మేలు మరవనివాడు

1950-189

నులివెచ్చటి వసంతకాలపు ఉదయం. స్కాట్లండ్ లో ఒక జమీందారు తనకోట బయట ఆకుపచ్చని మైదానం లో పచార్లు చేస్తున్నాడు . ఆయన అసలు పేరు కొల్జియాన్ జమీందారు. అయితే స్కాట్లండ్ లోని ఆరీషైర్ ప్రాంతం లో అందరూ కో జమీందారు అనే పిలుస్తారు [ వాళ్ళ భాషలో ‘ కో ‘ అంటే సముద్రపు గుహ అని అర్థం. ] కొన్ని ఎకరాల వైశాల్యంగల పెద్ద రాతిమీద ఆ కోటని కట్టారు. దిగువన సముద్రం ఆ రాతిలో గుహలని తొలిచింది.

ఆయన చాలా దయగలవాడు, పెద్దమనిషి. పొరుగువాళ్ళ కష్టాలు విని కదిలిపోయేవాడు. ఎవరికి ఏ సాయం చేయాలన్నా ముందుండేవాడు.

అప్పుడు ఒక చిన్న పిల్లవాడు అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. వాడు ఒక చేత్తో పొడుగాటి గిన్నెని పట్టుకుని ఇంకో చేత్తో మొహం మీద పడే జుట్టుని వెనక్కి తోసుకుంటూ ఉన్నాడు. జమీందారు ముద్దుగా పిల్లాడి తల నిమిరి ఏం కావాలని అడిగాడు. వాళ్ళ అమ్మ జబ్బు పడి కోలుకుంటోందనీ ఆ గిన్నె నిండా ద్రాక్షరసం ఇప్పిస్తారా అనీ వాడు జమీందారుని అడిగాడు. చలిదేశాలలో ఆరోగ్యం కోసం నిలవ చేసిన ద్రాక్షరసాన్ని తాగుతారు. జమీందారు తన సేవకుడిని పిలిచి అన్నిటికన్నా మంచి ద్రాక్షరసాన్ని గిన్నె నిండా ఇచ్చి పంపమని చెప్పాడు.

సేవకుడూ చిన్నపిల్లాడూ నేలమాళిగలో ద్రాక్షరసం నిలవ ఉంచిన చోటికి వెళ్ళారు. యజమాని ఇష్టంగా తాగే మేలైన ద్రాక్షరసం , ఒక పీపాలో సగానికి పైగానే ఉంది. ఆ సగంలోంచి తీసి పోసేస్తే సరిపోతుందని సేవకుడు అనుకున్నాడు. ఆశ్చర్యకరంగా పీపా ఖాళీ అయేంతగా పోసినా ఆ చిన్న గిన్నె నిండనేలేదు. సేవకుడికి అనుమానం వచ్చి కిందని ద్రాక్షరసం పొర్లిపోయిందా అని చూశాడు. నేలంతా అద్దంలాగా శుభ్రంగానే ఉంది.

” అమ్మో, ఇదేదో మంత్రపు గిన్నె లాగా ఉందే ! ” అని సేవకుడికి భయం వేసింది. ” ఇంకో పీపా అయితే తెరవను . సగం నిండిందిగా నీ గిన్నె, తీసుకువెళ్ళిపో. ఇంకెంత కావాలేమిటి ? ఎంత ఖరీదో తెలుసా నీకు? నీ బతుక్కి ఇదే చాలా ఎక్కువ ”

MythiliScaled

చిన్నపిల్లాడు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. జమీందారు మాట ఇచ్చాడు, గిన్నె నిండాల్సిందే నని పట్టుబట్టాడు. సేవకుడికి కోపం వచ్చి తిట్టటం మొదలుపెట్టాడు. పిల్లాడు మొండికేశాడు.

