బొమ్మా – బొరుసూ

“ఆగవోయ్.. ఇందులో ఎముందీ…!” చిరునవ్వుతో అన్నారు ప్రఫుల్లరావుగారు. ఆయన మాంచి పేరు మోసిన నిర్మాత. ఇప్పటివరకు కనీసం పది సూపర్‌హిట్ సినిమాలు ఆయన ఖాతాలో వున్నాయి. సూపర్‌హిట్ ప్రొడ్యూసరే కాదు. ‘చెక్కులు’ ఇవ్వడంలోనూ ఘనుడే. మాంచి పే మాస్టర్.
‘సునీత్’ ఇండస్ట్రీకి లభించిన ఓ వరం అని చెప్పాలి. బి.ఎ.పాసయ్యాడు. తల్లిదండ్రులు కొడుకుని ‘డాక్టర్’ చెయ్యాలనుకుంటే తను ‘యాక్టర్’ ని మాత్రమే అవుతానని కుండ పగలగొట్టినట్టు చెప్పి, అన్నట్టుగానే యాక్టర్ అయ్యాడు. తండ్రి ఓ చిన్న కంపెనీలో పెద్ద గుమాస్తా. (హెడ్ క్లర్క్). తల్లి గవర్నమెంట్ స్కూల్లో టీచరు. అంతే కాదు మంచి డిజైనర్. ప్లెయిన్ చీరల్ని తీసుకుని రకరకాలుగా వాటి మీద డిజైన్లు కుట్టేది. ఎన్ని రకాల ‘కుట్లు’ వున్నాయో, చీరని ఎన్ని రకాలుగా ఎంత అద్భుతంగా అలంకరించవచ్చో ఆమెకి తెలిసినట్టు బహుశా బాంబే డిజైనర్లకి కూడా తెలీదని ఘంటాపధంగా చెప్పొచ్చు.
ఒక చీర జాకెట్టుకి కనీసం 5 వేలు డిమాండ్ చేసేది. ఒక్కోసారి పదివేలు అన్నా జనాలు ఇచ్చేవారు. కారణం ఆమె పనితనం. ఆవిడ చేతుల్లో ప్రాణం పోసుకున్న చీర కడితే అందం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని జనాల నమ్మకమే కాదు నిజం కూడా.
సునీత్ బాల్యం ‘రిచ్’గానే గడిచింది. కాలేజీలో మరింత ‘జోష్’గా నడిచింది. కారణం తండ్రికి తెలీకుండా కావల్సినంత డబ్బుని వసుమతి (సునీల్ తల్లి) కొడుక్కి ఇవ్వడమే.
సునీల్ ఫ్రెండ్ నిశ్చల్. నిశ్చల్‌ది విజయవాడ. బై బర్త్ అతను గుజరాతీ. అయినా విజయవాడలో వాళ్ల తాతల కాలం నుంచి స్థిరపడటం వల్ల స్వచ్చమైన తెలుగు మాట్లాడతాడు. ఆటొమొబైల్ పార్టుల షాప్ మాత్రమేగాక ‘సూరత్’ నించి సరుకు తెప్పించి, లాభానికి అమ్మే బట్టల షాపులు మూడున్నాయి. ఇక తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చే వడ్డీ షాపులు ఒక్క బెజవాడలోనే కాక గుంటూర్లోనూ, తెనాలిలోనూ కూడా వున్నాయి.
సునీల్, నిశ్చల్ ఇద్దరూ చదివింది ‘N’ కాన్వెంట్‌లో అక్కడ చేరాలంటే డబ్బుతో ‘మదించి’న వాళ్లకి మాత్రమే సాధ్యం. ఇంటర్ అయ్యాక సునీత్ పేరెంట్స్‌తో హైద్రాబాద్ వెళ్లిపోవాల్సి వచ్చింది. కారణం ఓ పే…ద్ధ సినిమా ప్రొడ్యూసర్ వసుమతిని బ్రతిమాలి, బామాలి తన సినిమాకి కాస్ట్యూమ్ ఇన్‌చార్జిగా పెట్టుకోవడమే… ఆ ప్రొడ్యూసర్ కూతురు తండ్రికి వసుమతిని గురించి చెప్పింది. తీసేది హిస్టారికల్ పిక్చర్ కావడమూ, వసుమతి డిజైన్లని చూడటమూ జరిగి, ప్రొడ్యూసర్‌కి సంపూర్ణ నమ్మకం ఏర్పడి, వసుమతి చేత స్కూలుకి లాంగ్ లీవ్( అదీ లాస్ ఆఫ్ పే మీద పెట్టేట్టూ.

