల్టా వొచ్చేస్తానంటే అన్నయ్య తప్పక ఒప్పుకుంటాడు!” హేరియట్ సాలోచనగా అంది.

“ఏమిటీ? జేన్ టీచరుకి సంగీతం రాదా? మరి ఆవిడని పిల్లలకి టీచరుగా ఎందుకు పెట్టారు?”

“అయినా ఆవిడ చాలా తెలివైంది. ఆవిడ రాక ముందు మా అన్నయ్య పిల్లలు దేభ్యాల్లాగుండేవారు. చెట్లూ గుట్టలూ ఎక్కి తిరుగుతూ మహా పోకిరీల్లాగుండేవారు. ఆవిడ కాస్త క్రమశిక్షణతో వాళ్ళని దార్లోకి తెచ్చింది. ఆవిడ బ్రిటిష్ యువతి కాదు, అదొక్కటే నాకు ఆవిడలో కనపడే లోపం,” నవ్వుతూ అంది హేరియట్.

“స్కాట్ లాండ్ వాళ్ళని మరీ అంత తీసిపడెయ్యొద్దు! నేనూ స్కాట్ లాండ్ వాణ్ణేగా? అది సరే, మరయితే మన ప్రయాణం ఖాయమేనా?”

“గుర్రాల మీద వెళ్తే ఎన్ని రోజులు పట్టొచ్చంటారు?”

“రెండురోజులు.మధ్య దారిలో మా మిత్రుడి హోటలుంది. ఒక రోజు రాత్రి అక్కడ బస చేయొచ్చు. ఆస్ట్రేలియాలో పల్లెటూళ్ళల్లో ఎలాటి ఆతిథ్యం దొరుకుతుందో చూపిస్తాను. అందులోనూ, వాళ్ళూ నాలాగే స్కాట్ లాండ్ కి చెందిన వారు! ఆ ప్రదేశం కూడా చాలా అందంగా వుంటుంది,” ఊరిస్తూ అన్నాడు డాక్టర్ గ్రాంట్.

“సరే, అదీ చూద్దాం మరయితే. అయితే నేనొక్కమాట వదినని కూడా అడిగి చెప్తా, సరేనా?”

*******

 

ఆ రోజు లిల్లీ ఎప్పటికంటే చిరాగ్గా వుంది. మరదలు పిల్లల సంగీతమూ అదీ ఇదీ అని చెప్పిన ఒక్క మాటా నమ్మలేదు గానీ, మెల్బోర్న్ వెళ్ళడానికి తనకేమీ అభ్యంతరం లేదంది. నిజానికి ఆ అమ్మాయి అన్నగారి ఇంట్లో పేరుకు మాత్రమే వుంది. ఎన్నడూ వదిన గారితో ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. ఒంటరిగా డాక్టరుతో పంపితే భర్త ఏమంటాడో నన్న భయం కొంచెం ఏ మూలో కలవరపెట్టినా పెద్దగా పట్టించుకోలేదు. అందరు స్త్రీలకీ సత్ప్రవర్తన గురించి ఉపన్యాసాలిచ్చే హేరియట్ ఒంటరిగా డాక్టరుతో కలిసి రెండు రోజులు ప్రయాణం చేయబోతుందని తెలిసినప్పుడు ఎల్సీ మాత్రం ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యాన్ని హేరియట్ కనిపెట్టింది కూడా.

