మంచివాడు

bhuvanachandra (5)“పిల్లలకి కడుపు నిండా ఒక్క పూటైనా తిండి పెట్టలేకపోతున్నా, రోజూ ఇలా పీకల్దాక తాగిరావడంలో అర్ధమేంటి?” కోపంగా అరిచింది అనసూయ. ఆమెకి పాతికేళ్లు. ఐదేళ్ల ‘రవీ ఒకడూ, మూడేళ్ల ‘మాధవి ‘ ఒకత్తీ. వయసు పాతికైనా ముప్పైదాటిన దానిలాగా కనపడుతోంది.

ఇంటర్ చదివేటప్పుడు ఆమె ఆ విద్యాలయానికే బ్యూటీ క్వీన్. ఒకప్పటి సినీ నటి ‘ బబిత ‘ లాగా బబ్లీ గా ఉండేది. ప్రస్తుతం పీకల దాకా తాగొచ్చిన ఆది ఆమె భర్త. పూర్తి పేరు ఆదినారాయణరావు. పెళ్ళైనప్పుడు అతను అసిస్టెంటు డైరెక్టర్. చాలా హాండ్సమ్ గా వుండేవాడు. బి.ఏ. చదివాడు. ముత్యాలలాంటి హాండ్ రైటింగ్.

ఇప్పుడు అతను అసోషియేషన్ డైరెక్టర్, అతనితో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ‘ గో….ప్ప.. ‘డైరెక్టర్లు అయ్యిపోయినా అతను మాత్రం అక్కడే ఉండిపోయాడు. కారణం ‘అన్ని పనులు పర్ఫెక్ట్ గా తెలిసి ఉండట’మే.

ఏదీ రాని వాడైనా ‘షో ‘ చేయడం చేతనైతే చాలు ఇక్కడ ఎవడినో ఒకడిని పట్టుకొనో, బురిడీ కొట్టించో డైరెక్టర్ అయ్యిపోతాడు. ఆ పైన అతని అదృష్టం. వచ్చిన చిక్కంతా అన్నీ పర్ఫెక్ట్ గా తెలిసిన చాదస్తులతోటే. వీళ్ళ కింద పని చేస్తూ ‘ పని ‘ నేర్చుకొంటున్న వాళ్లు కూడా డైరెక్టర్ అవ్వగానే వీళ్ళని దూరం పెడతారు. కారణాలు.. 1. ఇంఫిరియారిటీ కాంప్లెక్స్… 2. తమకి పని రాదని ఇతనికి వచ్చునని ప్రొడ్యూసర్ కి తెలిస్తే తమ ‘కార్డు’ కట్ అవుతుందన్న భయం.

మిగతావాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఆది పద్ధతి వేరు. చాలా మొహమాటస్తుడు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు మెలిగే రకం. అన్నిటికంటే విచిత్రమేమిటంటే తన క్రిందివాళ్ళని కూడా తనతో సమానంగా చూసుకోవడం, గౌరవించడం. మిగతావాళ్ళు 4వ అసిస్టెంటునీ, 3వ అసిస్టెంటునీ ‘ ల ‘ కార ప్రయోగాల్తో పిలుస్తున్నా , ఆది మాత్రం ‘ఇదిగో మోహన్రావు గారు’, ‘హల్లో శ్రీనుగారూ అని సమర్యాదగా సంభోదిస్తాడు.

ప్రస్తుతం అతను పని చేస్తున్నది డైరెక్టర్ దిలీప్ దగ్గర. సదరు దిలీప్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆదరించి రూం లో చోటిచ్చింది ఆదీ నే. అయితే ఆ విషయాన్ని ఆది ఎవరితోనూ చెప్పడు… దిలీప్ అయితే అసలు తలవనే తలవడు సరి కదా తనే ‘ఆది’ ని అసోషియేట్ గా పెట్టుకొని ఎదో ‘మెహర్బానీ ‘ చేస్తునట్టు ప్రవర్తిస్తాడు. తెలిసిన వాళ్లు ఆదిని అడిగితే నవ్వేసి, ” దిలీప్ గారు చాలా ఇంటలిజెంట్ డైరెక్టర్ అండి ” అని సింపుల్ గా తప్పుకుపోతాడు.

అనసూయ మాటలు విని ఒక్క నిమిషం సైలెంటయ్యాడు ఆది. తరవాత “అనూ ! నీ దృష్టిలో నేను పీకల్దాకా తాగి వస్తున్నా.. నిజమే తాగాను. ఈ కంపెనీలో చేరిన దగ్గర నుంచి రోజు ఇలా తాగే వస్తున్నా. పిచ్చిదానా.. యీ ఫీల్డ్ సంగతి నీకు తెలియదు. యీ సినిమా పరిశ్రమ ఒక గొ…ప్ప తెల్ల ఏనుగే! కానీ ఏం చేస్తాం కొందరున్నారు.. యీ తెల్ల ఏనుగుమీద నల్ల రంగు పూయటానికి .. సారీ నువ్వు అమాయకురాలివి. యూ డోంట్ నో ఎనీ థింగ్ మై డియర్ అను!” అని ఆ చి…న్న రెండు గదుల ఇంటి వరండాలో మడతమంచం మీద వాలిపోయాడు. “ఏంటో..” నిస్సహాయతతో నిట్టూర్చింది అనసూయ.

