ఒకరికొకరు

MythiliScaled
అనగనగా ఒక పల్లెటూళ్ళో ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు , ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు జాక్ , అమ్మాయి జొకోసా. ఇద్దరూ అందంగా, తెలివిగా ఉండేవారు . వాళ్ళ రెండు కుటుంబాలకీ చాలా కాలం కిందట ఏదో దెబ్బలాట అయింది. అది ఎందుకో కూడా ఎవరికీ గుర్తు లేకపోయినా అదొక అలవాటుగా వాళ్ళ అమ్మా నాన్నలు ఒకరితో ఇంకొకరు మాట్లాడుకునేవారు కాదు. కానీ జాక్, జోకోసా లకి ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం. గొర్రెలని కాస్తూ ఒకే పెద్ద మైదానం లోకి ఇద్దరి మందలనీ నడిపించి అలిసిపోయేదాకా ఆడుకుని అప్పుడు చెట్ల నీడలలో నిద్రపోయేవారు.

ఆ మైదానం లో ఒక ఫెయిరీ ఉంటుండేది. వీళ్ళిద్దరినీ చిన్నప్పటినుంచీ గమనించేది. వాళ్ళ ముద్దు ముఖాలూ మంచి పద్ధతులూ ఆమెకి నచ్చేవి. వాళ్ళిద్దరినీ కాపాడే బాధ్యత తీసుకుని అప్పుడప్పుడూ కేక్ లు, రుచి అయిన ఆహారం , అందేలా చేసేది. వాటిని చూసి వాళ్ళిద్దరూ తినేయకుండా అవతలివారికి ఇచ్చేసేవారు. అంత ప్రేమ ఇద్దరిదీ.

munier_1886_05_one_more_please_wm

వాళ్ళు పెరిగి పెద్దయాక ఒక మధ్యాహ్నం విరగబూసిన ఆపిల్ చెట్టు కింద ఫెయిరీ వాళ్ళకి మొదటిసారి కనిపించింది. ఆకు పచ్చని దుస్తులు వేసుకుని పూల కిరీటం పెట్టుకుని సన్నగా పొడుగ్గా చక్కగా ఉన్న ఆమెని చూసి ముందు ఇద్దరూ విస్తుపోయారు. అయితే ఆమె తీయగా మాట్లాడటం మొదలుపెట్టాక వాళ్ళ భయం పోయింది. వాళ్ళిద్దరూ తనకి ఎంతో నచ్చుతారనీ కనబడకుండా వాళ్ళకి తినుబండారాలు ఇచ్చినది తనే అనీ ఆమె చెప్పాక ఇద్దరూ ధన్యవాదాలు చెప్పారు. ముగ్గురూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఫెయిరీ వెళ్ళబోతూ ” మళ్ళీ కనిపిస్తాను ” అని చెప్పి, ” నన్ను మీరు చూడలేనప్పుడు కూడా మీతోనే ఉంటాను ” అని కూడా హామీ ఇచ్చింది. తనని చూసిన సంగతి ఎవరికీ చెప్పద్దని హెచ్చరించింది.

fairy cottage
ఆ తర్వాతి రోజులలో తరచు ఆమె వాళ్ళని కలుసుకునేది. చాలా విషయాలు నేర్పేది. తన లోకపు అద్భుతాలని తెచ్చి చూపేది. కొన్నాళ్ళ తర్వాత ఆమె అంది- ” నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాను కదా. బదులుగా నాకొక చిన్న పని చేసిపెట్టండి. నాకు బాగా ఇష్టమైన నీటి ధార ఉంది, తెలుసు కదా. రోజూ తెల్లవారక ముందే లేచి మీరిద్దరూ దాని చుట్టూ చప్టాని శుభ్రం చేయండి. నీరు ప్రవహించటానికి గులక రాళ్ళు అడ్డు పడితే తీసేయండి. ఎండుటాకులో తీగలో ఉంటే ఏరివేయండి. మీరు ఈ పనిని ఆలస్యం లేకుండా, అశ్రద్ధ చేయకుండా చేస్తే అది మీరు నాకు చెప్పే కృతజ్ఞతగా అనుకుంటాను. ఈ మైదానం లోకల్లా ఆ జలధార లో నీరు స్వచ్ఛంగా , తీయగా ఉన్నంతకాలమూ మీరిద్దరూ ఒకటిగా ఉంటారు, విడిపోరు ”