“ఇలాటి ప్రయాణం ఇంగ్లండులో అయితే నేను చచ్చినా తలపెట్టి ఉండేదాన్ని కాదు. కానీ, ఇక్కడ ఎవరూ పట్టించుకుంటున్నట్టు లేరు. అలాటప్పుడు నేను నా పధ్ధతులకోసం నిన్నిబ్బంది ఎలా పెడతాను వొదినా? ఎలాగూ నువ్వు కొద్దిరోజుల్లో అక్కడికే వొస్తున్నావాయె. కొంచెం ముందుగా వెళ్ళి ఇల్లదీ నీకు సౌకర్యంగా ఏర్పాటు చేయాలనే నా తాపత్రయమంతా! పైగా ఇలా వెళితే కాస్త పల్లెటూళ్ళనీ చూసినట్టుంటుందన్న కుతూహలం ఒకటి. పోనీ నువ్వూ మాతో రాకూడదూ? ఇప్పుడు నువ్వు తేలిగ్గా ప్రయాణం చేయొచ్చని డాక్తరుగారు చెప్పారు.”

“నేను చచ్చినా ఒంటరిగా ప్రయాణాలు చేయను. మీ అన్నయ్య ఇక్కడికొచ్చి నన్ను తిసుకొస్తాడు లే. నువ్వు ఒంటరిగానే వెళ్ళు.” నిర్మొహమాటంగా అంది లిల్లీ.

“మరి ఇక్కడ నువ్వు ఒంటరిగా, అన్నయ్య కోప్పడతాడేమో!”

“అబ్బ! ఇక్కడ ఎల్సీ, ఇంకొక నర్సూ కూడా వున్నారుగా. వాళ్ళు చూసుకుంటార్లే. నువ్వు వెళ్ళి వీలైనంత త్వరగా మీ అన్నని పంపించు.”

హమ్మయ్య, అని నిట్టూర్చి ప్రయాణమైంది హేరియట్.

మధ్యలో ఒకరోజు ఆగి, రెండో రోజు సాయంత్రానికి విరివాల్టా ఎస్టేటు చేరుకున్నారు వాళ్ళు. ఆమెని ఎస్టేటు దగ్గర దిగబెట్టి తానింకో రోజు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ గ్రాంట్.

ఇంటికెళ్ళేసరికి స్టాన్లీ లేడు. ఏదో పనిమీద బయటికెళ్ళాడు. జేన్ వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపోయినా ఏమి అనలేదు.

ఆ మర్నాడంతా హేరియట్ అన్యమనస్కంగానే గడిపించి. అన్నగారిల్లూ, ఎస్టేటులో పెంచుతున్న జంతువులూ, పిల్లల ఆటలూ, ఇంట్లో పనివాళ్ళూ, ఆమెకి పెద్ద సంతోషాన్నివ్వడంలేదు. కాలం గడవనట్టనిపిస్తూంది. ఆమెకి మళ్ళీ డాక్టర్ గ్రాంట్ వచ్చి కబుర్లు చెప్తే బాగుండనిపించింది. ఆమె ఆశపడ్డట్టే గ్రాంట్ మళ్ళీ వచ్చి ఆమెని కబుర్లలో ముంచెత్తాడు. మళ్ళీ హేరియట్ కి కాలం సరదాగా గడవసాగింది.

**********

వాళ్ళిద్దరూ అలాగే సరదా కబుర్లలో మునిగివున్న ఒకరోజు అకస్మాత్తుగా మేనల్లుడు ఎడ్గర్ ని వెంటబెట్టుకొని బ్రాండన్ విరివాల్టాకొచ్చాడు. అతన్ని చూసి ఒక్క క్షణం తడబడింది హేరియట్. అంతలోనే తేరుకొంది.

“ఎంత ఆశ్చర్యం! బ్రాండన్ దొరగారొచ్చారే! బహుకాల దర్శనం. బాగున్నారా? ఇన్ని రోజులూ ఎక్కడికి మాయమయ్యారు?” అంది వేళాకోళంగా.

“చాలా చోట్లే తిరిగాలెండి పన్ల మీద! అందుకే కనబడలేదు.” ఆమె వేళాకోళానికి చిరాకు పడ్డాడు బ్రాండన్.

“పన్లా? ఏం పన్లబ్బా అవి? గొర్రెలని తరుముతూ ఆస్ట్రేలియా అంతా పరుగులు తీస్తున్నారని విన్నానే!”