“రెండో షెడ్యూల్ ఎల్లుండి కదా మొదలయ్యేది? అనుకున్నట్టుగా షెడ్యూల్ మొదలయ్యే రోజునే డబ్బు నాకు అంది తీరాలని మీ ప్రొడ్యూసర్ కి చెప్పు ఆదీ! ” విజయా స్టూడియోస్ దగ్గర కారాపి అన్నాడు అన్వేష్…

అన్వేష్ టాప్ 4 హీరోస్ లో ఒకడు. రెమ్యునరేషన్ కోటి మీదే. ఒకప్పుడు అతనూ, ఆదిని వేషం కోసం అప్రోచ్ అయినవాడే. చిన్న చిన్న వేషాలు చేస్తూ అదృష్టవశాత్తు ఓ బడ్జెట్ సినిమాలో హీరోగా అవకాశం సంపాదించుకున్నాడు. ఆ పిక్చర్ సూపర్ హిట్ అయ్యింది. అన్వేష్ దశ కూడా తిరిగింది. ” అలాగే సార్ ” అన్నాడు ఆది వినయంగా

“గుడ్ నైట్ దెన్ ” లగ్జరీ కార్ లో తుర్రుమన్నాడు అన్వేష్…

నడుస్తున్నాడు ఆది.. రాత్రి అనసూయ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ప్రొడ్యూసర్ తో ఏమైనా సరే ఈ రోజు మాట్లాడి తీరాలి అనుకున్నాడు. “స్కూటీ” పొద్దున్నే “పియగ్జీ” ఆటోమొబైల్స్ లో అమ్మేశాడు. ఎంతొస్తుంది..! మూడువేల ఐదొందలు ఇచ్చాడు ఆ అరవ మెకానిక్. రన్నింగ్ కండీషన్ లో ఉన్నది , మైలేజ్ బాగా ఇస్తోంది గనక, ఐదువేలన్నా ఇవ్వచ్చు! కానీ అందరికీ “న్యాయం” కంటే లాభం మీదే మోజు.

“ఏంటి గురూజీ నడచి వెళ్తున్నారు? మీ ఐరావతాన్ని తేలేదా?”నవ్వుతూ అడిగాడు అరుల్ దాస్.

దాస్ తెలుగొచ్చిన తమిళ్ అసిస్టెంట్ కెమెరామాన్. మాంచి నేర్పు ఉన్నవాడు.

“నడక మంచిదంటారుగా అరుళన్న.. అందుకే నడుస్తున్నా” సమాధానం చెప్పి నడక సాగించాడు ఆది. ‘రామ్’ టాకీస్ దగ్గర దాటేటప్పటికి “ఛాలి” వచ్చింది. ఆది వయస్సు ముప్పై అయిదు. అను కంటే పదేళ్లు పెద్ద.

“ఈ ఇండస్ట్రీ మనుషులను నడవనివ్వదు ” తనలో తాను అనుకొన్నాడు ఆది. అవును.. తెలిసిన వాళ్లు ఎవరు కార్లలో వస్తున్నా ఆపి మరీ ఎక్కించుకుంటారు. ప్రొడక్షన్ లో ఉన్నన్నాళ్ళూ కార్లు కను సైగల్లోనే ఉంటాయి. మళ్ళీ నవ్వొచ్చింది. “ఏమంది… పీకల్దాకా తాగి వస్తున్నానని కదూ? “అనుకొన్నాడు ఆది. తాగడం కాదు మెక్కడం కూడా ఇక్కడ సహజమే. కానీ తను తినలేదు.

సినిమా ప్రొడక్షన్ జరిగేటప్పుడు అందరికీ ఇడ్లీ, వడ, గారే, పొంగల్, దోసె, పూరీ రెండు మూడు రకాల చెట్నీలతో, సాంబార్ తో దొరుకుతాయి. తిన్నంత తినొచ్చు ( అంటే కావల్సినంత అన్నమాట). మద్యాహ్నం లంచ్ అయితే ఐదారు కూరలు, పచ్చళ్లు, సాంబార్, రసం, పెరుగు + నాన్ వెజ్ ఐటమ్స్ తో సహా వడ్డించబడతై.

మిగతా ఖర్చులతో చూసుకుంటే ఇంత భారీ తిండికి ఖర్చయ్యేది సముద్రములో నీటి బిందువే.. ఇక హీరో హీరోయిన్లకీ ముఖ్యమైన ఆర్టిష్టులకీ గ్రేడ్ వన్ టిక్నీషియన్లకి వాళ్ళు ‘కోరుకున్న’ చోటి నుంచే టిఫిన్లు వస్తాయి.

ఏవో కొన్ని పద్ధతులని పకడ్బందీగా పాటించే కంపెనీలు తప్ప కొత్తగా పుట్టిన, పుట్టుకొస్తున్న అన్నీ సినిమా కంపెనీలలోనూ సాయంత్రం అయ్యేసరికి మందు గ్లాసుల గలగల వినిపించాల్సిందే.

ఆ గలగలలకి మూల కారణం హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎవరేనా కావచ్చు.

“కొంచం రిలాక్స్ అవుదామా?”అనంటే చాలు అర్జంటుగా ఏర్పాట్లు జరిగిపోతాయి. ఒక్కో ‘సీసా’ ఖరీదు ఐదువేలకి పైనేగానీ తక్కువుండదు. అన్నీ ఫారెన్ బ్రాండ్సే. ఫారిన్ సిగరెట్ పాకెట్లే.

మొన్నటిదాకా రైల్వేషేషన్లో పంపునీళ్లు పట్టుకు తాగినవాడు కూడా ఇక్కడ కాస్త పేరు తెచ్చుకోగానే “బిస్లరీ’ వాడికో ‘కిన్లే’ వాడికో పరమ భక్తుడైపోతాడు. (అన్నట్లు గొప్పవాళ్లు ‘పోయేటప్పుడు ‘ తులసి తీర్ధం కూడా బిస్లరితోటే కలుపుతారు మరి).

‘నిన్న ఏం జరిగింది?’ ఆలోచిస్తున్నాడు ఆది.

” ఆదీ.. ” దిలీప్ గారు ఇవాళ మా ఆఫీస్ లో కూచుందామన్నారు. మన ప్రొడక్షన్ శ్రీనుకి చెప్పి ఏర్పాటు చేయ్.. ! “చెప్పాడు పైడిమర్రి సుభాష్. సుభాష్ రాకేష్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్. దిలీప్ ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్నది పేరు ఇంకా పెట్టని సుభాష్ సినిమానే. ఆది పని చేస్తున్నది అందులోనే.

“అలాగే సార్.. మాలికేష్? ” సందేహిస్తూ అన్నాడు ఆది.

“మూర్తిరాజుగారికి ఫోన్ చేసి చెప్పు ” ఏ.సి. రూం లోకి పోతూ అన్నాడు సుభాష్.

