ఇద్దరు

IDDARU
కొన్ని కొన్ని పదాలతో ఎటువంటి సమాసాలు నిర్మితమౌతాయో!
అలాగే, కొన్ని కొన్ని జంటలు జీవన సమరంలోంచి బహుళ సందేశాన్నీ దృశ్యమానం చేస్తాయి.
ఈ ఛాయాచిత్రం అటువంటిదే.

+++

నిచ్చెనమెట్ల వ్యవస్థలో తమ కులం పట్ల లేదా తమ వృత్తిపట్ల వాళ్లకు మనవలే విశ్లేషణలు లేవు.,
తమదైన ప్రయత్నం, ఒక అనుభవం, దానివెంట అలసట తప్ప.

ధనికా పేదా వర్గ దృష్టీ లేదు., కఠోరశ్రమ, తదనంతర విశ్రాంతీ తప్ప!

ఇదంతా లేకపోవడం వల్ల, అప్పుడప్పుడు జీవితం మరీ భారం అయినప్పడు ‘కర్మ’ అనుకోవడం తప్పా వీరికి ప్రత్యేక  విచారాలేమీ లేవు.

తమ విధి లిఖితం ఈ గారడి అనుకుని అభ్యాసంతో, అనుభవంతో, గొప్ప ఒడుపుతో చేసే పరంపరానుగత ప్రదర్శన వీరిది. కంప్లేంట్స్ లేవు, కాంప్లిమెంట్ల పట్ల ఆసక్తీ లేదు.

మనకోసం తమదైన లోకంలో ఉంటూ తాము వేసే దొమ్మరిగడ్డలపట్ల వారికి ఎంతమాత్రం ఏహ్యభావం లేదు. గౌరవమూ లేదు. అందువల్లే సబాల్ట్రన్న్, మెయిన్ స్ట్రీమ్ అన్న తేడాలూ లేవు. గమనిస్తే అది వారి జీవకలోంచి పుట్టే జీవన సారస్వతం. ఒక మరులు గొలిపే కళా ప్రదర్శన. కానీ, అలవోకగా ఇలా తాము లిఖించే విఖ్యాత రచనపట్ల వాళ్లలో ఎటువంటి గర్వమూ కానరాదు. తమ ప్రదర్శనలో తలమానికమైన ఈ రచన వారికి ఎంతమాత్రమూ సాహసం కాదు.

చిత్రమేమిటంటే ఇందులో ఉన్నది ఒక్కరా, ఇద్దరా లేదా ఒక బృందమా సమూహమా?
వైయుక్తికమా? సార్వజనీనమా?

ఏమిటది?

+++

నా మటుకు నాకు ఇది పురుషుడి గురించి, ఒక మనిషి పురుషుడిగా ఈ సమాజంలో మోస్తున్న బరువు బాద్యతల గురించి చెబుతుంది. తానే ఆమెను, మొత్తం కుటుంబాన్నీ పోషిస్తున్న భావననూ చెబుతుంది.

మరొకసారి స్త్రీ ప్రధానంగా ఈ చిత్రం సందేశాన్నిస్తుంది. ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని ఎత్తులు వేసినా,  అతడి తలపై పాదం మోపినా కూడా అది పురుషుడి ఆధీనంలోని  ప్రపంచంలో, అతడు నిర్మించిన లోకంలో, తాను పునాదిగా వేళ్లూనుకున్న వ్యవస్థలోనే కదా అనిపిస్తుంది. అందుకే ఆమె ఎంత స్థిరంగా ఉన్నా కూడా అది అతడి సమక్షంలో, అతడి సంరక్షణలోనే కదా అనిపిస్తుంది.

మరొకసారి జీవన సమరంలో దంపతులుగా కనిపించి, ఒకరికొకరు తోడూ నీడగా మెలిగే సందర్భంలో, పయణించే మజిలీలోని ఒకానొక దృశ్యం ఈ చిత్రం అనిపిస్తుంది. సమవుజ్జీలుగా బతుకు నావను ఈదుతున్న పరస్పరాధారాలుగానూ కానవస్తుంది. అప్పుడు ఈ చెట్టు ఒక్క కొమ్మ పుష్పాలే అనిపిస్తుంది కూడా.!