“అవునవును. సరిగ్గా గొర్రెల వెనకే తిరిగాను. అది సరే కానీ, మీ అన్నయ్యా వదిన లేరి?”

ఎమిలీ కల్పించుకుంది. “అమ్మ మెల్బోర్న్ లోనే వుంది బ్రాండన్. నాకు ఇంకో బుల్లి తమ్ముడు పుట్టాడు తెల్సా? నాన్న శనివారం వచ్చేస్తాడు. నిన్నూ, ఎడ్గర్ నీ చూసి చాలా సంతోషపడతాడు. మిమ్మల్నిద్దరినీ చాలా తలచుకుంటున్నాడు.”

“జేన్!మీ చెల్లాయి ఎల్సీ ఏది? తనూ ఇక్కడికొచ్చిందా లేకపోతే ఇంగ్లండులోనే వుండిపోయిందా? తనెలా వుంది?” జేన్ వైపు తిరిగి సంకోచంగా అడిగాడు బ్రాండన్.

“బాగుండకేం చేస్తుంది? అక్కడ మెల్బోర్న్ లో మా వదిన దగ్గరే వుంది. రెండు మూడు వారాల్లో వాళ్ళూ ఇక్కడికొస్తారు,” హేరియట్ అసహనంగా అంది.

“నీ అరోగ్యం బాగు పడిందా ఎమిలీ?”అభిమానంగా అడిగాడు బ్రాండన్. వాళ్ళందరూ భయంకరంగా జబ్బు పడ్డసంగతి తెలుసతనికి.

“ఓ! రోజూ జేన్ టీచర్ నన్ను ఎస్టేటంతా నడిపిస్తూందిగా? దాంతో బోలెడంత శక్తి వచ్చేసింది. మేమింకా మా బుక్కి తమ్ముణ్ణి చూడనేలేదు.”

“అవునుగాని, మీరెవరూ నాకసలు ఉత్తరాలే రాయలేదే? చాలా రోజుల కింద మీకందరికీ బాగా జ్వరంగా వుందనీ, చిన్నారి ఈవా మనకిక లేదనీ ఒక ఉత్తరం వచ్చింది. ఆ తర్వాత ఒక్క ఉత్తరమూ లేదు! ఏమయ్యారు మీరంతా?”

“పడవ మీద ప్రయాణం చేస్తూన్నాం కదా? అందుకే రాయలేదేమో. పడవమీద అనుకున్నదానికంటే ఎక్కువరోజులు పట్టిందట, నాన్న అన్నాడు. అన్నట్టు పడవ మీద కూడా జేన్ టీచరు పాఠాలు చెప్పారు తెలుసా?”

నవ్వాడు బ్రాండన్.

“హేరియట్! మెల్బోర్న్ వదిలి ఈ పల్లెటూరు ఎలా వచ్చావు? నీకు ఈ ప్రదేశం కొంచెం కూడ నచ్చి వుండదు!”

“అదేం లేదు. నేను ఎస్టేటు చూస్తానంటే అన్నయ్య ఎగిరి గంతేసాడు.నాకిక్కడ భలే సరదాగా వుంది. ఇక్కడే వుండిపోతానని చెప్పలేను కానీ, అప్పుడప్పుడూ రావొచ్చు.”

ఆమె అతిశయం చూసి నవ్వొచ్చింది బ్రాండన్ కి. జేన్ వైపు తిరిగాడు.

“జేన్, మీకూ మీ చెల్లాయికీ, మాలాటి వలస పక్షులంటే అసహ్యం లేదు కదా? అన్నట్టు మీ బంధువు ఫ్రాన్సిస్ ఎలా వున్నారు? ఇప్పుడాయన పార్లమెంటు సభ్యుడట కదా?”