మూర్తిరాజుగారు చాలా సినీయర్ ప్రొడక్షన్ మేనేజర్. లెక్కలంతా ఆయనే చూసుకుంటారు. ఆయనంటే అందరికీ గౌరవమే. కష్టం సుఖం ఎరిగిన వ్యక్తి.

“రాజుగారు! పార్టికి ఏర్పాటు చేయమని సుభాష్ గారు చెప్పారండి. అలాగే గత మూడు నెలలుగా నా జీతం కూడా పెండింగ్ లో ఉందండి. మీరేదైనా సాయం… ” ఇబ్బందిగా అడిగాడు ఆది.

“ఆదీ! గట్టిగా అడగాలయ్యా.. అడగకపోతే అమ్మయినా పెట్టదు. సుభాష్ గురించి నీకు తెలియంది ఏముంది? నేను అక్కడకి వస్తాలే. ఆయన ముందే ఒక్క మాటు నీ జీతం గురించి నాతో చెప్పు. వెంటనే ఏర్పాటు చేస్తా..” హామీ ఇచ్చారు మూర్తిరాజు గారు.

“అలాగేనండి ” నిట్టూర్చాడు ఆది. సుభాష్ ఎంత ఖిలాడీగాడో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.

మొదట ఒక ఆఫీస్ లో బాయ్ గా చేరి , మెల్లగా లోకాన్ని అర్ధం చేసుకొని, ఎవర్ని ఎలా పట్టాలో స్పెషలైజ్ చేసి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అడుగెట్టి, కొందర్ని ముంచి, మరి కొందరిని తేల్చి ప్రొడ్యూసర్ అయ్యాడు. ఏ కంపెనీలో బాయ్ గా జేరాడో ప్రస్తుతం ఆ కంపనీ ఉండే చోటే తన ప్రొడక్షన్ కంపెనీ పెట్టి అంచెలంచెలుగా “టాప్” త్రీ ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకరిగా ఎదిగాడు. అతను అనేది ఒకటే…

“సిగ్గు శరం, మానం మర్యాదాలాంటి చెత్తని పోగేసుకుంటావో నీ యిష్టం.   కావల్సినంత పోగేసుకో.. కానీ జన్మలో ఎదగలేవని మాత్రం గుర్తుంచుకో. ” (రెండో పెగ్గు దాటాక మాత్రమే ఈ డైలాగు వస్తుందని మనవి.)

 1. ఎగ్గొట్టడం ‘మన’ జన్మ హక్కు. ఎదుటివాడు ఎదవ గనకనే ఎగ్గొట్టించుకుంటున్నాడు. ” (4వ పెగ్గులోనీ సినీ గీతా సారం).

ఈ స్టేజికి రాడానికి అతను ఎన్ని ‘ లంగా ‘ పనులు చేశాడో అందరికీ తెలుసు. అయినా ఏమీ తెలియనట్టే ఉంటారు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ‘సక్సెస్ ‘ మాత్రమే.

మద్రాసులో పోష్ లొకాలిటీలో మూడు బ్రహ్మాండమైన పైవ్ స్టార్ విల్లాలున్నాయి. ప్రస్తుతం పరిశ్రమని శాసించే వాళ్ళల్లో “సుభాష్ ” ఒకడు. చదువుకీ, సంపాదనకి ఏ మాత్రం సంబంధం లేదని నిరూపించదలచుకొన్న వాళ్ళకి సుభాష్ ఒక ఉదాహరణ.

పాతిక లక్షల హీరోకి కోటిరూపాయిలిస్తానని అర్జెంట్ గా కాల్ షీట్లు సంపాదించడం దగ్గర నుంచి, హీరోయిన్ లొసుగులు పట్టి, చెప్పింది చేయించుకోవడం వరకు సుభాష్ సాటి మరొకరు లేరు.

ఏ టెక్నీషియనన్నా “చచ్చినట్టు ‘ పని చేస్తాడు. సుభాష్ తో పెట్టుకుంటే ఇండస్ట్రీలో తిప్పలు తప్పవని అందరికీ తెలుసు. అందుకే ఇచ్చినంత పుచ్చుకొని మౌనంగా వెళ్ళిపోతారు. డిమాండ్ లో ఉన్నవారైతే “మీకంటేనా? అయ్యో.. కాల్షీట్లు మొన్ననే ఇచ్చేశా గురూగారు ” అని మేనేజ్ అయిపోతారు.

అయితే ఒక్క విషయం మాత్రం నిజంగా మెచ్చుకోవాలి. లోపల ఏదున్నా, ఎలా ఉన్నా గానీ, బైటకి మాత్రం చల్లగా నవ్వుతూ మంచుపర్వతంలాగా ఉంటాడు. చికాకన్నది కనపడదు.

***

చాలా వరకు సినిమా విందులలో జరిగేది ఒక్కటే… ” ఆత్మస్థుతి- పరనింద “. మందు మాకు (ఫుడ్) ప్రవహిస్తుంటే ‘ మాటలు ‘ వేడి వేడి పకోడీల్లా మనసుని అలరిస్తాయి. జంధ్యాలగారు వీరబూతు, మహాబూతు అని బూతుని వర్గీకరించినట్టు ఇక్కడ పొగడ్తల్లో వర్గీకరణ ఎవరేనా చేస్తే బాగుంటుందనిపిస్తుంది.

తాగని వాళ్ళని మందు పార్టీల్లోకి రానివ్వరు. ఎందుకంటే అక్కడి విషయాలు బయటకు రాకూడదు కదా! ఒక వేళ గనక వస్తే ‘ ఎవడు చేరవేశాడో ‘ తెలియడానికి క్షణం పట్టదు. వాడి బతుకు సమాధే.

ఆ రోజున ఆది తాగక తప్పలేదు. వేయిరూపాయిల పెగ్గు ఖరీదైనా కావల్సినంత పోస్తారు కానీ పది రూపాయిలు ఎడ్వాన్స్ ఇమ్మంటే మాత్రం ఆమడ దూరాన ఉంచుతారు. ఆది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంటద్దె కట్టి రెండు నెలలు, మిగితా విషయాలు ఇంకా అధ్వాన్నం.

