జాగ్రత్త లేనివాడు

MythiliScaled

ఒకానొకప్పుడు యెరెవాన్ అనే  నగరం లో  లో ఒక   వ్యాపారస్తుడు ఉండేవాడు.   అతనికి పెద్ద జబ్బు చేసింది. ఇక ఎంతో కాలం బతకనని తెలిసి కొడుకుని దగ్గరికి పిలిచి ” బాబూ ! మహారాజుల దగ్గర కూడా ఉండనంత ఐశ్వర్యాన్ని సంపాదించాను. అదంతా అనుభవిస్తూ నా వ్యాపారం కొనసాగించు. పొరబాటున కూడా టిఫ్లిస్ నగరానికి మాత్రం వెళ్ళకు ” అని హెచ్చరించాడు.

తర్వాత భార్యని పిలిచి తన గది  తాళం చెవి ఇచ్చి ” మన అబ్బాయి అబ్దల్   ఒకవేళ డబ్బంతా పోగొట్టుకుని బీదవాడైతే నా రహస్యాలని అతనికి చెప్పు ” అని చనిపోయాడు.

ఆ తర్వాత కొన్నాళ్ళకి  అబ్దల్ నలభై ఒంటెల మీద  సరుకులు వేసుకుని వర్తకం కోసం బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి ఒక చోట విడిది చేసి ఉండగా ఇద్దరు మనుషులు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని అటువైపుగా వచ్చారు. వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అబ్దల్ కి జాలేసి వాళ్ళని పిలిచి భోజనం పెట్టించి  కొత్త బట్టలు ఇచ్చి ఏమైందని అడిగాడు.

” అయ్యా ! అది చెప్పకూడదు ” అన్నారు వాళ్ళు. అబ్దల్ చెప్పమని బలవంతం చేశాడు.

చివరికి వాళ్ళు ఇలా అన్నారు ” మాది కపన్ నగరం .మేమూ నీవంటి వర్తకులమే. మా దగ్గరా చాలా ధనం ఉండేది. కొన్ని రోజుల క్రితం మేము టిఫ్లిస్ నగరానికి వెళ్ళాం. ఆ రాజుగారి కూతురు జగదేక సుందరి అని విని ఆమెని చూడాలనుకున్నాం. ఒకసారి ఆమెని గాజు అద్దాలలోంచి చూడటానికి నలభై బంగారు నాణాలు ఇవ్వాలట. అలాగే ఇచ్చి ఒకసారి చూశాం. మళ్ళీ మళ్ళీ , ప్రతిరోజూ చూడాలనిపించేది. అలా రోజూ మా దగ్గర ఉన్న  సరుకంతా రాజుకే ఇచ్చేస్తూ రోజూ ఆమెని చూసేవాళ్ళం.

ఒకసారి చూశాక తిరిగి చూడాలనుకోకుండా ఉండటం మానవమాత్రులెవరికీ అయే పని కాదు. ఆమె అందం అంతగా ఆకర్షిస్తుంది.

ఎనభై ఒంటెల మీద తీసుకెళ్ళినదంతా ఖర్చయిపోయి, ఇదిగో, ఇలా అయిపోయాం. నువ్వు మంచివాడివిలా ఉన్నావు. మేము నీకు ఎదురు పడకుండా ఉంటే బావుండేది. నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు, టిఫ్లిస్ కి మటుకు వెళ్ళకు ”

 

అంతా విని అబ్దల్ ఏమీ అనలేదు. మర్నాడు వాళ్ళిద్దరికీ గుప్పెడు బంగారునాణాలు ఇచ్చి పంపేశాడు. ఎంత వద్దనుకున్నా ఆ నగరానికి వెళ్ళాలనే అతనికి గట్టిగా అనిపించింది. ఒకసారి చూసి వచ్చేస్తే ఏమవుతుందిలే అనుకున్నాడు. వెళ్ళనే వెళ్ళాడు.

 

మొదటిసారి జగదేకసుందరిని చూస్తూనే ప్రేమలో పడిపోయాడు. ఆమెని పలకరించాలనీ , ఒప్పించి పెళ్ళాడాలనీ రోజూ వెళ్ళి తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఆమెకి తన మాటలు వినిపించినట్లే  లేదు. ఆ అద్దానికి అటువైపునుంచి  ఎవరూ కనిపించరని అతనికి తెలియలేదు.