“ఫ్రాన్సిస్ బానే వున్నాడు బ్రాండన్. వలస పక్షులవల్లే కదా ఇంగ్లండు అభివృధ్ధి చెందేది. వలసపక్షుల మీద కోపం దేనికి?”

“వచ్చే ముందు పెగ్గీ కనిపించిందా?”

“వెళ్ళి ఒకసారి చూసొచ్చాము. తనూ త్వరలో ఇక్కడికి వస్తూండవచ్చు.”

తమనివొదిలేసి వాళ్ళిద్దరే మాట్లాడుకోవడం గ్రాంట్ కేమాత్రమూ నచ్చలేదు.

“అది సరే కాని బ్రాండన్, ఇన్ని రోజులూ అడిలైడ్ లో ఏం చేసావ్? నన్నేమో ఎస్టేటు వ్యవహారాలు చూడొద్దన్నావు. నువ్వేమో ఊరేగపోయావు. ఇలాగైతే స్టాన్లీ ఏమంటారు?” దర్పంగా అడిగాడు.

తన ప్రియమైన బ్రాండన్ తో గ్రాంట్ అలా మాట్లాడడం ఏమాత్రం నచ్చలేదు ఎమిలీకి.

“ఆహా! అక్కడికేదో నువ్వు మహా పెద్ద పని చేస్తున్నట్టు. అది చాలదని అక్కడ అమ్మనీ, ఎల్సీని ఒంటరిగా ఒదిలేసి అత్తయ్యనీ వెంటబెట్టుకొచ్చాడు. నాన్నేం అంటాడో! నాకూ బుజ్జి తమ్ముణ్ణీ అమ్మనీ చూడాలని వుంది.”

“పోనీ నేను నిన్ను తీసికెళ్ళనా మెల్బోర్న్? రేపే బయల్దేరదాం.” బ్రాండన్ అడిగాడు.

“వెళ్ళనా టీఛర్?” ఆశగా అడిగింది ఎమిలీ జేన్ ని.

నవ్వేసింది జేన్.

“లేదమ్మా!మీ నాన్నగారొస్తే చదువూ సంధ్యా మానేసి అంత దూరం పంపినందుకు నన్ను కోప్పడతారు. అయినా తొందర్లోనే అమ్మా,తమ్ముడూ ఎల్సీ అందరూ ఇక్కడికే వొచ్చేస్తారుగా?” అంది అనునయంగా.

ఇప్పుడే అడిలైడ్ నించి వచ్చి, మళ్ళీ మెల్బోర్న్ ప్రయాణమా? ఇలా అయితే ఇతని ఎస్టేటు నడిచినట్టే అనుకున్నాడు గ్రాంట్ హేళనగా.

తన ఉత్తరం ఎల్సీకి అందలేదు కాబట్టే ఏ జవాబూ రాలేదు. ఈ సంగతి విన్నదగ్గర్నించీ బ్రాండన్ కి రెక్కలు కట్టుకుని మెల్బోర్న్ వెళ్ళి ఎల్సీని చూడాలని వుంది.ఎడ్గర్ ని అక్కడే విరివాల్టాలో వొదిలేసి ఆఘమేఘాలమీద ఆత్రంగా మెల్బోర్న్ ప్రయాణమయ్యాడు బ్రాండన్.

*****************

36 వ భాగం

హేరియట్ ఫిలిప్స్ ఆత్మ బంధువు

డెంస్టర్ అడిలైడ్ హోటల్లో చెప్పినట్టు ఫిలిప్స్ కుటుంబం ఆస్ట్రేలియా చేరుకోగానే విడి పోవాల్సి వచ్చింది. లిల్లీ ఫిలిప్స్ ఆరోగ్య కారణాలవల్ల మెల్బోర్న్ లోనే వుండాలని నిశ్చయించుకుంది. ఎస్టేటు కెళ్తే ఆ పల్లెటూళ్ళో వైద్య సహాయం తేలిగ్గా దొరకకపోవచ్చు. వకీలు టాల్బాట్ ఉత్తరం రాసి మిసెస్ పెక్ ని బెదిరించడం ద్వారా స్టాన్లీ ఆవిడ మెల్బోర్న్ రాకుండా కట్టుదిట్టం చేసాననుకున్నాడు. దాంతో భార్య మెల్బోర్న్ లో వుంటానంటే అభ్యంతర పెట్టలేదు. ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబాన్ని అందులో వుంచాడు.