డబ్బు అడిగి తీసుకోక తప్పదు. అడగాలంటే లక్షాతొంబై సందేహాలు. అదేమి అడ్వాన్స్ కాదు, రావల్సిన జీతమే. అయినా…

రాత్రి ఒంటి గంట వరకు పార్టీ నిరాఘటంగా జరిగింది. దిలీప్ అప్పుడప్పుడు వీర ప్రేమతో ఆదిని కౌగిలించుకుని, కొత్తలో తాను పొందిన సహాయం గురించి కూడా కన్నీళ్లతో వివరించాడు.

‘ ఊర కుక్క విశ్వాసం కక్క ముక్కతో సరి ‘… నల్ల నీళ్ళ వేదాంతం తెల్లారితో సరి ‘ అన్నట్టు క్షణంలో టాపిక్ మార్చి, ” సుభాషా ! యీడు..అదే యీ ఆదీ గాడికి బుర్రలో గుజ్జు తక్కువ. నేను చూడు వచ్చి మూడేళ్లలో అయిదు పిక్చర్లు చేశాను. మరి యీడు సీనియర్ అసోసియేట్ అంట. అసలేమొచ్చనీ.. హి.. హి.. హి.. ” అని అన్నాడు.

ఆది గుండె మండుతున్నా సైలెంటుగా వుండిపోయాడు. ఏవి మాట్లాడినా జరిగే నష్టం తనకే అని తెలుసు. మూర్తిరాజు ఆ విషయాన్ని గమనించి, ” ఆదిగారు! మీతో కాస్త పని వుంది నాతో వస్తారా? ” అని బయటకు తీసుకెళ్ళారు.” ఆది, ఇదిగో ఐదొందలు, యీ సొమ్ము సుభాష్ ది కాదు, రేపు నేనే ఓ సారి సుభాష్ తో మాట్లాడి మీ జీతం ఇప్పించే ప్రయత్నం చేస్తాను. యీ దగుల్బాజీ గాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలిసిందే కదా! ” అని అనూనయించి పంపాడు.

తిండితిప్పలు వదిలేసి అవమాన భారంతో ఇంటికొస్తే ఏమీ తెలియని అనసూయ అన్న మాట మరో శూలంలా గుండెల్లో దిగింది.

***

ఓ.కే, ఓ.కే.. బండిని అమ్మేస్తే ఏమయ్యింది. నేను నడవగల్ను! మళ్ళీ బడ్డి కొట్టు స్టూల్ మీంచి లేచి నడక మొదలెట్టాడు ఆది. ఇప్పుడు వెళ్ళాల్సింది దిలీప్ ఇంటికి. రెండురోజుల్లో రెండో షెడ్యూలవ్వడం వల్ల బోలెడు పనులున్నాయి. బట్, వాడ్ని ఎలా కలవగలను?” ఆది మనసు భగ్గుమంటూనే ఉంది.

ఆది వెళ్ళేసరికి దిలీప్ భార్య చెప్పింది, ” ఆదిగారు, యీ పైల్సన్నీ మిమల్ని చూసుకోమన్నారండి. ఆయన శుభశ్రీ గారి ఆఫీస్ కి వెళ్ళారు. ఏదో న్యూ స్టోరీ డిష్కషన్ ట. ” అని.

నవ్వుకున్నాడు, దిలీప్ కి తెలుసు రాత్రి తాను ఏం వాగాడో. మొహం చూపించలేక పెళ్ళాంతో అబద్ధం ఆడించి తప్పుకున్నాడు. అసలు విషయమేమిటంటే ఆది లేకపోతే ఆ సినిమా పూర్తి కాదు. పూర్తి ఐనా హిట్ అవ్వద్దు. సొమ్మొకరిది సోకొకరిది లాగా. టాలెంట్ ఒకరిది.. పేరు ఇంకొకరిది.

అవన్నీ మోసుకొంటూ కొడంబాకంలోని ‘మహల్ ‘ కి చేరాడు ఆది. ప్రొడక్షన్ కారు అడగొచ్చు. కానీ ఆది అడగదలచుకోలేదు. ఏదో తెలియని ఊగిసలాట.

“ఇదిగో ” మూడువేల ఐదొందలు అనసూయ చేతిలో పోశాడు ఆది.

“ఎక్కడిది? ” అని అడిగింది అనసూయ…

“స్కూటీ అమ్మేశా..”

” ఏం? జీతాలు రావాలిగా? ”

” ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాదుగా ఠంచనుగా జీతాలివ్వడానికి? ” ఫైల్స్ మడతమంచం మీద పడేసి అన్నాడు ఆది.

” మీకంటే వెనక వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడో డైరెక్టర్ లై….”

“కొంచం ఆపుతావా?” మాట్లాడుతున్న అనసూయని మద్యలో ఆపేశాడు ఆది.

“ఇలా నా నోరు మూయించడం మాత్రం తెలుసు..! విసవిసా లోపలకి వెళ్ళింది.

(సోదరుల్లారా.. ఒక అసోసియేట్ కి ఎంత పని ఉంటుందో.. ఎంత గమనించాల్సి ఉంటుందో పూర్తిగా వివరించాలంటే ఒక నవలే రాయాల్సి వస్తుంది. అందుకే దాని జోలికి పోవట్లే…కానీ ‘ఆది’నీ, ఆది లాంటి అసోసియేట్ ని చూస్తుంటే ఎవరి గుండైనా చెరువుగా మారి తీరుతుంది. )

ఆది సీరియస్ గా పనిలో పడ్డాడు. రాత్రి నుంచి ఏమీ తినలేదు. కట్టుకున్న భార్య కూడా ఆ విషయాన్ని గమనించకుండా మాట్లాడటంతో ఆది గుండె మరోసారి పగులిచ్చింది.

” సార్ అన్వేష్ గారు రెమ్యునరేషన్ గురించి గుర్తు చేశారండీ! ” సాయంత్రం సుభాష్ తో అన్నాడు ఆది.