జీతానికి మూడు రెట్లు ప్రతి నెల తాను ఇచ్చేట్టు, సినిమా పూర్తయ్యాక పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేట్టు) పెట్టించి మొత్తం ఫేమిలీని హైద్రాబాద్‌కి షిఫ్ట్ చేయించాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. కథ ప్రకారం అద్భుతమైన డిజైన్లని సృష్టించసాగింది వసుమతి.
శేషారావు ఆ కంపెనీకి ప్రొడక్షన్ మేనేజరు. ‘పని’ బాగా తెలిసిన లౌక్యుడు. కంపెనీవరకూ సిన్సియర్‌గా వుంటూనే తన పద్ధతిలో తను ‘డబ్బు’ సంపాయించుకునేవాడు.
కొందరు ‘కార్లు’ కొని సినిమా కంపెనీలకి అద్దెకిస్తారు. శేషారావుకి అదో సోర్స్. అలాగే కొన్ని బట్టల షాపులు, అలంకరణ సామగ్రి దొరికే చోట్లు, మెస్సులూ ఇవన్నీ కూడా శేషారావు చేతులు తడుపుతూనే వుంటాయి.
ప్రొడ్యూసర్‌కి ఇవన్నీ తెలిసినా పట్టించుకోడు. కారణం కొండమీది కోతినైనా క్షణాల్లో తేగలిగిన సమర్ధుడు శేషారావు. అదీగాక, శేషారావు కంపెనీ వరకు నమ్మకస్తుడూ, నిజాయితీపరుడూ.
వసుమతి అంటే శేషారావుకి గిట్టదు. అసలే హిస్టారికల్ సినిమా. అదీ పెద్ద బడ్జెట్‌తో తీస్తున్నది. కాస్ట్యూమ్స్‌కే కొన్ని కోట్లు కేటాయించారు. అదంతా శేషారావు చేతుల్లోంచే వెళ్లాలి. కాని వసుమతి వ్యవహారం అతనికి మింగుడు పడట్లేదు. ఏదున్నా డైరెక్టుగా ప్రొడ్యూసర్, డైరెక్టర్లతో మాట్లాడుతుంది తప్ప ఎవర్నీ లెక్క చెయ్యదు.
రిబ్బన్ ముక్క కావాల్సి వచ్చినా తనంతట తానే వెళ్లి కొనుక్కొస్తుంది తప్ప ఎవరికీ పని చెప్పదు. తెచ్చిన ప్రతీ వస్తువునీ బేరమాడి తేవడమే కాక ఖచ్చితమైన బిల్లుని కూడా తెస్తుంది. అవన్నీ జెరాక్సు తీసి తనో కాపీ వుంచుకుని రెండోది ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి పంపుతుంది. మరి శేషారావుకి గిట్టకపోవడంలో ఆశ్చర్యమేముంది??
వసుమతి పని చేస్తున్న కంపెనీ ప్రొడ్యూసర్ పేరు దేవనారాయణ. వస్తుతః అతను తమిళియన్. నాడార్ల కుటుంబం నుంచి వచ్చిన కోటీశ్వరుడు. హీరో కాదగిన పర్సనాలిటీ వున్నా, రెండు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ప్రొడ్యూసర్‌గా మారాడు. ఇప్పుడతను నిర్మిస్తున్నది ద్విభాషా చిత్రం.
సునీత్ తండ్రి వెంకట్‌రావు హైద్రాబాద్ ఫేమిలీని షిఫ్ట్ చేశాక ఓ రెసిడెన్షియల్ స్కూల్లో అక్కౌంటెంట్‌గా చేరాడు. సునీత్ ఎంత అందంగా ఉంటాడో వెంకట్‌రావు సునీత్ వయసులో అంతకన్నా అందంగా వుండేవాడు. అందుకే వసుమతి గవర్నమెంట్ జాబ్ హోల్డరై కూడా ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్న వెంకట్రావుని ఏరికోరి పెళ్లి చేసుకుంది.
సినీ పరిశ్రమలోవాళ్లకి సెంటిమెంట్లు, నమ్మకాలు(మూఢ) కూడా కాస్త ఎక్కువే. హీరో, హీరోయిన్ల దగ్గర్నించీ క్యారెక్టర్ ఆర్టిస్టులవరకూ షూటింగ్ నించి ఇంటికి రాగానే గుమ్మడికాయతోనో, కొబ్బరికాయతోనో దిష్టి తీయించుకుంటారు. ఇహ నిమ్మకాయల సంగతి అడక్కండి. షూటింగ్‌కి బయల్దేరే ముందరే నాలుగు నిమ్మకాయలు నాలుగు టైర్ల కిందా ఉంచబడతాయి. వాటి మీదనించే కారు వెళ్లాలి. ఇహ విభూతులూ, బొట్లూ, చేతులకి దారాలు, మెడలో నలుపు, ఎరుపు, పసుపు రంగుల దారాలకు వేళ్ళాడే లాకెట్లు, జబ్బలకీ, మొలకీ తాయెత్తులూ చెప్పనక్కర్లేదు.