ఇక చేసేదేమీ లేక యెరెవాన్ కి తిరిగి వెళ్ళి తల్లితో జరిగిందంతా చెప్పాడు. తండ్రిమాట పెడచెవిని పెట్టి అక్కడికి వెళ్ళినందుకు ఆమె కొడుకుని చెడామడా తిట్టింది. అబ్దల్ క్షమించమనీ మరి ఇంకెప్పుడూ వెళ్ళననీ బతిమాలుకున్నాడు. మళ్ళీ వ్యాపారం చేసి తండ్రి పేరు నిలబెట్టేందుకు పెట్టుబడి కావాలి కదా ! అందుకని తండ్రి తనకు ఇచ్చిన తాళం చెవితో ఆ రహస్యపు గది తలుపు తెరిచి  ఒక చిన్న సంచీని పట్టుకొచ్చింది.

story1

” అబ్దల్ ! ఇదిగో, ఇందులో నువ్వు నలభై రాగినాణాలు పెడితే తెల్లారేసరికి అవన్నీ బంగారు నాణాలుఅవుతాయి

. జాగ్రత్తగా వాడుకో ” అని అతనికి ఇచ్చింది.

పదిరోజులు అలా చేసేసరికి నాలుగు వందల బంగారు నాణాలు పోగయాయి. వాటితో కొత్తగా సరుకులు కొని అబ్దల్ మళ్ళీ వ్యాపారం చేస్తానని బయలుదేరాడు. అయితే కొన్నాళ్ళకే తల్లికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. టిఫ్లిస్ నగరానికే వెళ్ళాడు. రోజూ నలభై బంగారు నాణాలు ఇచ్చి రాజకుమారిని చూస్తూనే ఉన్నాడు. ఆ రాజు అతని డబ్బు ఎంతకీ అయిపోకపోవటం కనిపెట్టి ఒక రోజు అతన్ని పిలిచి కబుర్లలో పెట్టాడు. వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని అబ్దల్ అడిగాడు.

” ఓ ! దానికేం ! తప్పకుండా …నీ తరగని ధనం రహస్యం ఏమిటో చెబితే అలాగే ఆమెతో నీ పెళ్ళి జరిపిస్తాను ” అని టక్కరి రాజు చెప్పేసరికి అబ్దల్ నమ్మి సంచి సంగతి చెప్పేశాడు. మాయమాటలతో సంచీ తీసేసుకుని రాజు అబ్దల్ ని వెళ్ళగొట్టాడు. అబ్దల్ కి చాలా ఏడుపు వచ్చింది. వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి ” బుద్ధొచ్చిందమ్మా ! నాన్న ఇచ్చింది ఇంకేమీ లేదా నీ దగ్గర ? ఇస్తే బాగుపడతాను ఈ సారి ” అని వేడుకున్నాడు. ఈ సారి తల్లికి కోపం అంత తొందరగా తగ్గలేదు. పెట్టిందేదో తిని ఇంట్లోనే పడిఉండమంది. రెండు మూడు నెలలయినా అబ్దల్ ఆమెను బతిమాలుతూనే ఉన్నాడు. చివరికి కరిగి, తల్లి ఈ సారి ఒక టోపీ తెచ్చి ఇచ్చి

” ఇది తలమీద పెట్టుకుంటే ఎవరికీ కనబడవు. పోయినదాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి ” అని గట్టిగా చెప్పి పంపించింది.

story2

ఇకనేం ! అతను ఆ టోపీ పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. రాజభవనం కనుక భోజనానికి కొరత లేదు, ఎక్కడో ఒక చోట నిద్ర. అయినా కొంతకాలానికి ఎవరో అదృశ్యంగా అక్కడ ఉంటున్నారని చెలికత్తె లు కనిపెట్టి రాజుకు చెప్పారు. రాజుకి ఇది అతనేనేమోనని అనుమానం వచ్చి ” నువ్వెవరో తెలిస్తే కదా, నా కూతురితో పెళ్ళి చేయటానికి ” అని ఆశ పెట్టాడు. అబ్దల్ టోపీ తీసి ప్రత్యక్షమయ్యాడు. రాజు ” నువ్వు వెళ్ళినదగ్గర్నుంచీ తప్పు చేశానని నా కూతురు నా మీద కోపంగా ఉంది. నీ కోసం వెతికిస్తూనే ఉన్నాను. రేపే మీ పెళ్ళి ! ‘’ అని నమ్మించాడు . పెద్ద విందు ఏర్పాటు చేశారు. అబ్దల్ భోజనం లో మత్తు మందు కలిపి తినిపించారు.   స్పృహ పోగానే టోపీ తీసేసుకుని సేవకులతో అతన్ని ఊరవతల పడేయించారు. రాజకుమారికి ఇదంతా ఏమాత్రం ఇష్టం లేదు. తనని అబ్దల్ నిజంగా ప్రేమిస్తున్నాడని అర్థమై తనూ అతన్ని ప్రేమించింది. కానీ తండ్రి చేసే పనులని అరికట్టటం ఆమె వల్ల కాలేదు.