“ఓహ్.. రేపే పంపిద్దాం..! అన్నట్లు ఆది.. నీకూ జీతం ఇవ్వాలిగా, ప్రస్తుతానికి మూడు వేలు నేనిమ్మనానని మూర్తిరాజు గారిని అడిగి తీసుకో.. తక్కువేననుకో… కానీ కొంచం అడ్జస్ట్ కాక తప్పదు. బయ్యర్ల నుంచి రావల్సింది రాలేదు. వచ్చాక రెమ్యునరేషన్ తో పాటు గిఫ్ట్ కూడా ఇస్తా! ” ఆది భుజం తట్టి వెళ్ళిపోయాడు సుభాష్.

“అబద్ధం ” మనసులోనే అరిచాడు ఆది. ‘ కోటి రూపాయిలు ఈజీగా ‘సూట్ కేస్ ‘ లో పెట్టి అన్వేష్ కి పళ్ళికిలిస్తూ అందించడానికి ‘రెడి గా’ ఉన్న సుభాష్ కి పదిహేను వేలో లెక్కా? అంతా పచ్చి అబద్ధం..’గట్టిగా అరవాలనిపించినా సైలెంటైపోయాడు ఆది. జనాల దృష్టిలో సినిమా వాళ్ళంటే కోటీశ్వరుల కిందే లెక్క. ఎన్.ఆర్.ఐ. లని సినిమా వాళ్లని అపార్ధం చేసుకొన్నంతగా బహుశా మరెవరినీ అంతగా అపార్ధం చేసుకోరు ప్రజలు.

ఎన్. ఆర్. ఐ. అనగానే అందునా అమెరికాలో ఉంటున్నాడు అనగానే వాడు కోటానుకోటీశ్వరుడి కిందే లెక్క. ఎంత ‘ కడుపు కట్టుకొని ‘ ఇండియా వచ్చేటప్పుడు జనాలు ‘కోరినవి ‘ తీసుకొస్తారో, తిరిగి వెళ్ళేటప్పుడు క్రెడిట్ కార్డ్ ని కరిగిస్తూ ఎంత క్షోభ పడతారో ఎవరికి తెలుసు? డాలర్లని రూపాయిల్లోకి తర్జుమా చేసుకొని ఇక్కడ ఊహల్లో తేల్తారే కానీ, అక్కడి పరిస్తితుల్ని ఎవరూ అంచనా వేయరుగా.

సినిమా స్క్రీన్ మీద ఫలానా ‘ఆదినారాయణ ‘ అసోసియేట్ డైరెక్టర్ అన్న పేరు కనపడగానే చుట్టాలు పక్కాలు మరీ పొంగిపోతారు. అయితే అసలు సంగతి తెలిసిందెవరికి?

సినిమా నిర్మాణం భయంకరమైన వేగంతో సాగుతోంది. ఆదికి క్షణం తీరిక లేదు. సుభాష్ ఇచ్చిన మూడు వేలు, బండి అమ్మిన తాలూకా ముడున్నర వేలతో బండి ఓ మాదిరిగా నడుస్తోంది. అనసూయలో అసంతృప్తి కూడా రగులుతూనే ఉంది.

మొత్తం ‘ రష్ ‘ చూసేశారు. దిగుల్లేవు. సినిమా సూపర్ హిట్ కాక తప్పదని ‘ సినీపండితులు ‘ తేల్చారు. ( ఆ చెప్పిన వాళ్ళల్లో చూసిన వాడు ఎవడూ లేడూ).

మళ్ళీ దిలీప్ ఆనందంగా ‘ పార్టీ ‘ కి కాల్ ఫర్ చేశాడు. మూడు నెలలు గడిచాయి… పూర్తి కావడానికి. అంటే గత మూడు నెలలుగా ఆది కి పైసా కూడా ముట్టలేదు. ఆదికే కాదు చాలా మందికి. బొంబై హీరోయిన్ సూట్ కేస్ లో డబ్బుల కట్టలు సర్దుకొని సుభాష్ కి షేక్ హాండ్ ఇస్తే , 100 % టాలెంటున్న తెలుగు సెకండ్ హీరోయిన్ కి ఖాళీ చెయ్యి చూపించాడు సుభాష్. ఆ అమ్మాయి గొప్ప నటే కాదు, చాలా మంచిది కూడా. ఆ అమ్మాయిని అన్యాయం చేయడం ఆదికి అస్సలు నచ్చలా. కానీ మాట్లాడటానికి ఏముంది?

” ఆదీ! ఇది మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి స్పెషల్ ” నవ్వుతూ ‘ షీవాస్ రీగల్ ‘ ఓపన్ చేస్తూ అన్నాడు సుభాష్.

” అవును సుభాష్.. మై బాయిస్ హాడ్ డన్ ఏ వండర్ ఫుల్ జాబ్. ” సిప్ చేస్తూ అన్నాడు దిలీప్.

9:30 కి రెండో పెగ్గు పూర్తి. 4th అసిస్టెంట్ నందు. కుర్రాడికి మందు కొట్టడం కొత్త. అప్పటికే ఆది చెప్పాడు “నందూ! తాగినట్టు కనపడు. ఒక్క పెగ్గుకి మించద్దు. తాగాక ఒక్క మాట కూడా మాట్లాడకు. కేవలం చూస్తూ కూర్చో. బూతులు తిట్టినా నోరెత్తకు ” అని.

“ఈ సినిమా తరవాత నువ్వే అడిగినా, రేటు పెంచేస్తా, సుభాష్… హి..హి..హి.. ఇప్పుడే నీకు చాన్స్! ” నవ్వి ఇంకో సిగరెట్టు ముట్టించాడు దిలీప్.

“టూ హండ్రెడ్ డేస్ ఆడకపోతే చెవులు కోయించుకుంటా ” లౌక్యం తెలిసిన 1st అసిస్టెంట్ బల్లని చిన్నగా సర్ది అన్నాడు.

“ఇప్పుడు హడ్రెడ్ డేస్ ఎక్కడున్నాయి?   నాలుగు వారాలు హౌస్ ఫుల్ నడిస్తే చాలు. రూపాయికి పది రూపాయిల పంట ” అని మూర్తి రాజు గారు అన్నారు.

మొత్తం 500 థియేటర్లు రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నా ” మరో పెగ్గు పోసుకుంటూ అన్నాడు సుభాష్.

“గుడ్ ” దిలీప్ అంటూ వుండగా ‘అన్వేష్ ‘ లోపలకి వచ్చాడు.