అప్పుడు సేవకుడు వెళ్ళి జమీందారుకి సంగతి అంతా చెప్పాడు. ” అది మాయదారి గిన్నె అయ్యగారూ. ఎంతకీ నిండటం లేదు. ఇలా అయితే ఎలా ? మీరే వచ్చి పిల్లాడిని వెళ్ళిపొమ్మని చెప్పండి ”జమీందారు ” అలా వీల్లేదు. నా మాటంటే మాటే. వాడి గిన్నె ని నింపే తీరాలి , నా ద్రాక్షరసం పీపాలన్నీ ఖాళీ అయిపోయినా సరే. వెళ్ళి ఇంకొక పీపా మూత తెరువు ” అని అజ్ఞాపించాడు. చేసేది లేక సేవకుడు ఇంకొక పీపా తెరిచి గిన్నెలోకి వొంపాడు.

ఇదివరకు ఆశ్చర్యానికి రెట్టింపు ఆశ్చర్యం ఇప్పుడు. నాలుగు చుక్కలు పడేసరికే పిల్లాడి గిన్నె పూర్తిగా నిండిపోయింది. పిల్లాడు సేవకుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. అంతకుముందు అతను తనను తిట్టిపోసిన సంగతే పట్టించుకున్నట్లు లేదు. ఆ తర్వాత సేవకుడు ఎంతమందిని కనుక్కున్నా ఆ పిల్లాడి సంగతిగాని, వాడి తల్లి సంగతిగాని ఎవరికీ తెలియనే తెలియదన్నారు.

ఏళ్ళు గడిచిపోయాయి. జమీందారు తన రాజు తరపున యుద్ధం చేసేందుకు వెళ్ళి శత్రువులకి పట్టుబడ్డాడు. ఆయనని చెరసాలలో బంధించి మరణశిక్ష విధించారు. అది పరాయి దేశం, స్నేహితులెవరూ లేరు. తప్పించుకునే దారి లేదు.

మరుసటి రోజు ఉరితీస్తారనగా ఆ రాత్రి ఒంటరిగా తన గదిలో ఆయన తన భార్యనీ పిల్లలనీ తలచుకుని కుమిలిపోతున్నాడు. ఇక మళ్ళీ వాళ్ళు తనకి కనబడరు. బ్రహ్మాండమైన తన కోట, ఆ దిగువ సముద్రం, వాకిట్లో డైసీ పూలు – అన్నీ గుర్తొచ్చాయి. ద్రాక్షరసం కోసం వచ్చిన చిన్న పిల్లాడు ఉన్నట్లుండి కళ్ళముందు అగుపించాడు. వాడి సంగతి ఆయన ఏనాడో మరచిపోయాడు. అదంతా నిజంగా అప్పుడు జరుగుతున్నట్లు అనిపించి గట్టిగా కళ్ళు నులుముకున్నాడు.

Deep_jail_by_ChrisRosewarne

రేపు మరణించబోతూ ఉంటే దేవుడిని ధ్యానించుకోవాలి కదా అనుకున్నాడు. ఆయన అలా తలచుకున్నాడో లేదో , చెరసాల గది తలుపు మెల్లిగా తెరుచుకుంది. ఆ గడప మీద అప్పటి పిల్లాడు. అలాగే ఉన్నాడు, ఒక్క ఏడాది కూడా వయసు పెరిగినట్లు లేడు. ఏదో రహస్యం చెప్పబోయేవాడిలాగా నవ్వుతూ మాట్లాడవద్దని పెదవుల మీద వేలు ఆనించాడు.

” కో జమీందారు గారూ, లేవండి, బయల్దేరండి ” అని గుసగుసగా చెప్పాడు. తన వెంట రమ్మని సైగ చేశాడు. జమీందారు ఏ ప్రశ్నా అడిగే పరిస్థితిలో లేడు. అంతగా నిర్ఘాంతపోయాడు. పొడుగాటి చెరసాల నడవాల గుండా పిల్లాడు కదిలాడు, ఆ వెనకే జమీందారు. తాళం వేసిన తలుపులు ఎదురైతే పిల్లాడు తాకగానే అవి తెరుచుకున్నాయి. వాళ్ళు బయటపడ్డారు.