“హేంగోవర్” ఉన్నా సరే, పూజ చెయ్యకుండా ఏ ప్రొడ్యూసర్ చైర్లో కూర్చోడు. చాలామంది దర్శకులూ వీటికి అతీతులు కారు. కొందరైతే ఎకంగా సినిమా పూర్తయ్యే వరకూ అయ్యప్ప మాలతోనే వుంటారు. ఇంకొందరు స్టోరీ, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ పుణ్యక్షేత్రాల్లోనే పెట్టుకుంటారు. ఇహ రీమేక్ సినిమాలు చేసేవాళ్లది ఇంకా చాదస్తం. జె పి చెట్టి పాలయం ఫలానా తోటలో డ్యుయెట్ తీశారు గనకే ఆ పిక్చర్ సూపర్ హిట్టయిందని తెలిస్తే కథకి సంబంధం వున్నా లేకపోయినా అక్కడికే వెళ్లి డ్యుయెట్ తీస్తారు. ‘నల్లమల’ లోనూ, ‘తలకోన’లోనూ అలా షూటింగ్ జరిపిన సినిమాలు కోకొల్లలు. సినిమా ఫస్టు షాట్స్ అదివరకైతే నాగిరెడ్డిగారి విజయా గార్డెన్స్ ‘విజయ గణపతి’ ముందే తీసేవారు. రికార్డింగు విజయా డీలక్స్ థియేటర్లో జరగాల్సిందే. అలా రికార్డైన నా పాటల సంఖ్య వందల్లో వుంటుంది. ఆ సంగతి అలా వుంచితే…
ఎవరి దిష్టి తగిలిందో గానీ సడన్‌గా హార్ట్ అటాక్‌తో దైవనారాయణగారు దైవసన్నిధికి వెళ్లారు. దండిగా అడ్వాన్సు పుచ్చుకున్న బాపతు గనక హీరో, హీరోయిన్లూ, కాస్త పేరున్న కేరక్టర్ ఆర్టిస్టులూ, మూడొంతులు ముందే గుంజుకున్న ముంబై విలనూ అందరూ బాగానే వున్నారు గానీ, మిగతా చిన్నా చితకా నటీనటులూ, టెక్నీషియన్లు మాత్రం సడన్‌గా రోడ్డున పడ్డారు. వసుమతి అయితే ప్రొడ్యూసర్ ఖచ్చితమైన మనిషి గనక అంతకు వారం రోజుల ముందే స్వంత డబ్బు పెట్టి బోల్డన్ని కాస్ట్యూమ్స్ సిద్ధం చేసింది. ఇప్పుడా డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే… కేవలం నాలుగో వంతు పూర్తయిన పిక్చర్‌ని కంప్లీట్ చేసేదెవరూ? అదీగాక ఆ సినిమా భారీ బడ్జెట్టుది.. ప్రొడ్యూసర్‌కి వున్నది కూతురు మాత్రమే. లక్కీగా ఆ పిల్ల పెళ్ళి విజయవాడలో వున్న ఓ థియేటర్ ఓనర్ కొడుకుతో జరిగింది. ఆ పిల్ల వరకూ సేఫే..
కోట బీటలు వారడం వేరూ, కుప్పకూలి పోవడం వేరూ. దేవనారాయణ కంపెనీ బీటలు వారలేదు. కుప్పకూలి పోయింది.
అడ్వాన్సులిచ్చిన డిస్ట్రిబ్యూటర్లూ, అప్పిచ్చిన ఫైనాన్సరూ మూకుమ్మడిగా ఎగబడి దేవనారాయణ ఇళ్లూ, వాకిళ్లన్నీ వేలం వేయించి జరగాల్సిన తతంగాన్ని శాస్త్రోక్తంగా జరిపేశారు.
పాకలో వుండేవాడు పెంకుటింట్లోకి వెళ్తే అక్కడ ఎడ్జస్టు కావడానికి కొంత సమయం పడుతుంది. పెంకుటింట్లోవాడు మేడలోకి షిఫ్టైనా అదే పరిస్థితి. మేడనించి పేలస్‌లోకి అడుగుపెట్టి అక్కడి సదుపాయాలు అనుభవించేవాడ్ని సడన్‌గా పాకలోకి నెడితే??? వసుమతి పరిస్థితి అదే ప్రస్తుతం.
మళ్లీ స్కూల్లో జాయిన్ అయితే తోటి టీచర్లూ వాళ్లూ హేళన చేస్తారని భయం. పోనీ మరో కంపెనీ చూసుకుందామా ఆంటే శేషారావు పుణ్యమా అని ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర వచ్చింది. ఏం చెయ్యాలీ? భర్త జీతం అప్పుడు సరిపోయిందేమో గానీ ఇప్పుడు చాలదు. సునీత్ డిగ్రీ పూర్తి చెయ్యడం ఒక్కటే ఆమెకి వూరట కలిగించిన విషయం. తలదించుకునే పని ఏమీ చెయ్యకపోయినా వసుమతిది ప్రస్తుతం తలెత్తుకోలేని స్థితి.
‘గవ్వల శర్మ’గారు సినీ సిద్ధాంతి. గవ్వలు విసిరి ఆయన జోస్యం చెబితే అది నిజమై తీరాల్సిందే.. ఫిలిం చాంబర్ పక్కనే వున్న ‘దైవ సన్నిధానం’లో గవ్వల సర్మగారు గవ్వలు విసరబోతుండగా నిశ్చల్‌తో పాటు సన్నిధానంలోకి అడుగుపెట్టాడు సునీత్. గవ్వలు గలగలలాడాయి. ఏ మణిరత్నం సినిమాలోనో అయితే వందో, వెయ్యో పావురాలు రెక్కలల్లారుస్తూ గగన వీధిలోకి ఎగిరిపోయిండేవి. ఇక్కడ అటువంటివి జరగలేదు గానీ గవ్వల శర్మగారి చూపులు మాత్రం అప్రయత్నంగా సునీత్ మీద వాలాయి.