ఇద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఫెయిరీ వాళ్ళకి చేసినదానికీ, చేయబోయేదానికీ బదులుగా ఇది చాలా చిన్న విషయమని అనుకున్నారు. అలా చాలా కాలం పాటు నీటి ధారని జాగ్రత్తగా కాపాడారు. అందులో నీరు ఎప్పుడూ తేటగానే ఉండేది. ఒక రోజు పొద్దు పొడవకుండానే ఇద్దరూ చెరొక వైపునుంచి నీటిధార దగ్గరికి వస్తూ ఉంటే నేలమీద ఏవో తళతళమన్నాయి. . చూస్తే విలువైన రాళ్ళలాగా అనిపించాయి . రెండు మూడు తీసుకునేలోగా కొంత దూరం లో అలాంటివే రంగురంగులవి . ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు అనుకుంటూ వాటి వెంట ఇద్దరూ వెళ్ళిపోయారు. ఏరుకుని జేబుల్లో నింపుకుంటూ ఉన్నారు. సమయం మించిపోయింది. చటుక్కున సూర్యుడు ఉదయించాడు, ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. ఇద్దరూబరువెక్కిన జేబులతో వీలైనంత తొందరగా నీటిధార దగ్గరికి పరుగెత్తారు.

కానీ నెమ్మదిగా చల్లగా పారే నీటిజల పెద్ద ప్రవాహం లాగా మారిపోయింది. చూస్తుండగానే ఇద్దరి మధ్యా దాటలేనంత వెడల్పుగా , వేగంగా ప్రవహించింది. ఒక్క కేక పెట్టి తెచ్చిన రత్నాలని అవతలివారికి ఎత్తి చూపటం మటుకే వీలయింది. జాక్ ఈదుకుంటూ అవతలి ఒడ్డుకి చేరాలని కనీసం ఇరవైసార్లు ప్రయత్నించాడు. అన్నిసార్లూ నీరు ఊపుగా అతన్ని వెనక్కి నెట్టేసింది. ఎండుకొమ్మలు నదిలో కొట్టుకు వస్తూంటే వాటి మీద ఎక్కి అటువైపుకి వెళ్ళాలని జోకోసా ఎంత ప్రయత్నించినా కుదరనేలేదు. బరువెక్కిన గుండెలతో గట్ల వెంట వాళ్ళు నడిచారు. పోను పోను ఒకరి ముఖం ఇంకొకరికి కనిపించటమే కష్టమైపోయింది.

ఎన్నో రాత్రులూ పగళ్ళూ గడిచాయి. కొండలు ఎక్కారు, లోయల్లో దిగారు. చలిలో ఎండలో , అలసటతో ఆకలితో ఇద్దరూ కష్టాలు పడ్డారు. దాచిన రత్నాలని ఎప్పుడో అవతల పారేశారు .మళ్ళీ కలుసుకుంటామన్న ఒకే ఒక్క ఆశతో మూడేళ్ళు గడిపారు. నది దాటేందుకు ఎక్కడా ఒక్క వంతెన అయినా లేదు. చివరికి ఆ నది సముద్రం లో కలిసే చోట చెరొక వైపునా ఎత్తైన కొండ కొమ్ముల మీద నిలిచారు. ఎప్పటికన్నా కూడా ఒకరికొకరు దూరంగా అనిపించారు.