మర్నాడు పొద్దున మెలకువ వచ్చిన అబ్దల్ కి అంతా అల్లకల్లోలంగా అనిపించింది. రాజు మాటలు ఎలా నమ్మగలిగాడో తనకే అర్థం కాలేదు. ఇంటికి వెళితే తల్లి ఏమంటుందోననే భయం తో వెళ్ళలేకపోయాడు. వేలికి ఉన్న ఉంగరం అమ్మి కొన్నాళ్ళు గడిపాడు. ఆ డబ్బు ఖర్చయిపోయాక చివరికి వెళ్ళక తప్పలేదు. కొడుకు తెలివి తక్కువ తనానికీ దురదృష్టానికీ ఆమెకి దుఃఖం వచ్చింది. ఇక ఏమన్నా లాభం ఉండదనుకుందో ఏమో, అబ్దల్ ని పెద్దగా కోప్పడలేదు.

నాలుగు రోజులు పోయాక  తనే ఒక కొమ్ము బూరా తెచ్చి ఇచ్చి ” ఇదే మిగిలింది. దీన్నీ పోగొట్టు కున్నావంటే మనం బిచ్చమెత్తుకోవలసి వస్తుంది , మన మొహాన దేవుడు అదే రాస్తే తప్పించలేం. కానీ ప్రయత్నించు ” అని కొడుకుతో అంది.

ఆమె చెప్పినట్లు ఇద్దరూ ఊరి బయటి కొండ మీదికి ఎక్కిన తర్వాత  అబ్దల్ దాన్ని ఊదాడు. జెమాజెట్టీ ల లాంటి సైనికులు  లెక్కలేనంతమంది ఎక్కడినుంచో వచ్చేశారు. ” దొరా ! ఏమి సెలవు ? ” అని అబ్దల్ ను అడిగారు. ప్రస్తుతానికి ఏం అక్కర్లేదని   ఇంకో వైపునుచి  బూరా ఊదితే వాళ్ళు మాయమైపోయారు.

 

” వీళ్ళకి అసాధ్యమైనదేమీ లేదు, నీకు అన్నీ చేసిపెడతారు. ఆ టిఫ్లిస్  నగరాన్ని కూడా  జయించగలరు. ఆ పని చేయి ” అని తల్లి చెప్పి పంపించింది.

అబ్దల్ వెళ్ళి  టిఫ్లిస్ నగరం బయట కొమ్ము బూరా ఊదాడు. సైనికులకి  నగరాన్ని  ముట్టడించమని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే జరిగింది. నగరం లో ప్రజలు భయపడిపోయి రాజుకి మొర పెట్టుకున్నారు. రాజు దూతలని పంపి ఏం కావాలని అడిగించాడు.

” యుద్ధం ! యుద్ధానికి వచ్చాను ” అని గర్జించాడు అబ్దల్.

రాజు అక్కడికి  వెళ్ళి  ” ఇదిగో ! ఇప్పుడే నా కూతుర్ని తీసుకుపోయి పెళ్ళి చేసుకో ” అని ఆమెని అక్కడికి రప్పించాడు. అబ్దల్ రెండో వైపునుంచి ఊది సైన్యాన్ని పంపించేశాడు. బూరా జేబులోనే పెట్టుకున్నాడు. అయితే పెళ్ళి కోసమని స్నానం చేసేందుకు దుస్తులు పక్కన పెట్టవలసి వచ్చింది. అతన్ని రహస్యంగా వెంబడిస్తున్న రాజు గూఢచారి చటుక్కున దాన్ని దొంగిలించి రాజుకి తెచ్చి ఇచ్చాడు. తర్వాతి కథ మామూలే. ఈ సారీ ఓడిపోయిన అబ్దల్ కి ఇంటికి వెళ్ళబుద్ధి పుట్టలేదు. తండ్రి దాచిఉంచినవన్నీ అయిపోయాయి. తల్లికి మొహం చూపించలేడు.