ఆనందం తో తలమునకలైన జమీందారు తన చిన్న రక్షకుడికి ఆపకుండా కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాడు. ” ఆగండి. ఈ దేశం దాటితేగాని మీకు క్షేమం కాదు. నా వీపు మీద ఎక్కండి ” పిల్లాడు ఆజ్ఞాపించాడు. మారుమాట్లాడకుండా జమీందారు అలాగే చేశాడు. పిల్లాడు ఆయన బరువుని అవలీలగా ఎత్తుకున్నాడు. రెప్పపాటులో భూమిమీదా సముద్రం మీదా ప్రయాణించి జమీందారుని దించాడు . తెలతెలవారుతూ ఉంది. తన కోటముందర, పచ్చగడ్డి, డైసీ పూలు. మొదటిసారి చిన్నపిల్లాడిని ఎక్కడ కలుసుకున్నాడో అక్కడ దిగాడు జమీందారు. పిల్లాడు తన చిన్న చేతిని జమీందారు చేతిమీద ఆనించాడు.

” మంచి చేశారు, మంచి జరిగింది. మా అమ్మ మీద దయ చూపినందుకు ధన్యవాదాలు ” అని మాయమయ్యాడు. ఆ రోజునుంచీ వాడిని చూసినవారు లేరు.

 

– స్కాట్లండ్ జానపద కథ. By Elizabeth Grierson

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

Download PDF

14 Comments

  • Rekha Jyothi says:

    ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆసాంతం ప్రశాంతంగా కధలోని నీతి మనసులో నాటుకుపోయేలా (స్పష్టమయ్యేలా), చాలా బావుంది మామ్. జమీందారు కోట, డైసీ పూలు, ఆకుపచ్చని తోట – పిల్లలకు అర్ధమయ్యే చిన్నచిన్న పదాలతో వర్ణన హాయిగా అనిపించింది. Thank u Mam

  • kanchiraju veerraju says:

    manchi kadha anuvaadam kooda bagundi dr.

  • చాలా బావుంది…..

  • మైథిలి గారూ, ఇంట అందమైన కథను మరిన్ని జిలుగువసనాలు కట్టి అందించారు. అలాంటి fairy land లో విహరించాలనే కోరిక కలుగుతోంది. ధన్యవాదాలు, ఆశీస్సులు.

  • పై వ్యాఖ్య లో ‘ఇంట’ కు బదులు ‘ఇంత’ అని చదువుకోండి.

  • మనసును దోచుకునే చక్కని కథను సరళమైన శైలిలో అందంగా అందించిన మీకు అభినందనలు.థాంక్స్.

  • K.Hanumantha Rao says:

    ఆమ్మా చాల బాగున్నది. పిల్లలకు అర్ధమైన రీతిలో సాగిన మీ కథనామ్, వారికి దయ, పొరుగు వారికి అవసర విషయాలలో సహాయం చేయాలనీ భోదించటం చాల బాగున్నది. మీ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ

  • sunita says:

    హార్ట్ టచింగ్.

  • Ivaturi Balatripurasundari says:

    మీ అనువాదం చాలా హృద్యంగా వుంది

  • Ivaturi Balatripurasundari says:

    అభినందనలు

  • Ivaturi Balatripurasundari says:

    cinnapillala kadhalloa jeevanaveadaalenno vumTaayi

  • BURRA BHUPATHI ROYAL says:

    MYTHILI GAARU TENTHA CHAKKATY KATHA. YIPPATY PILLALAKI CHAALA AVSARAM. VARNANA, PAATHRALU ANNI OKA KATHALAAGA LEEDU DRUSYAM LAAGA ANIPINCHINDI, DANYAVAADAALU.

  • BHUVANACHANDRA says:

    ******************************************** ధన్యవాదాలు **********************************

  • మైథిలి అబ్బరాజు says:

    ధన్యవాదాలు రేఖా , కంచిరాజు వీర్రాజు గారూ, శివరామ కృష్ణారావు గారూ, రాధ మండువ గారూ, సునీత గారూ, భూప్ రాయల్ గారూ, ఇవటూరి బాలా త్రిపురసుందరి గారూ , కె. హనుమంత రావు గారూ , నాగరాజు రామస్వామి గారూ !!! చాలా సంతోషం ! ఈ వ్యాఖ్య లన్నీ చదివితే ఎంత శక్తి వస్తోందో ! నమస్కారాలు భువనచంద్ర గారూ !

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)