“బాబూ.. ఒకసారి ఇటు వస్తావా…?” తియ్యగా పిలిచారు శర్మగారు.
“నన్నాండీ పిలిచిందీ?” అడిగాడు సునీత్.
“నిన్నే.. నీలో ఓ అపూర్వమైన కాంతి తొణికిసలాడుతోంది. నీ గోత్రం ఏమిటి.. నీ తల్లిదండ్రుల పేర్లూ, వృత్తులూ ఏమిటీ?” ఆదరంగా, ఆప్యాయంగా అడిగారు శర్మగారు.
“అయ్యా.. మిమ్మల్ని సగౌరవంగా కార్లో, అదీ A.C. కార్లో పిలిపించింది నేను. మీరేమో ఎవరో కుర్రాళ్లని పిలిచీ ..” అసహనంగా అన్నాడు గవ్వల శర్మగార్ని రావించిన ప్రొడ్యూసర్ నాగరాజు.
“నాగరాజూ.. నీది ఫస్టు క్లాసు బతుకయ్యా… గవ్వలు విసిరిన క్షణమే మీ హీరో దైవసన్నిధికొచ్చాడు. ఈ కుర్రాడి మొహంలో విజయం వెల్లి వెరుస్తోంది. ఇది నేను చెబుతున్న మాట కాదు. గవ్వల ద్వారా అమ్మవారు పలికిస్తున్న మాట..” అర్ధనిమిలిత నేత్రాలతో అన్నారు గవ్వలశర్మ. ఆయన గవ్వల జోస్యంలో ఉద్ధండుడే కాదూ, దేవీ ఉపాసకుడూ, కర్మిష్టీ.
“ఏమిటీ ఇతనా?” వెనక్కి తిరిగి సునీత్ వంక కూసి అన్నాడు నాగరాజు.
“అవును. ఇతనే.. మాంచి యూత్‌ఫుల్ సబ్జెక్టు తియ్యి. అది సక్సెస్ అయ్యాకే నాకు సంభావన ఇవ్వు..” గవ్వల్ని ఏరి బుల్లి చేతిసంచిలో భద్రపరుస్తూ తృప్తిగా అన్నారు శర్మగారు.
సునీత్‌ని చూసిన మరుక్షణం అదే అభిప్రాయం కలిగింది నాగరాజుకి. రుషీకపూర్ ‘బాబీ’ సినిమాలో ఎలా వున్నాడో అంతకంటే వందరెట్లు అందంగా, తీర్చిదిద్దిన సౌష్టవంతో వున్నాడు సునీత్. అంతేకాదు పక్కన వున్న నిశ్చల్ కూడా మాంచి స్టార్ మెటీరియల్‌గా కనిపించాడు. దైవసన్నిధానంలో జరిగిన సంఘటన గనక ఆరు నూరైనా పిక్చర్ తీసి తీరాలనే నిర్ణయానికి వచ్చాడు నాగరాజు. కొన్ని సినిమాల్ని అంతకుముందు తమిళం, మళయాళం నించి తెలుగులోకి తీసిన అనుభవం అతనికి వుంది. డైరెక్ట్ సినిమా చేస్తే మాత్రం ఇదే మొదటిదౌతుంది.
సునీత్‌కి లక్ష, నిశ్చల్‌కి డెబ్బై అయిదు వేలుగా రెమ్యూనరేషన్ నిర్ణయించి ‘దైవసన్నిధానం’లోనే ఓ మంచిరోజున కాంట్రాక్టు మీద సంతకం చేయించాడు నాగరాజు. సునీత్ ఆనందానికీ, నిశ్చల్ ఆశ్చర్యానికీ అంతులేదు. నిశ్చల్ కలలో కూడా ఊహించలా సినిమా నటుడ్ని అవుతానని. రవికిరణ్ అనే పేరుతో సినిమా ఫీల్డులోకి రచయితగా అడుగు పెడదామని అవిశ్రాంతంగా స్టూడియోల చుట్టూ తిరుగుతున్న రాజారావుకి కథ + మాటల బాధ్యత వొప్పగించాడు నాగరాజు. గత అయిదారేళ్లుగా వాళ్ల దగ్గరా, వీళ్ల దగ్గరా అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తూ తెలివితేటలు ఎన్నున్నా ఎదుగూ బొదుగూ లేని జీవితం గడుపుతున్న ‘సూర్య వంశి’ని డైరెక్టరుగా పెట్టాడు. సినిమా పేరు ‘చిచ్చు’ నిజం చెప్పాలంటే ‘చిచ్చు’ అనేది ఓ టీనేజ్ లవ్ స్టోరీ..
ఏభై యేళ్లు వచ్చినా, మొహం నిండా మేకప్‌తో కాలేజీ కుర్రాడి వేషం వేసి “అమ్మా నేను ఫస్టు క్లాసులో పాసయ్యా” అని సినిమా అమ్మ మక్కెలు విరిగేలా ఎత్తుకు తిప్పే ముసలి హీరోల్ని చూసీ చూసీ విసుగెత్తిన జనాలు ‘చిచ్చు’కి బ్రహ్మరధం పట్టారు. వరదల కురుస్తున్న వసూళ్లతో బాక్సాఫీసు రికార్డులన్నీ ఫెటఫెటా పగిలి, వసూళ్ల వరదకి తుడిచి పెట్టుకుపోయాయి.