 

అక్కడికి దగ్గరలో సముద్రపు రేవు ఉంది. ఒక ఓడ దూరదేశాలకి బయలుదేరబోతూ ఉంది. అబ్దల్ అందులో పనివాడుగా చేరాడు. ఓడ ప్రయాణిస్తూ ఉండగా తుఫాన్ లో చిక్కుకుని  ముక్కలైపోయింది. అదృష్టవశాత్తూ అబ్దల్ కి ఏమీ కాలేదు. ఈదుకుంటూ  ఒక ఒడ్డుకి చెరాడు. అదొక దీవి. మనుషులెవరూ లేరుగానీ పుష్కలంగా పళ్ళ చెట్లు ఉన్నాయి. వాటితో ఆకలి తీర్చుకుంటూ కొంతకాలం గడిపాడు. ఒక రోజున రెండు ఆపిల్ చెట్లు పక్కపక్కనే కనిపించాయి. ఒక చెట్టు పండు కోసి తిన్నాడు. కాసేపటికి గాడిదగా మారిపోయాడు. ” ఓహో, నా దురదృష్టం ఇంకా పూర్తి కాలేదన్నమాట ” అన్న దిగులు లో మునిగిపోయాడు. కడుపునింపుకోవటం తప్పదు కనుక గడ్డి మేస్తూ బతకవలసి వచ్చింది. అలా ఇంకొక రోజున  అక్కడే రాలిపడిన ఇంకొక ఆపిల్ తిన్నాడు. మళ్ళీ మనిషి రూపం వచ్చేసింది.

” ఎందుకైనా పనికొస్తాయి ” అనుకుని రెండు రకాల పళ్ళూ కోసి విడి విడిగా దాచిపెట్టాడు. చివరికి ఒకనాడు దూరంగా ఒక ఓడ వెళుతూ కనిపించింది. అబ్దల్ చేతులు ఊపుతూ అరుస్తూ , ఆ ఓడలో వాళ్ళకి తను అక్కడ ఉన్నానని తెలిసేలా చేశాడు. ఓడ అక్కడికి వచ్చి అతన్ని ఎక్కించుకుంది. నావికులు అబ్దల్ కథ  విని జాలిపడి అతను కోరినట్లుగా  టిఫ్లిస్ నగరపు రేవు లో దించారు.

 

పళ్ళు అమ్మేవాడిలాగా మారువేషం వేసుకుని రాజభవనం దగ్గరికి వెళ్ళాడు. రాజకుమారి అతని దగ్గర మొదటి రకం ఆపిల్ పళ్ళు కొంది. ఆమె తినేలోపునే అతను తప్పించుకున్నాడు. తిన్నవెంటనే  వెంటనే జగదేకసుందరి కాస్తా గాడిదగా మారిపోయింది. అంతా గగ్గోలు పెట్టారు.

రాజు ఎంత చెడ్డవాడైనా కూతురి మీద అతనికి చాలా మమకారం. ఎక్కడెక్కడి వైద్యులనీ మంత్రగాళ్ళనీ పిలిపించి ఆమెని మామూలుగా చేయించటానికి ప్రయత్నించాడు. ఎవరూ చేయలేకపోయారు. రాజుకి ఆందోళన ఎక్కువైపోయింది. ఆఖర్న వైద్యుడి వేషం వేసుకుని అబ్దల్ వెళ్ళాడు.

 

” నేను మీ అమ్మాయిని ఎప్పటిలాగా చేయగలను. అయితే రెండు షరతులు. మొదటిది ఆమెని నాకిచ్చి పెళ్ళి చేయాలి. రెండోది నేను అడిగిన వస్తువులన్నీ నాకు ఇచ్చేయాలి, అవి మీ దగ్గర ఉన్నవే ”

 

నగరం లో పెద్ద మనుషులని పిలిపించి ముందే ఒప్పందం రాసుకున్నారు.

story3

 

” ముందుగా కపన్ నగరం వర్తకులనుంచి మీరు తీసుకున్న ఎనభై ఒంటెల మీది సరుకులు. తర్వాత  యెరెవాన్ యువకుడి నుంచి దొంగిలించిన డబ్బు సంచీ, టోపీ, కొమ్ము బూరా. ఇంకా అతని ఆస్తి- నలభై ఒంటెల మీది సరుకులు ”

 

రాజుకి అవన్నీ ఇచ్చేయటానికి ఎంతమాత్రం మనసొప్పలేదు. కానీ తప్పలేదు. తన కూతురు మనిషిగా మారాక మాత్రమే అవన్నీ ఇస్తానని ఒప్పుకున్నాడు. అన్నిటినీ తెప్పించి ఉంచమన్నాడు అబ్దల్.