“వావ్ ! వాటే సర్ ప్రైజ్ ” లేచి అన్వేష్ ని హగ్ చేసుకుంటూ అన్నాడు దిలీప్.

మరో రౌండ్ దిగ్విజయంగా ముగిసింది. అన్వేష్ లేచాడు.

“థాంక్స్ దిలీప్ .. మంచి పిక్చర్ ఇచ్చావు…

“థాంక్స్ సుభాష్.. మీ కంపెనీలో పని చేయడం ఎప్పుడూ మజానే! ఓ చిన్న సర్ ప్రైజ్.. నేను సొంతంగా పిక్చర్ తీయబోతున్నాను.”

“వావ్.. డైరెక్టర్ ఎవరూ? ” అడిగాడు దిలీప్ ఉత్సాహంగా…

“ఆది ” బయటకు వెళ్తూ అన్నాడు అన్వేష్…

“మై గాడ్… ఓహ్.. కంగ్రాట్స్ ఆది…” దిలీప్, సుభాష్ ఆది చేయ్యి పట్టుకొని ఊపేశారు.

“నీ కోసం మరో రౌండ్.. ” మరో బాటిల్ ఓపెన్ అయ్యింది.

“గురూగారు మీరు గనక డైరెక్టర్ అయితే సినిమా పరిశ్రమకి మంచి రోజులు వచ్చినట్టేనండి..”ఫుల్ మూడ్ లో అన్నాడు నందు…

“అంటే ఇప్పుడు బాడ్ డేస్ నడుస్తున్నాయా? ” సీరియస్ గా అన్నాడు దిలీప్..

“అలా కాదు సార్! ఆది గారి టేస్టే వేరు. గొప్ప రీడర్, గొప్ప థింకరు! ” అడ్మైరింగుగా ఆదిని చూస్తూ అన్నాడు నందు.

“అంటే మిగిలిన వాళ్ళంతా ఎర్రివాళ్ళనా? ” రేయ్ నందు… ఆఫ్ట్రాల్ 4th అసిస్టెంట్ గాడివి. ఇండస్ట్రీ గురించి వాగుతావుట్రా లం… కొడకా… ” సిగరెట్ లైటర్ ని నందు మొహం మీదకి విసిరాడు దిలీప్.

అన్వేష్ “ఆది”ని తన సొంత పిక్చర్ కి డైరెక్టర్ గా చేస్తాననగానే దిలీప్ వళ్ళూ, గుండే సరసరా మండాయి… మండుతూనే ఉన్నాయి.

” బూతులు మాట్లాడతారెందుకండి?.. అసలు ఈ పిక్చర్లో కూడా కట్.. స్టార్ట్ చెప్పడం తప్ప మీరేం చేశారు? అన్నీ చూసుకుంది ఆదిగారే కదా? ” కోపంగా అన్నాడు నందు.

నందువాళ్ళది బాగా కలిగిన కుటుంబం. ఆ కుర్రాడు ఎం. బి.ఏ. చదివాడు.

“నీ యమ్మ.. గెట్ అవుట్.. ” చెయ్యి విసిరాడు దిలీప్.

కరక్ట్ గా ఆ సమయానికి ఆది మద్యకి రావడంతో ఆ దెబ్బ ఆదికి తగిలింది. ఒక్క క్షణం సైలెంట్.

“సుభాష్.. యీ నా కొడుకులిద్దరినీ బయటకు దొబ్బెయ్యమను. నిన్న గాక మొన్న వచ్చిన ఆ నా కొడుక్కి పుర్రెక్కించి మాట్లాడించింది ఆ ఆదిగాడే.. గెట్ అవుట్.. ” . అసలే ఫుల్ మందు, దాంతో అన్వేష్ అనౌన్స్ మెంట్ ఇంకొంత వెర్రెక్కించింది. ఉచ్ఛం నీచం అన్నీ వదిలేసి అరిచాడు దిలీప్.

“రేయ్ నీయబ్బా.. ” లేచాడు నందు. అతన్ని బలవంతంగా రూం బయటకు లాక్కెల్లాడు ఆది. నందూని మరొక ఆఫీస్ కుర్రాడికి అప్పగించి మళ్ళీ లోపలకి వచ్చాడు ఆది.

“ఓ.కే. సార్.. వెళ్ళిపోతాను, ఇప్పటివరకు మీరు నాకు ఇవ్వాల్సిన ముప్పై ఐదు వేలు.. ఇప్పించండి! ” కటువుగా అన్నాడు ఆది.

“నీయయ్యా! పైసా కూడా రాదు.. ఇప్పించను… సుభాషూ.. నువ్వు గనక యీడికి పైసా ఇచ్చినా నేనేం చేస్తానో నాకే తెలియదు! ” ఊగిపోతూ అన్నాడు దిలీప్. అంతేకాదు ” ఆ హీరో నా కొడుకు నిన్ను డైరెక్టర్ గా పెట్టుకుంటానన్నాడుగా.. ఫో.. వాడికే కాదు నీ దిక్కున్న చోట చెప్పుకో ” అరిచాడు దిలీప్.

” ఆదిగారు.. ప్లీజ్.. ” అంటూ ఆదిని బయటకు తీసుకొచ్చారు మూర్తిరాజుగారు. జీవితంలో మళ్ళీ పని చేయకూడదని ఆయన ఇందాకే నిర్ణయించుకున్నాడు.

***

“సారీ ఆది!! కంప్లైంట్ ని ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి పంపించాము. వాళ్ళేం చెపుతారో అదీ వినాలిగా. ” అన్నాడు అసోషియేషన్ సెక్రటరీ.

“సారీ ఆది! యీ పరిస్థితిలో నీ పేరు డైరెక్ట్ గా అనౌన్స్ చెయడమంటే సూసైడ్ చేసుకోవడంలాంటిదే. మరోసారి, అంటే కాస్త పరిస్థితులు చక్కబడ్డాక చూద్దాం ! ” కూర్చోమని కూడా అనకుండా నిలబెట్టి మాట్లాడాడు అన్వేష్.