అయితే పిల్లలకి మాత్రం మెల్బోర్న్ కొంచెం కూడా ఇష్టం లేదు. వారికి వాళ్ళు వుండే విరివాల్టా వూరే ఎంతో ఇష్టం. దాంతో చెల్లెల్నీ, ఎల్సీనీ భార్యకి తోడుగా వుంచి పిల్లలనీ జేన్ నీ తీసుకుని విరివాల్టా వెళ్ళిపోయాడు స్టాన్లీ.

మెల్బోర్న్ లో దిగగానే బ్రాండన్ అడిలైడ్ వెళ్ళిన సంగతి తెలుసుకోని స్టాన్లీ చిరాకు పడ్డాడు. అతను స్నేహితుణ్ణి కలిసి తన ఎస్టేటు విశేషాలు ముచ్చటించాలన్న ఆత్రంతో వున్నాడు. డాక్టర్ గ్రాంట్ వచ్చి బ్రాండన్ తనని ఉద్యోగంలోంచి పీకేసేంతవరకూ తానెంత శ్రధ్ధగా ఎస్టేటుని కనిపెట్టి వున్న సంగతి చెప్పి వూదర గొట్టేసాడు.

“ పైగా ఎస్టేటు పన్లన్నీ వొదిలేసి అడిలైడ్ వెళ్ళాడండీ మీ స్నేహితుడు! ఏదో గొర్రెలని కొనుక్కొస్తాడట. నన్నడిగితే ఆయనకి గొర్రెకీ బర్రెకీ తేడా తెలియదు. మరేం బేరాలు చేస్తాడో కానీ..”

“మన ఎస్టేటు లోకి కూడా గొర్రెలు కొంటానన్నాడే, అవన్నీ మరి విరి వాల్టా చేరుకున్నాయా?”

“ఇంకెక్కడి గొర్రెలండీ? అయినా, నాకు తెలీకడుగుతాను, మన విక్టోరియా లో దొరికే గొర్రెలకంటే బాగుంటాయా ఆ అడిలైడ్ లో గొర్రెలు? అక్కణ్ణించి లారీల్లో ఈ వూరు ఒచ్చేసరికే అందులో మూడొంతులు చచ్చి వూరుకుంటాయి. ఆయన డబ్బూ, దాంతో పాటు మనదీ, అంతా మునిగినట్టే!”

“అది సరే, బ్రాండన్ మిగతా పరిస్థితి ఎలా వుంది? ఇంగ్లండు నించి చాలా ఆందోళనగా బయల్దేరాడు.”

“ఎస్టేటంతా బానే వుంది కానీ, ఆయనకే ఏదో మనసు బాగున్నట్టు లేదు. ఇంతకు ముందులా పని చేయడంలేదు. పైగా మన ఎస్టేటులో నన్ను పని చేయనివ్వకుండా ఒకటే కలిపించుకోవడం. పనివాళ్ళకి చనువిచ్చి నెత్తినెక్కిచ్చుకోవడం, అబ్బో ఒకటనేమిటి..”

హేరియట్ ఆ సంభాషణలో కలగజేసుకుంది.

“మీరన్నది నిజమే డాక్టర్ గ్రాంట్. మా అన్నయ్యకీ, బ్రాండన్ కీ, ఇద్దరికీ పని వాళ్ళకి చనువిచ్చే అలవాటుంది. దానికి వాళ్ళేం పేర్లు పెట్టినా, అది మంచి అలవాటు కాదు.”