 

రెండో రకం ఆపిల్ తినగానే రాజకుమారి మనిషిగా అయిపోయింది.

” నన్ను పెళ్ళాడటం నీకిష్టమేనా ? ” అని అసలు రూపం తో కనబడి అడిగాడు అబ్దల్. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. రాజు తెప్పించి ఉంచినవన్నీ అప్పటికప్పుడు తీసేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా యెరెవాన్ కి బయల్దేరి వెళ్ళాడు.గొప్ప వైభవం తో ఇంటికి వెళ్ళి

 

” అమ్మా ! పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించాను. అదనంగా ఈమెని నీ కోడలిగా తెచ్చాను ” అని తల్లికి అన్నీ చూపించాడు. ఆమె అప్పటికే అబ్దల్ మళ్ళీ ఓడిపోయి ఉంటాడనీ ఇక తనకి కనబడడనీ నిరాశ చేసుకుంది. ఇప్పుడు ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కబురు చేసి వర్తకులిద్దరినీ పిలిపించి అబ్దల్ వాళ్ళ ఆస్తిని వాళ్ళకి అప్పగించాడు. అంతా విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. త్వరలోనే అబ్దల్ కీ జగదేకసుందరికీ పెళ్ళి జరిగింది. వాళ్ళు చాలాకాలం సుఖంగా జీవించారు.

రాజకుమారి ఎప్పుడైనా తండ్రిని చూసేందుకు టిఫ్లిస్ నగరానికి వెళ్ళేది కానీ అబ్దల్ మళ్ళీ అక్కడ అడుగు పెట్టలేదు.

  • ఆర్మీనియన్ జానపదకథ

[టర్కిష్  లో అబ్దల్ అంటే నిర్లక్ష్యంగా ఉండేవాడు అని అర్థం. ఈ మాటను అరబిక్ లో సాధువులకి కూడా ఉపయోగిస్తారు]

Download PDF

10 Comments

  • చక్కగా ఉంది కథ, చిన్నప్పుడు చందమామ లో చదివిన కథల్లాగే ఉంది. అందరినీ ఆకట్టుకునే కథనం తో రక్తి కట్టించారు మైథిలీ!

  • Rekha Jyothi says:

    ‘అయ్యో’ , అని తల్లి మాట వినని వాని మీద చాలా జాలి కలిగింది. పదే పదే ఒకే బలహీనత వెంట పరుగు పెట్టే కొడుకు పాత్ర ని పూర్తిగా మన నేటివిటీ లో చాలా బాగా చెప్పారు Mam., ముగింపు లోఅల్లుడు కూడా మన చుట్టూ పక్కల చూసే వారికి దగ్గరగానే ఉన్నాడు :) . Its Wonderfully scripted Mam.

  • y.padmaja says:

    ఏది చెయ్య వద్దని అంటామో దానిమీదకే మనస్సు లాగుతుంది అనటానికి ఈ కథ ఒక చక్కని ఉదాహరణ.ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం తల్లి మనస్సుది.కథ కాబట్టి సుఖాంతం అయింది. చాలా బావుంది. టర్కిష్ లో అబ్దల్ అంటే నిర్లక్ష్యంగా ఉండేవాడు అని అర్థం. ఈ మాటను అరబిక్ లో సాధువులకి కూడా ఉపయోగిస్తారు అనే కొత్త పదాన్ని తెలుసు కొన్నాము .

  • Radha says:

    జాగ్రత్త లేని వాడు అని టైటిల్ కదా! కొమ్ము బూరా పోగొట్టుకోగానే ఏడుస్తూ ఉండిపోయాడు అంటారేమోననుకున్నాను థాంక్ గాడ్ ఆపిల్ పళ్ళు దొరికాయి…. చాలా బావుందండి మైథిలి గారూ

  • krishna prasad says:

    చాలా బాగుంది సార్ మీరు పరిచయం చేసిన ఈ ఆర్మేనియన్ జానపద గాధ . పరిచయం చేసిన మీకు అభినందనలు , కృతజ్ఞతలు .
    ఇది కాస్త సరి చేయండి .

    ” అందుకని తండ్రి తనకు ఇచ్చిన తాళం చెవితో ఆ రహస్యపు గది తలుపు తెరిచి ఒక చిన్న సంచీని పట్టుకొచ్చింది.”
    ” భర్త తనకు ఇచ్చిన “అని వుండాలి .

  • Mythili Abbaraju says:

    నిజమేనండి , సవరిస్తాను. ధన్యవాదాలు. నేను ‘ సర్ ‘ ని కాదండీ :)

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)