ఆది నవ్వుకున్నాడు. అన్వేష్ దిలీప్ ని డైరెక్టర్ గానూ, నందుని కో- డైరెక్టర్ గానూ త్వరలో అనౌన్స్ చేయబోతున్నాడని ఆదికి నిన్ననే ఒకరు చెప్పారు. నిషా దిగాక నందూ ప్లేట్ మార్చి ఆది చెడతాగి గొడవ పెట్టుకున్నాడని అసోషియేషన్ లో సాక్ష్యం ఇచ్చాడు. ఫలితం రెండో సినిమాకే కో- డైరెక్టర్.

***

“ఎందుకయ్యా మీలాంటి వాళ్లకి పెళ్ళిళ్ళు? తిండి పెట్టలేని వాళ్లకి పెళ్ళాలు, పిల్లలు ఎందుకు? బతుకు చెడా…” పుట్టింటికి పిల్లల్ని తీసుకుపోతూ అనసూయ అన్న మాట చెవుల్లో మోగుతుండగా మొదటిసారి ‘ జిల్ జిల్ వైన్స్ ‘ లో హాఫ్ బాటిల్ కొన్నాడు ఆది…

***

“అయాం సారీ.. ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. ఆయనకి మేం 35 వేలు ఇవ్వాలి. అంతకి అంతా కలిపి 70 వేలు ఆయన భార్యకి ఇస్తున్నాము. ఆదిలాంటి సిన్సియర్ ఇండస్ట్రీలో మరొకరు లేరు. ప్రెస్ ముందు స్టేట్ మెంట్ ఇచ్చాడు సుభాష్.

నిజంగా చెప్పాలంటే ఈ సినిమా ఇంత గొప్పగా రాడానికి కారణం ఆదినే. గొప్ప జడ్జ్ మెంట్ ఉన్నవాడు. 24 క్రాఫ్టుల్లోనూ అతనికి మంచి అవగాహన ఉంది. అతను అసోషియేట్ గా ఉంటే డైరెక్టర్ కి నిశ్చింత. నాకు కుడి చెయ్యి కోల్పోయినంత బాధగా ఉంది. ” గద్గదంగా   అన్నాడు దిలీప్.

“నాకూ పని నేర్పిన తండ్రి ఆయన ” అని రుమాలుతో కళ్ళు తుడుచుకున్నాడు నందు.

“ఇండస్ట్రీ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది” ఓ ప్రముఖుడు.

“ఆది నాకు మిత్రుడు. అతనితో నేనో సొంత పిక్చర్ తీద్దామనుకొన్నాను. ఇంతలో …” కన్నీరు కార్చాడు అన్వేష్.

ఓ నాలుగు రోజుల పాటు ఏ పేపర్లో, ఛానల్లో చూసినా ‘ఆది ‘ గురించి వార్తలే. ఆది గురించి ప్రశంసలే.

తెల్లవారుఝామునే ఆదిని గుద్దేసి, మరణం ప్రసాదించిన లోకల్ ట్రైన్ మాత్రం నిశ్చింతగా, నిర్విచారంగా తాంబరం నుంచి ఫోర్ట్ దాకా గంట గంటకీ అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ఎప్పుడు కోడంబాకం దగ్గర ఆ ‘ట్రాక్స్ ‘ దాటుతున్నా ‘ ఆది ‘ ముఖమే ఇప్పటికీ నాకు కనిపిస్తుంది.

కాలానికి మనసుతో పనేముంది? అందుకే అది నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది.

P.s :

ఇది కనక నా చేతిలోని కథ అయితే, ఆదిని సూపర్ డైరెక్టర్ ని చేసేవాడిని. అవమానాలకి గురై కూడా అద్భుతమైన ఎత్తుకి ఎదిగిన వాళ్లు ఇప్పుడూ ఇండస్ట్రీలో ఉన్నారు. ‘ఆది ‘ బలహీన మనస్కుడు కాదు. అది ప్రమాదమా? ఆత్మహత్యా? అనేది ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్న ! తెలిసింది ఒక్కడికే.. పై నుండి అన్నీ ఆటలు ఆడుతూ ఆడించే ఆ పరాత్పరుడికే!

 

P.S :

సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పక్కర్లేదుగా!!!

మీ

భువనచంద్ర….

Download PDF

12 Comments

 • venkatesh says:

  సర్ , మీరు రాసిన ఈకథ చాల బావుంది…..మనిషి కంటే..మనీ కి వున్నా వ్లౌఎ ని బాగా చెప్పారు….నైస్ స్టొరీ….

 • Mythili Abbaraju says:

  అయ్యో….ఆ రంగుల ప్రపంచం లోకి , నిజానికీ దయ లేని జీవితమంతట్లోకీ ..ఎన్ని రక్షణ కవచాలు తొడుక్కుని వెళ్ళాలో కదా, ఏమరినామా…ఇంతే.

  • BHUVANACHANDRA says:

   మైధిలి గారూ నమస్తే ఇక్కడ పాము లూ వున్నాయి, నిచ్చెనలూ వున్నాయిండీ . గ్లామర్ ఫీల్డ్ కనక మరికొన్ని తలనెప్పులు ఎక్కువ వుంటాయి……అంతే ..! ఇక ఇక్కడ అందరూ చాలా సెన్సిటివ్ ….ఏ కళారంగంలో ని వారైనా సున్నిత మనస్కులే అనుకోండి .అయితే ,,ఇక్కడ పరిగణింప బడేవి రెండే 1.సక్సెస్ ..2.సక్సెస్ . అది వున్నంతకాలం సర్వం ఓకే ……అది లేకపొతే ఎన్నివున్నా ఏదీ లేనట్టే ….. అందుకే వొచ్చే ముందే ఆలోచించుకోవాలి …
   మీరు ఓపిగ్గా ఈ కధని చదివి రాసిన నాలుగు మాటలూ నాకెంతో వుత్సాహాన్నిచ్చాయి. ధన్యవాదాలతో …భువనచంద్ర

 • ch v prabhakar rao says:

  ఇది జీవితం ఒక సినిమా రంగంలో నే కాదు అన్ని రంగాల్లో కూడా అదే పరిస్తితి కాని సినిమా ప్రపంచంలో జీవితం చిన్నది సినిమాలు తయారైనంత తక్కువ టైం లో ఎ పరిశ్రమ ఎ ఉత్పత్తిని చెయ్యలేదు
  సినిమా రంగానికి ఉన్నా హోదా ఆకర్షణ మరే రంగానికి లేకపోవం కూడా ఒక కారణం.
  సినిమా రంగం తరువాత అంతే జిలుగుల వెలుగుల రంగులు కనబడేది రాజకీయ రంగం లో.