నిజానికి డాక్టరు గ్రాంట్ కి తిక్క తిక్కగా వుంది. ఎస్టేటులో తన ఉద్యోగం బ్రాండన్ పీకేయడం ఒక కారణమైతే,

“ఆ పల్లెటూళ్ళో సరైన వైద్య సహాయం దొరకదు,” అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లిల్లీ ఫిలిప్స్ మెల్బోర్న్ లోనే వుండిపోతాననడం ఇంకొకటి. అంటే ఏమిటావిడ వుద్దేశ్యం? నేను మంచి వైద్యుణ్ణి కాననా, అని గింజుకున్నాడు.

అందుకే స్టాన్లీ మెల్బోర్న్ వదిలి విరివాల్టా వెళ్ళింతరవాత కూడా తాను ఒక వారం పదిరోజులు మెల్బోర్న్ లోనే వుంటాననీ, కావాలంటే లిల్లీ అమ్మగార్ని కనిపెట్టుకునీ వుండగలననీ అన్నాడు.

అయితే స్టాన్లీ వెళ్ళిపోయి వారమే కాదు రెండూ వారాలు దాటినా, డాక్టర్ గ్రాంట్ మెల్బోర్న్ లో ఇల్లు వదిలి ఎస్టేటు కెళ్ళేప్రయత్నాలేవీ చేయలేదు. పైగా, స్టాన్లీకి

“ఇక్కడ అమ్మగారికీ, అప్పుడే పుట్టిన వారి బిడ్డకూ, చిన్నమ్మాయి హేరియట్ గారికీ తన అవసరం చాలా వుండడం వల్ల, నేను ఇక్కడే తమ అనుమతితో ఇంకొన్ని రోజులు వుండగలను,” అంటూ ఉత్తరం రాసి పడేసాడు. లిల్లీ ఫిలిప్స్ సంగతేమోకానీ, అతను హేరియట్ ఫిలిప్స్ ని చాలా బాగా కనిపెట్టి వున్నాడనే చెప్పుకోవాలి.

అతనికి హేరియట్ ని చూస్తున్న కొద్దీ ఇలాటి భార్య తనకుంటే బాగుండనిపిస్తూంది. ఆమె చదువూ, డబ్బూ, వేష భాషల్లో నాగరికతా, నాజూకు అతనికి తెగ నచ్చేసాయి.ఆమెతో పరిచయమూ చనువూ పెంచుకునే ఉద్దేశ్యంతో అతను రోజూ ఆమెని సాయంత్రాలు షికారు తీసికెళ్లడం మొదలు పెట్టాడు. ఆ షికార్లో తన కుటుంబం గురించీ, తన కున్న గొప్ప వాళ్ళ పరిచయాల గురించీ, స్కాట్ లాండ్ లో తమకున్న రాజ ప్రాసాదాల గురించీ వివరంగా చెప్పుకొచ్చాడు. కొంచెం ఆ మాటా నిజమే. అతని తల్లి వైపు నించీ తండ్రి వైపు నించీ కూడా రాజ వంశీకులకి దూరపు బంధుత్వం వుంది.

ఆ విషయాన్నతడు పదే పదే చెప్పి, తాను, డబ్బు కి పేదైనా కులానికీ, అంతస్తుకీ గొప్పనే నమ్మకం ఆమెకి కలిగించాడు.హేరియట్ స్కాట్ లాండ్ కి చెందిన స్త్రీ కాకపోవడం కొంచెం దురదృష్టమే ఐనా, ఆమె అతను చెప్పిన వీర గాథలన్నీ చాలా ఇష్టంగా విన్నది.హేరియట్ కీ బ్రాండన్ కీ నిశ్చితార్థమైనట్టు డాక్టర్ గ్రాంట్ చూచాయగా విని ఉన్నాడు. ఎలాగైనా బ్రాండన్ ని తప్పించి తానే హేరియట్ ని పెళ్ళాడేస్తే ఇహ జీవితాంతం డబ్బుకి లోటుండదు. అందుకే అతను వీలైనప్పుడల్లా బ్రాండన్ గురించి ఫిర్యాదులూ చేసాడు.