మానవులుగా వీరు ఇద్దరు. కానీ, ఇదొక్కటే కాదు, ఇంకెన్నో విధాలుగా గారడీలు చేసి మనకి వినోదం పంచి నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ, వీరిద్దరేనా అన్న సంశయం ఈ చిత్రం నాకు కలిగిస్తూనే ఉంటుంది.
వీరిద్దరూ ఇద్దరేనా?

+++

ఇంట్లోంచి కెమెరాతో బయటపడ్డ మరుక్షణం నుంచి నాకు ఇలాంటి “ఇద్దరులు’ ఇద్దరిద్దరుగా, పదులు వందలు వేలు లక్షలుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ల జీవనచ్ఛాయలు సాధారణమైనవే. కానీ వాటన్నిటిలో ఒక సాధారణత్వం ఉంటుంది. అదే సమయంలో తమకు మాత్రమే ప్రత్యేకమైన విశిష్టతా  అభివ్యక్తం అవుతుంటుంది. వాళ్లను అధోజగత్ సహోదరులుగా చూపటం ఒకటైతే, సృజనశీలురుగా, అధోజగత్ సృజనశీలురుగా, వాళ్లను పౌరులుగా చూపడం ఒక లక్ష్యం.

మనం వాళ్లను సగటు మనుషులుగా చూడటం ఒకటి. ప్రత్యేకాంశాల కలబోతగా పరిశీలించడమూ వేరువేరు. అయితే, వారి ఉనికి తామరాకు మీది నీటి బిందువు ఒకటైతే, నైలు నది నాగరీకతలో ఈ జీవనానికి ఉన్న రీతి, రివాజు, ఒకానొక కౌశలం, పారంపర్యతలతో విస్తరించడం మరొకటి. ఇవేవీ కానిదీ ఉండవచ్చు.  అదేమిటీ అంటే, ఒక్కొక్కప్పుడూ వీళ్లు ఇద్దరూ ఒక్కటిగా సృష్టికర్త సందేశాలను అలవోకగా మోసుకొస్తున్న భగవంతుడి లీలగా తాండవించడమూ జరుగుతుంది, అరుదుగా! .

+++

ఏమైనా నదిని ఆనుకుని జీవితం ప్రవహించినట్టు వీళ్లు అడుగడుగునా కానవచ్చి ఇద్దరు ముగ్గురు కాదు, సమాజం అన్న విషయం నాకు అవగతం అవుతూ ఉంటుంది. అప్పుడు పాత్రికేయ ప్రపంచంలో కేవలం మానవాస్తక్తికరమైన కథనాల్లో దాగుండే ఇలాంటి బతుకు చిత్రాలు మార్మికత నాకు ప్రధానం అవుతాయి. వీళ్లిద్దరూ మన విలువలను తలకిందులు చేసే మెయిన్ స్ట్రీమ్ అయి, నదీనదాలై ప్రవహిస్తయి. నన్ను ముప్పిరిగొంటయి. నా కెమెరా గుండా మీ దాకా ఇలా ఒక్కో ఖండిక ధారావాహిక ఐ ప్రవహిస్తయి.

అందుకే నా ఛాయాచిత్రాలు గురజాడలు. ఈ దేశమంటే మట్టికాదు మనిషని రుజువు చేసే ఆలూరి బైరాగులు. బావిలోని గొంతుకలు. దుఃఖం వస్తే గొడగొడ ఏడ్చే, సంతోషంలో ఆనందబాష్పాలు కార్చే కాళోజీలు. ఇవి గొప్ప విశ్వాసాలకు నకల్లు. అస్తిత్వపు దిక్సూచీలు. ఊరూవాడా ఒక్కటి చేసే మూడో ప్రపంచపు మా పెద్దబడి పక్కన ఎగిరే పీరీలు.

+++

ఆమె బారానికి అతడి కాయం నుంచి వచ్చే ఉచ్ఛాస నిశ్వాసాలు నా ఛాయాచిత్రాలు.
నిజమే. ఈ  చిత్రం ఇద్దరిదే. మీదీ నాదీ. మరి కృతజ్ఞతలు.

~ కందుకూరి రమేష్ బాబు

Download PDF

2 Comments

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)