‘A Star is born’ అన్న కేప్షన్‌తో పత్రికలు సునీత్‌ని, నిశ్చల్ని ఆకాశానికెత్తాయి..సునీత్ లాంటి అందమైన హీరోగానే గాక, నిశ్చల్‌లాంటి అందమైన ‘విలన్’ని కూడా ఒకేసారి పరిచయం చేసిన ఘనత నాగరాజుకి దక్కింది.

‘సునీత్ మొట్టమొదటిరోజు షూటింగ్ నించీ చివరి రోజు దాకా వసుమతి ఏనాడూ సెట్‌లోకి అడుగుపెట్టలేదు. ‘చిచ్చు’ సూపర్ హిట్ అయ్యాక మాత్రం కొడుక్కి తనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించడం మొదలెట్టడమేగాక, ‘డబ్బు’ విషయాలు కూడా తనే నిర్ణయించడం ప్రారంభించింది. సునీత్ రెండో సినిమా ‘ద్వజం’ చిచ్చు రికార్డుల్ని తిరగరాసి తిరుగులేని యూత్ హీరోగా సునీత్‌ని నిలబెట్టింది. ఆ సినిమాలోనూ విలన్ నిశ్చలే..
మూడో సినిమా ‘తూరుపు ఎరుపెక్కింది’ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శివనారాయణమూర్తి డైరెక్ట్ చేశారు. అదీ పెద్ద హిట్టే..
చిత్రపరిశ్రమలో వున్న చితం ఏమంటే,, మా పిక్చర్ హిట్టై మీ పిక్చర్ ‘కూడా’ హిట్టయితే ఓకె. మా పిక్చర్ ఫ్లాపై మీ పిక్చర్ హిట్టయితే?? నడివయసు దాటిన హీరోల పరిస్థితి దారుణంగా వుంది. కోట్లు కోట్లు ధారఫోసి తీసిన సినిమాలు పెనాల్టీ కిక్ తగిలిన ఫుట్‌బాల్స్‌లా వెనక్కి తిరిగి వస్తున్నాయి. రెమ్యొనరేషన్ తగ్గించడం అంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటిదే..
ప్రేమ గుడ్డిదని కొందరంటే ప్రేమే దైవం అని ఇంకొందరు అంటారు. Love is Blind, Love is God, Love is Mad. Love is Bad, Love is Dumb.. ఇలా లక్షా తొంబై నిర్వచనాలు ప్రేమకి వున్నా లవ్ అంటే “అవసరం” అని తెలుసుకున్న పిల్ల మధులత. ‘చిచ్చు’ హీరోయిన్. మొక్కకి నీళ్లు ఎంత అవసరమో ‘మనసుకి’ ప్రేమ అంత అవసరం అని ఆ ఇరవై యేళ్ల పిల్ల అభిప్రాయం. అంతేకాదు ప్రేమ ‘అవసరమే’ కాక, అవసరానికి వుపయోగపడే ‘ఆయుధం’ అని కూడా ఆ పిల్లకి తెలుసు. ‘చిచ్చు’ విజయం అంతా హీరోకి అంటగట్టింది పరిశ్రమ. దాంతో సునీత్ రెండు మూడు సినిమాల్లో మధులతకి అవకాశం దొరకలా. ఓ వయసు మళ్ళిన హీరోకి ‘చెల్లెలి’ గా ఓ అవకాశం వచ్చింది గానీ, సినిమా బక్కెట్ తన్నేసాక మరి ఏ చాన్సూ మధులత గుమ్మదాకా రాలేదు.
సునీత్ అమాయకుడైనా అతని వెనకాల ‘కావలసినంత’ అనుభవం వున్న వసుమతి వుంది. నిశ్చల్ తెలివైనవాడు.. డబ్బుకోసం నటించాల్సిన అవసరం లేదు. కానీ, సునీత్ హీరోగా ఎంత పేరు సంపాయించాడో యంగ్ & హాండ్సమ్ విలన్‌గా నిశ్చల్ కూడా అంత పేరూ సంపాయించాడు.
నిశ్చల్‌ని హీరో చేస్తే??
‘చిచ్చు’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ‘సూర్యవంశి’ని పెద్ద హీరోలు ఎందుకు వదుల్తారూ? బ్రహ్మాండమైన బడ్జెట్‌తో ఆఫర్స్ ఇచ్చారు. ఒక హీరో అయితే షూటింగ్ మొదటిరోజునే సూర్యవంశికి ఓ ‘ఖరీదైన’ కారు బహూకరించాడు. రవికిరణ్ దశ కూడా తిరిగింది.
పెద్ద హీరోల్ని పెట్టి పిక్చర్ తియ్యడం అంటే కత్తిమీద సాములాంటిది. డైరెక్టర్ మాటలు లెక్కచెయ్యరు సరికదా, డైరెక్టరుకే డైరెక్షన్ ఇస్తారు. కాదంటే ‘డోర్‌మేట్’గా మిగుల్తామనే భయం. దాంతో అప్‌కమింగ్ డైరెక్టర్లు కన్‌ఫ్యూజన్‌కి గురౌతారు. పెద్ద హీరో పిక్చరయ్యేసరికి అప్పటివరకు ‘ఒదిగి’ వున్న రచయిత కూడా డైరెక్టర్‌ని సైడ్‌ట్రాక్‌లో వుంచి హీరోకే తాళం వేస్తాడు. సూర్యవంశి ఖర్మకాలి అదే జరిగింది. రవికిరణ్ హీరోకి పక్కా తాళం వేస్తుండటంతో డైరెక్టర్ వొంటరివాడై కనీసం కన్విన్స్ చేసే చాన్సు కూడా దొరక్క హీరోగారి ‘డైరెక్షన్’లోనే సినిమాకి గుమ్మడికాయ కొట్టాడు.(అంటే పూర్తి చేశాడన్నమాట). సునీత్‌తో తీసిన రెండు పిక్చర్లూ సూర్యవంశిని, రవినీ ఎక్కడో నిలబెడితే పెద్ద హీరోతో తీసిన ‘ఖామోష్’ పిక్చర్ బాక్సాఫీస్ ముందు ఢమాల్న పేలిపోయి సూర్యవంశిని కుదేల్ని చేసింది. రవికిరణ్ మాత్రం అదే హీరోకి కాకా పట్టి ఆ తరవాత సినిమాతోనే డైరెక్టరై సూపర్‌హిట్ డైరెక్టరైపోయాడు.
‘నేటి రాజు రేపటి చప్రాసీ… నిన్నటి చప్రాసీ నేటి మహారాజు’ లాగా యీ ‘చిత్ర’ పరిశ్రమలో పొజిషన్లు మారిపోతాయి. ఎంత ఫ్లాపైనా ‘సూర్యవంశీ’లో స్పార్క్ చాలా వుందని అందరికీ తెలుసు. అయినా ఎవరూ ధైర్యం చెయ్యరు. కానీ ‘మధులత’ మంత్రాంగంతో నాగరాజు మళ్లీ ఆ ధైర్యం చేశాడు. అయితే హీరో సునీత్ కాదు. నిశ్చల్. సునీత్ ఏనాడో నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ రెంజి దాటాడు. పది కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడం నాగరాజుకి ఇష్టం ఉండదు. సినిమా కథలో దమ్ముండాలి గానీ ‘స్టార్లెందుకూ?’ అనే మనస్తత్వం నాగరాజుది.
‘స్టార్ మదర్స్’ దో ‘హవా’ ఉంటుంది సినీ ఫీల్డులో. ఒకప్పుడు హేమమాలిని తల్లిగారు జయా చక్రవర్తి, అంబికా, రాధ వారి అమ్మగారూ, ఇల్లా బోలెడంతమంది ‘స్టార్ మదర్స్’ చరిత్ర కెక్కినవారే. పిల్లల భవిష్యత్తుని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఫైనాన్షియల్ స్టేటస్ పెంచిన తల్లులు కొందరైతే, విపరీతమైన గర్వంతో కన్నూమిన్నూ కానకుండా నానా డిమాండ్లు చేసి ‘వీపు వెనక’ నానా బూతులు తిట్టించుకునేవారు కొందరు. కొందరు ‘స్టార్ ఫాదర్స్’ కూడా లేకపోలేరు. కన్నకూతురి సినిమాలకి అటెండ్ అవుతూ ఏక్ దిన్ కా సుల్తాన్ లా ప్రవర్తించి, పిల్లల భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసే ఫాదర్సూ నాకు తెలుసు.
వసుమతి వస్తుతః చాలా మంచిది. చాలా సిన్సియర్. కానీ మొట్టమొదటి సినిమా కంప్లీట్ కాకపోవడం కంటే. ‘ఐరన్ లెగ్’ అ ని శేషారావు చేసిన ప్రచారం వల్ల ఆవిడ మనసు ముక్కలైపోయి పాషాణంలా తయారైంది. కొడుకు టాప్ హీరో కావడంతో ఆవిడ ధాష్ట్యానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అంతేగాదు, యీవిడ చికాకునీ, మూడ్స్‌నీ, కోపాన్నీ భరించలేక సునీత్ తండ్రి వెంకట్రావు రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే ‘వనజ’ టీచర్‌కి దగ్గర కావడం వసుమతిని మరింత మృగాన్ని చేసింది. సునీత్ ఎంత నచ్చచెప్పినా కొద్దిరోజులపాటు మామూలుగా ఉండి ఆ తరవాత తన ‘పవర్’ చూపించడంతో, అటు సినిమావాళ్లకీ, ఇటు సునీత్‌కీ కూడా మనశ్శాంతి కరువైంది. ఓ రోజున తండ్రి దగ్గరకు వెళ్లి తన గోడు వెళ్ళబోసుకుంటే..