  సినిమా రంగం లో ఆది లాంటి వాళ్ళు లక్షల వేల లలో ఉంటారనడం లో తప్పు లేదు అందులో సృజనాత్మకత ఉన్నవాళ్ళు మరి ఎక్కువగా ఆకర్షణకు గురవుతారు. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అనుకొనే వారు ఎక్కువ తెల్లారే సరికి కొటీస్వరులం కావాలనే ఆశతో కూడా కొందరు జీవితాలను పాడుచేసుకొంటే , మరికొందరు తమలోని భావుకతను తపనను చూపే మార్గం గా సినిమా ప్రపంచం చుట్టు తిరుగుతున్నారు. దీపం చుట్టూ తిరిగే శలభాల్లా.
  ప్రపంచం లో ఏదీ మనం అనుకోన్నాంతా అందం గా లేదు దూరపు కొండలు నునుపు. అంటే. ఎప్పుడు డెబ్బయి లలో చదివిన విశ్వప్రసాద్ గారి నటిమణి (నటి ) నవలలో కూడా అయన ఎలా మోసం చేస్తారో చక్కగా చెపాడు. మీరన్నట్లు ఇందులో ఎ విషయాన్ని ముట్టినా అది నవలకు సరిపడే సామాగ్రిని ఇస్తుంది.
  కళ్ళు చెమర్చే రచన.

  • BHUVANACHANDRA says:

   ధన్యవాదాలు ప్రభాకర్ గారూ ….మీరు చెప్పిన మాట నిజం …..ఆకర్షణ కి లోబడి కొందరొస్తే….తపనతో వొచ్చేవారు ఇంకొందరు ….మీ అభిప్రాయం నాతొ పంచుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు సర్

 • రంగుల ప్రపంచం వెనుక చీకటి కోణం.. ఒక సినిమా చూసేసి బాగుంది లేదా చెత్త అని ఒక్కమాట అనేస్తాం. ఆ రెండున్నర గంటల ప్రేక్షకుల ఆనందం కోసం ఎంత మంది కష్ట పడుతున్నారో.. ఎందరి ఆత్మాభిమానాలు తాకట్టు పెడుతున్నారో, ఆది లాంటి ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో. ఈ గాధలు చదివి కొందరైనా సంబంధిత వ్యక్తులు మారి, సినీబడుగు జీవుల పాట్లు సరైన సమయంలో గమనిస్తే బాగుండును. భువనచంద్ర గారి కష్టానికి ఫలితం దక్కుతుంది.
  ఎప్పటికైనా ఆ వ్యవస్థ అవస్థ మారుతుందంటారా.

  • BHUVANACHANDRA says:

   ధన్యవాదాలు BM జీ ……… ఎప్పుడో తెలీదు గానీ ,మారుతుంది .మారి తీరాలి .మార్పు ఓ సహజమైన ప్రక్రియ …..మీ స్పందన నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది భానుమతి గారూ ….థాంక్స్ ఒన్స్ అగైన్

 • Jagadeeshwar Reddy Gorusu says:

  భువన చంద్ర గారూ … నమస్తే . గతం లో నూ చెప్పాను . ఇప్పుడూ చెబుతున్నా … మీరు తప్ప ఆ రంగుల ప్రపంచం గురించి మరొకరు రాయ లేరండీ . “ఆది” లాంటి వాళ్ళు నాకూ తెలుసు . కనీసం ఆది కి విముక్తి అయినా లభించింది , నాకు తెలిసిన వీళ్ళకు అదీ లేదు . జీవచ్చవాల్లా బతుకులీడుస్తున్నారు. మీ కథలు చదువు తుంటే మిగతా ప్రపంచం అంతా
  ఒక ఎత్తు . మీ రంగుల ప్రపంచం ఒక ఎత్తు అనిపిస్తోంది. మరో విషయం .. మీరు కథని పండు వలిచి పెట్టిన చందంగా ఎంత బాగా , మనసుకు హత్తుకునేలా చెబుతారో – ధన్యవాదాలు

  • BHUVANACHANDRA says:

   Jagadeeshwar Reddy Gorusu గారూ నమస్తే ….నేనెప్పుడూ మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తా ….ఆల్మోస్ట్ నా మొదటి కధనించీ మీ రు ఎంతో ఆత్మీయంగా పలుకరిస్తూ ఎంతో ఉత్సాహాన్నీ స్ఫూర్తి నీ ఇస్తున్నారు .మీకు హృదయపూర్వక ధన్యవాదాలతో ….నమస్సులతో ….భువనచంద్ర

 • buchireddy gangula says:

  గొరుసు గారి కామెంట్ తో ఎకబివిస్తాను —-బాగుంది కథ

  సినిమా వాళ్ళు చెప్పిన ముచ్చట్లు — బండ్ల గణేష్ —గురించి

  ఎలా నిర్మాత గా మారిపోయాడని —-( సు బాస్ — లాగా )

  ————————– బుచ్చి రెడ్డి గంగుల

  • BHUVANACHANDRA says:

   buchireddy gangula గారూ ,నమస్తే మీరు ఎప్పుడూ అభిమానంతో ఇచ్చే అభిప్రాయానికి నా కృతజ్ఞతలు ….పూర్వపు నిర్మాతలూ దర్శకులూ మనిషిని గౌరవంతో మానవత్వంతో చూసేవారండీ …”’మనకోసం స్రమించేవారు తింటున్నారా ,పస్తులుంటున్నారా ””అని గమనించేవారు .అప్పుడు ఈ పరిశ్రమ ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది ….ఇప్పుడు ఇది కేవలం వ్యాపార ధోరణి లో సాగుతోంది ….!మౌనంగా గమనించడం తప్ప ……………………….

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)