పైగా, హేరియట్ తండ్రీ, అన్నల్లాగే తనూ డాక్టరే. వీటన్నిటితో అతనికి హేరియట్ తో మాట్లాడాడానికి బోలెడన్ని విశేషాలూ, సంగతులూ వుండేవి. హేరియట్ కూడా అతనికేమీ తీసిపోకుండా డెర్బీషైర్ లో తమ ఇల్లూ, తమ తోటా, తమ ఇంట్లో జరిగే విందులూ, నగలూ, ఆస్తులూ గురించి వివరంగా చెప్పుకోవడం మొదలు పెట్టింది. దాంతో రోజుకి కనీసం అయిదారు గంటలు కబుర్లు చెప్పుకుంటే కానీ సరిపోని పరిస్థితి ఏర్పడింది.

చదువూ సంధ్యా లేనీ పల్లెటూరి గబ్బిలాయి లాంటి బ్రాండన్ కంటే డాక్టర్ గ్రాంట్ ఎంతో నచ్చసాగాడు హేరియట్ కి. ఎంత డబ్బుంటే ఏం, పుస్తకాల గురించీ, కళల గురించీ తెలియక పోయాక, అనుకునేదామె బ్రాండన్ ఙ్ఞాపకం వచ్చినప్పుడల్లా. తన పొలమూ, గొర్రెల ఖరీదూ, ధరవరల గురించీ తప్ప బ్రాండన్ కింకో విషయమే పట్టదు. అదే డాక్టర్ గ్రాంట్- పుస్తకాలు, చిత్ర లేఖనం, కవిత్వం, రాజకీయాలు, మతం, అబ్బో, అతనికి తెలియని విషయమే లేదనిపించేలా మాట్లాడగలడు.

అసలైతే హేరియట్ వదిన గారికి సాయంగా మెల్బోర్న్ లో వుంటానన్నది కానీ, ఆమెకి ఆ సంగతే గుర్తు లేదు. బాలింతరాలు లిల్లీ ఫిలిప్స్ బాధ్యతా, శిశువు బాధ్యతా కూడా ఎల్సీ పైనే పడ్డాయి. నిజానికి ఎల్సీ పెద్ద పిల్లలతోటీ, జేన్ తోటీ కలిసి విరివాల్టా వెళ్ళాలనుకుంది. హేరియట్ ,“వదినని నేనొక్కదాన్నీ చూసుకోలేను, నువ్వూ నాకు సాయానికి వుండిపో,” అని మొహమాట పెట్టేసరికి మెల్బోర్న్ లోనే ఉండిపోయింది. అయితే హేరియట్ పొరపాటున కూడ “వదినగారిని చూసుకోవడం” అనే పని పెట్టుకోదల్చుకోలేదని ఆమెకి అర్థమైపోయింది.

దానికి తోడు ఒక కూతురి మరణం, మళ్ళీ పురుడూ, పక్కనే భర్త లేకపోవడం అన్నీ కలిపి లిల్లీ గయ్యాళితనాన్ని ఇంకా పెంచాయి.

అయితే ఇంటి పనీ, పై పనీ కంటే ఎల్సీని వదినా మరదళ్ళు ఏదో ఒకనాడు పెద్దగా గొడవ పడతారేమోనన్న భయం ఎక్కువగా కృంగ దీసింది. ఎందుకంటే రాను రానూ హేరియట్ వదిన గారి గదిలోకి రావడమే తగ్గించేసి, ఆపైన మొత్తానికే మానేసింది!

                   ****************

 

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)