‘సునీత్… మీ అమ్మలోని మార్పు నేను ఏనాడో గుర్తించా. చీరల డిజైన్ చేసే రోజులలోనే నేనంటే చిన్న చూపు. కారణం నాకంటే తన సంపాదన ఎక్కువ అవడం. నన్ను ప్రేమించి, పెళ్ళి చేసుకుని, ఆ తరవాత తన సంపాదన పెరిగాక నన్ను కాళ్ళు తుడుచుకునే ‘డోర్‌మేట్’లా చూడటం నేను భరించలేకపోయాను. అయినా మౌనంగానే అన్నీ భరించా. తన వైఫల్యాన్ని అందరికీ అంటగట్టి ‘గుర్తింపు’ ఇవ్వడం లేదని చిత్రవధ చేస్తున్నా ఆ మాటల్నీ ఓపిగ్గా భరించా. ఇప్పుడంటావా.. వనజ నిజంగా నేను కోల్పోయిన శాంతిని ఇస్తోంది. ఆమె విడో. భర్తని భర్తగా చూడటం తెలిసిన మనిషి. ప్రేమగా ప్రేమకి విలువిచ్చే ‘ఆడది’. అందుకే, మేం పెళ్లి చేసుకొనకపోయినా ప్రేమని పంచుకుంటున్నాం., అందుకే శాంతంగా ఉన్నాం. తండ్రిగా ఏనాడూ నీకు ద్రోహం చెయ్యను. నువ్వు ఎప్పుడు నన్ను రమ్మన్నా తక్షణం వస్తాను. కానీ మీ అమ్మతో కలిసి బతకమని మాత్రం నన్ను అడక్కు.” అని స్పష్టంగా చేప్పాడు.
ఎన్ని సినిమాలు హిట్టయితేనేం. ఎన్ని కోట్లు నగదు రూపంలో ఆభరణాల రూపంలో, ఆస్తుల రూపంలో దాస్తేనేం.. అసలైన మనశ్శాంతి కరువయ్యాక.
‘చిచ్చు’ అంత సూపర్ డూపర్ హిట్టు కాకపోయినా, సూర్యవంశి నిర్మించిన (దర్శకత్వం వహించిన) ‘కావ్యం’ సినిమా వసూళ్లలో బాక్సాఫీసుని కొల్లగొట్టింది. నిన్నటిదాకా విలన్‌గా అలరించిన నిశ్చల్ ఇప్పుడు హీరోగా విశ్వరూపం చూపించాడని పత్రికలు ఆకాశానికెత్తేసాయి. ఇహ చానల్స్ హడావిడి చెప్పనక్కర్లేదు. ‘మధులత’ ‘కావ్యం’తో స్టార్ హీరోయిన్ అయింది. మిగిలింది ఒక్కటే. సునీత్‌తో మళ్లీ జత కట్టడం.
మగవాడికి ‘శాంతి’నివ్వగలిగింది ఆడది ఒక్కతే. ఒక ఆడది మోసం చేసినా, ఇంకో ఆడని సర్వనాశనం చేసినా ఎప్పుడో అప్పుడు మగవాడికి సాంత్వన ఇచ్చేది ఆడదే. ఆడది మాత్రమే.
ప్రశాంతమైన ముఖంతో, అమాయకమైన కళ్లతో ఆరాధనగా తనవంక చూసే ‘కృత్తిక’ సునీత్ కళ్లకి ప్రశాంత సముద్రంలా కనిపించింది. కృత్తిక తండ్రి ప్రఫుల్లరావు. ది గ్రేట్ ప్రొడ్యూసర్. కూతురు సునీత్‌ని ప్రేమిస్తుందని ఆయనకి తెలుసు. కూతురి గదిలొ సునీత్ ఫోటోలు ఎక్కడ బడితే అక్కడ అంటించి వుండటం ఆయన చూశాడు. సునీత్ చాలా మంచి కుర్రాడు. గ్యారంటీగా మరో పదిహేనేళ్ళు సూపర్ హీరోగా వెలిగే స్టామినా వున్నవాడు. ఎటొచ్చీ అభ్యంతరమంతా వసుమతితోనే. ఆవిడ్ని భరించడం ఎవరివల్లా కాదు. తల్లిని ఆమె దారిన వదిలేంత కుసంస్కారి కాడు సునీత్.
‘మందు’ అంటే ‘మత్తు’ పదార్థం చాలా విలువైందీ, తెలివైందీ, సులువైందీ కూడా.
సినిమాల్లో ‘మందు’ షాట్ వచ్చినప్పుడల్లా ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని స్క్రోలింగ్ వేస్తారు. కానీ సినీ పరిశ్రమలో ఆల్కహాల్ కూడా ఒక స్టేటస్ సింబలే..
‘ఫారిన్’ సరుకుని సగర్వంగా ఆఫర్ చేసే మహానుభావులకి యీ ఫీల్డులో కొదవ లేదు. అడ్వాన్స్ అడిగితే మాత్రం అర్ధణా కూడా విదిలించరు. ‘మచ్చిక’ చెయ్యడానికి ‘మందు’ని మించిన ఔషధం లోకంలో లేదు. ఇప్పుడు జరుగుతున్నది ఆ ప్రక్రియే.
“అసలు మొహం ఫ్రెష్‌గా వుండాలంటే కొంచెం తీసుకోవాల్సిందే. కాదంటావా.. ఏ డాక్టర్ని అన్నా అడుగు చెప్తాడు. A peg or two a day keeps the doctor away అని ఉదహరించాడు ప్రఫుల్లరావు.
సూర్యవంశి అంటే సహజంగానే సునీత్ కి గౌరవం. మొట్టమొదటి హిట్ ఇచ్చిన దర్శకుడని. ఓ రోజున సూర్యవంశినీ, సరికొత్త రచయిత ‘అమరనాధ్ వర్మ’నీ వెంటబెట్టుకుని మధులత నాగరాజుని కలిసింది. “ఆవో.. ఏమిటీ అకాల ఆగమనం?” అన్నాడు నాగరాజు. “సార్.. అమర్ నాకో కథ చెప్పాడు. దానికి కరెక్ట్ హీరో సునీత్. కరెక్ట్ దర్శకుడు సూర్యవంశి. ఇహ నిర్మాతగా పెర్‌ఫెక్ట్ పర్సన్ మీరే. ముందు ఈ కథ వినండి. ఆ తరవాత మీ ఇష్టం. హీరోయిన్‌గా నాకు ఒక్క పైసా కూడా అడ్వాన్స్ ఇవ్వొద్దు. పిక్చర్ హిట్టయ్యాక మీకు తోచింది ఇవ్వండి. అంతేకాదు.. మొదటి సూపర్ హిట్ ఇచ్చిన మన బేచ్.. మరో పిక్చర్ తీస్తున్నామంటే బయ్యర్లు పోటీపడతారు…” ఊరించింది మధులత. కథ విన్నాక మధులత జడ్జిమెంట్ పెర్‌ఫెక్ట్ అనిపించింది. సునీత్ కూడా ఓకే అన్నాడు. ఇంకేం.. ఓ పక్క ప్రఫుల్లరావుగారి హై బడ్జెట్ సినిమా, మరో పక్క నాగరాజుతో మీడియం బడ్జెట్ బట్ ష్యూర్ షాట్ ఎవార్దు సినిమాలతో సునీత్ యమా బిజీ అయ్యాడు.
మధులత జాణతనంలో ఎంతెత్తుకి ఎగిరిందంటే వసుమతిని పొగడ్తలతో, మాటలతో బుట్టలో వేసింది. ‘ఈగో’ని సంతృప్తి పరిచేవారుంటే … యూ.. గో.. అని ఎవరంటారూ? వసుమతి కూడా మధులత మాటల మత్తులో పడింది. రేపో మాపో మధులత, సునీత్ పెళ్లాడబోతున్నారనే ‘నిఖార్సయిన రూమర్’ని పత్రికలకి లీక్ అయేట్టు చేసింది మధులతే. (మేకప్‌మన్ సౌజన్యంతో)

‘కృత్తిక’ స్వభావం తెలిసిన ప్రఫుల్లరావు ఆ రూమర్‌ని తట్టుకోలేకపోయాడు. కృత్తిక గాజులాంటిది. ఏ చిన్న దెబ్బ తగిలిన భళ్ళున పగులుతుందని ఆయనకి తెలుసు.

లక్ష పేజీల్లో చెప్పలేని ‘నగ్న సత్యాన్ని’ ఒక్క ‘పెగ్గు’తో చెప్పొచ్చు. చెప్పించనూ వచ్చు. అప్పటికే సునీత్ కొంతవరకు మధులత దగ్గర ‘సేద’ తీరుతున్నాడనే విషయం ప్రఫుల్లరావుగారికి రెండో పెగ్గులోనే అర్ధమయింది. సామ, దాన, బేధ దండోపాయాల మీద ఆయనకు అంత నమ్మకం లేవు. అవన్నీ చేతకానివాళ్లకి.. సగం సినిమా (నాగరాజుది) అయ్యాక ఎవరో మదాలస కారుని గుద్దేశారు. అదీ ఫుల్లీ లోడెడ్ ఐరన్ లారీతో. ప్రాణం పోలేదుగానీ ఆల్మోస్ట్ పోయినంత పని జరిగింది.
కనీసం ఆరునెలలు బెడ్ మీదే వుండాలన్నారు డాక్టర్లు. నాగరాజు షాక్ తిన్నాడు. ఊహించని దెబ్బ అది. పిక్చర్ అద్భుతంగా వస్తూ వుండడంతో బడ్జెట్ ఎంత పెరుగుతున్నా ఆయన పట్టించుకోలేదు. ఆరునెలలపాటు సినిమాని మధులత కోసం ఆపాలంటే ఆత్మహత్య చేసుకున్నట్టే..
పోనీ వేరొకర్ని పెట్టి తీద్దామంటే కుదిరే పని కాదు. స్టోరీ ‘అంత’ టైట్‌గా వుంది. NAC (అంటే నాగా ఆర్ట్ క్రియేషన్స్) ఆఫీసులొ యూనిట్ మెంబర్స్ మీటింగ్ జరిగింది. కొత్త రచయిత అమర్ బుర్రున్నవాడే. వారం రోజులు కిందా మీదా పడి ‘మదాలస’ కేరక్టర్ మధ్యలొ చనిపోయినట్టూ, ఆమె ఆత్మ మరో నటిని ఆవహించినట్టూ, గొప్పగా కథని మార్చాడు. అందరూ చప్పట్లు కొట్టి ఆనందాన్ని వెలిబుచ్చితే, సైలెంటుగా వుండి తన అసమ్మతిని ప్రకటించింది సునీత్. అతనన్నది ఒకే ఒక మాట. “అయ్యా.. కథని మార్చగలం.. ఎన్నో గమ్మత్తులూ చెయ్యగలం.. కానీ ఇది సరా? కాదా? అన్న అంతరాత్మకి సమాధాన చెప్పగలమా?” అని .
“సునీత్.. అంతరాత్మకంటే అవతల పెరగబోయే వడ్డీ గురించే నేను ఆలోచిస్తాను. నన్ను నమ్ముకున్న నా పెళ్ళాం, పిల్లల్ని రోడ్డు మీదకి వదల్లేను”” సీరియస్‌గా అన్నాడు నాగరాజు.
హీరోయిన్ మార్పిడితో షూటింగ్ మొదలైంది. ‘రాజమహల్’ సెట్ వేశారు. అయిదు కోట్ల ఖర్చుతో. రేపే షూటింగ్ అనగా ఇవ్వాళ షార్ట్ సర్క్యూట్‌తో సెట్ మొత్తం అగ్నికి ఆహుతైంది.
బస్.. ఆ సినిమా ‘టచ్‌వుడ్’ అయిపోయింది. సినిమాని ఇంతెత్తున ఎత్తేదీ సెంటిమెంట్, అధఁపాతాళానికి తొక్కేదీ సెంటిమెంట్.
కొందరు పుట్టుకతోనే అమాయకులు. (పుట్టుకతో అందరూ అమాయకులే.. కానీ చాలామంది మారిపోయి మహా గడసరులూ, జ్ఞానులూ అవుతారు. పుట్టిన దగ్గర్నించి పిడకలవరకూ అమాయకంగా వుండే వాళ్ల సంఖ్య వేళ్లతోనే లెక్కబెట్టగలం.. కాలిక్యులేటర్ల అవసరం వుండదు) అలాంటి అమాయకుల్లో సునీత్ ఒకడు. నాగరాజు బాధనీ, సూర్యవంశి నిస్సహాయతనీ చూసి తనే డబ్బు మదుపు పెడతానని ముందుకొచ్చాడు. అంతే కాదు మధులత కోలుకున్నాకే సినిమా షూటింగ్ మొదలుపెడతానని ఆమెని ‘ఖర్మ’కి వదిలెయ్యకుండా వివాహం కూడా చేసుకుంటానని అనవసరమైన ఓ స్టేట్‌మెంట్‌ని ప్రెస్ ముందూ, చానల్ వాళ్ల ముందూ ఇచ్చాడు.
‘కృత్తిక’ గాజుగుండె భళ్లున పగిలింది. కానీ తను ప్రయత్నిస్తే అతుకు పెట్టగలనని ప్రఫుల్లరావుకి తెలుసు. రాయబారాలు నడిచాయి. సునీత్ లొంగలేదు.
అన్ని దెబ్బలాటలకీ మూలం ఒక్కటే. దాని పేరు అహంకారం. అది రూపాయి నోటులాంటిది. కలపనూ గలదు. విడగొట్టనూ గలదు. ప్రాణం పొయ్యనూ గలదు. ప్రాణాన్ని నిర్ధాక్షిణ్యంగా తియ్యనూ గలదు.
అప్పటికీ ఓ రోజున ప్రఫుల్లరావు దగ్గర చేరిన శేషారావు సునీత్ ఇంటికి వెళ్ళి వసుమతిని సమర్యాదగా పలకరించి సునీత్ ని బుజ్జగిస్తూ చెప్పాడు.. “బాబూ.. నువ్వు సూపర్ స్టారువే.. కాదన్నా. నువ్వు నటించిన ఫ్లాప్ సినిమా అయినా, నిర్మాతకి లక్షల్లో లాభం తెచ్చిపెడుతుందన్న మాట కూడా నిజమే.. కాదన్ను. కానీ నీకు తెలీంది చెబుతున్నా విను. సక్సెస్ ని నిభాయించడం చాలా చాలా కష్టం. ఓ బండరాయిని కొండ అంచుకి మోసుకుంటూ చేర్చడం ఎంత కష్టం, సక్సెస్ ని నిభాయించడం కూడా అంతే కష్టం. ఇంత కష్టపడి నువ్వు మోసుకెళ్లిన బండరాయిని కిందకి అంటే లోయలోకి తోసెయ్యడానికి క్షణం కూడా పట్టదు. ఆ నిజాన్ని నువ్విప్పుడు తెలుసుకోవాలి. కృత్తికా – మధులతా? శిఖరం మీద స్థిరంగా వుండాలంటే నిర్ణయించుకోవాల్సింది నువ్వే..!!” చెప్పాల్సింది చెప్పాడు శేషారావు.
“శేషారావు.. నా కొడుకు ఎవర్ని పెళ్ళి చేసుకోవాలో నిర్ణయించాల్సింది నువ్వూ నీ ప్రొడ్యూసరూ కాదు. నేను యీ సూపర్ స్టార్ సునీత్ తల్లి వసుమతిని..! నేనూ నిర్ణయించాల్సింది.” నిప్పులు గక్కుతూ శేషారావు వంక చూసి అన్నది వసుమతి. చిత్రంగా నవ్వి వెళ్లిపోయాడు శేషారావు.
‘విధి’ ఎంత చిత్రవిచిత్రమైందంటే సునీత్ సూర్యవంశితో తీసిన పిక్చర్ పూర్తి కాకుండానే సునీత్ అస్తి కరిగిపోయింది. కారణం దేవుడికే తెలియాలి. ప్రఫుల్లరావు నిశ్చల్‌నీ, మదాలసనీ హీరో, హీరోయిన్లుగా పెట్టి నాగరాజు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సూర్యవంశి డైరెక్టరుగా పిక్చర్ తియ్యబోతున్నాడన్న వార్త సినీవర్గాల్లో హల్‌చల్ చేసింది.
వసుమతికి ఎలా అలవాటైందో గానీ మద్యానికి బానిసైంది. సునీత్ తండ్రి వెంకట్రావు వనజతోనే సుఖంగా వుంటున్నాడు. వాళ్లు గుళ్ళో పెళ్లి చేసుకున్నారనీ, ప్రస్తుతం వనజ కడుపుతో వుందని కూడా పత్రికలు ఘోషించాయి.
ప్రఫుల్లరావు సునీత్‌తో తీసిన పిక్చర్ పూర్తయింది. కానీ అది నాలుగు నెలలయినా రీరికార్డింగుకి పోలేదు.
ఎటు చూసినా సముద్రంలాంటి వంటరితనం. ఎన్నిసార్లు ఫోన్ చేసిన మధులత నంబర్ నాట్ రీచబుల్‌గానే వుంది.
అవ్వాళ సునీత్ పుట్టినరోజు. తల్లికి ఆ విషయమే గుర్తు లేదు. మస్తుగా తాగి మంచం మీద దొర్లుతోంది. తండ్రికి గుర్తుందో లేదో కూడా తెలీదు. కారులో రోడ్ల మీద తిరిగి తిరిగి వస్తూంటే నిశ్చల్ కారు కనిపించింది. కారుని ఆపి అటువైపు వెళ్ళేలోగానే నిశ్చల్ కారు వెళ్లిపోయింది. కార్లో ఎవరో అమ్మాయి వున్నట్టు మాత్రం సునీత్‌కి కనిపించింది .. ఎవరూ? కృత్తికా? మధులతా?
ఒంటరిగా మందు పెట్టుకున్నాడు సునీత్.
మరుసటిరోజు చిత్రపరిశ్రమ ఘొల్లుమంది. రాత్రికి రాత్రే సునీత్ ఆత్మహత్య చేసుకున్నాడనీ.. ఆత్మహత్యకి ఎవరూ బాధ్యులు కాదని నోట్ పెట్టాడని..
కారణాలు ఎవరికీ తెలీదు. రూమర్లకేం.. బోలెడు..
PS: ఇది ఒక్కరి కథ కాదు. కొన్ని జీవితాల్ని గుదిగుచ్చి కథగా మలచాల్సి వచ్చింది. కొన్ని సంఘటనలు కేవలం కల్పితాలు. అదీ నిజంలాంటి కల్పన. సినిమాల్లోకి ప్రవేశించినప్పుడు వసుమతి ‘కాస్ట్యూమర్’ కాదు. తరవాతా కాదు. ‘వృత్తి’ని మార్చాను..
శేషారావులూ, వసుమతులూ, ప్రఫుల్లరావులూ ఎలా వున్నారో సునీత్, సూర్యవంశీలూ, కూడా అలానే వున్నారు. మంచీ చెడూ బొమ్మా-బొరుసూ లాంటివే. కలిసి ఉంటాయి.. విడగొట్టడం ఎవరి తరం??

-భువనచంద్ర

bhuvanachandra (5)

Download PDF

3 Comments

  • నాణేనికి రెండు వైపులా జరిగే విషయాల్ని ఎంతో ఆసక్తికరంగా వివరిస్తున్నారు . ధన్యవాదాలు

  • mallik arjun says:

    చివరిదాకా సెటైరికల్గా ఉన్నా చివర్లో షాకింగ్గా అనిపించింది.బావుందండి

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)