కలుసుకోగలమన్న ధైర్యం పోయింది. నురగలు కక్కుతున్న నీటిలోకి దూకేశారు. అయితే ఒక్క క్షణం అయినా ఏమరకుండా వాళ్ళని కనిపెడుతూ ఉన్న ఫెయిరీకి వాళ్ళు చచ్చిపోవాలని అసలు లేదు. కంగారుగా తన మంత్రదండం ఒకసారి ఆడించింది. వెంటనే ఇద్దరూ ఒడ్డు మీద , బంగారురంగు ఇసుక తిన్నెల మీద, పక్కపక్కనే తేలారు. వాళ్ళిద్దరి సంతోషాన్నీ చెప్పేందుకు ఏ మాటలూ సరిపోవు. ఒకరి చేయి ఒకరు పట్టుకుని తృప్తిగా కళ్ళు మూసుకున్నారు. ఎంతో మాట్లాడవలసి ఉంది, అయితే ఎక్కడ మొదలుపెట్టాలో తెలియలేదు. ఫెయిరీ చెప్పినట్లు నీటిధారని కాపాడే పనిలో నిర్లక్ష్యంగా ఉన్నామని ఎవరిని వారి తిట్టుకున్నారు.

fairies
అప్పుడు ఫెయిరీ ప్రత్యక్షమైంది. ఇద్దరూ ఆమె పాదాలమీద పడి క్షమించమని అడిగారు. ఫెయిరీ వాళ్ళని లేవనెత్తి శిక్ష పూర్తయిందనీ తను ఎప్పటికీ వాళ్ళతో స్నేహంగానే ఉంటాననీ చెప్పింది. తన రథాన్ని అక్కడికి పిలిచింది. దాన్ని ఆకుపచ్చటి తీగలతో అల్లారు. మంచుబిందువులతో అలంకరించారు. ఆరు చిన్న కుందేళ్ళు లాగుతున్న ఆ రథాన్ని ఎక్కి కొద్ది సేపట్లోనే నీటిధార మొదలైన మైదానం లోకి వెళ్ళారు. ఆ తెలిసిన చోటినీ దూరంగా కనిపించే వాళ్ళ ఇళ్ళనీ చూస్తే ఇద్దరికీ ప్రాణాలు లేచివచ్చాయి. వారి సంతోషం కోసం ఫెయిరీ ఆ మూడేళ్ళలో రెండు కుటుంబాల మధ్యా తగాదా తీర్చి స్నేహాన్ని పెంచింది. వాళ్ళ తల్లిదండ్రులు జాక్, జోకోసా లు పెళ్ళి చేసుకోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు.

మళ్ళీ నెమ్మదిగా , శాంతంగా ప్రవహించే ఆ నీటిధారకు కనుచూపుమేరలో చిన్న కుటీరాన్ని ఫెయిరీ కట్టి ఉంచింది. చుట్టూ చిన్న పూలతోట, ఆ పక్కనే పళ్ళ తోట, కొంచెం పొలం. ఇద్దరికీ అంతకన్న కావలసిందేమీ లేదని తెలిసింది. వాళ్ళ ఉల్లాసాన్ని చూసి ఫెయిరీ కూడా ఆనందించింది. అంతా తిరిగి చూసుకుని , మెచ్చుకుని బడలికగా ఇద్దరూ గులాబీ లతలు అల్లించిన వరండా లో కూర్చున్నారు.

ఫెయిరీ అప్పుడు ఇద్దరికీ చెప్పింది ” ఇంతకన్నా వైభవంగా కనిపించేవాటికన్న ఈ కుటీరం, ఈ పరిసరాలూ తృప్తినీ శాంతినీ ఇస్తాయి మీకు. ఈ పొలాలలో సేద్యం చేసుకోండి, మీ గొర్రెల మందలని కాచుకోండి. ఏ కొరతా ఉండదు. రోజు రోజుకీ మీ సంతోషం పెరుగుతూనే ఉంటుంది . ”
పెళ్ళి చేసుకుని , ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇద్దరూ ఆ కుటీరంలో చిరకాలం హాయిగా బ్రతికారు.

ఫ్రెంచ్ జానపద కథ [by Kelley Morrow] సేకరణ- Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

Download PDF

5 Comments

  • “ఇంతకన్నా వైభవంగా కనిపించేవాటికన్నా ఈ కుటీరం, ఈ పరిసరాలూ తృప్తినీ శాన్తినీ ఇస్తాయి మీకు….రోజురోజుకీ మీ సంతోషం పెరుగుతూనే ఉంటుంది” — ఆహా ఇంతకన్న ఆనందమేమి అనుకొని బతికేయమూ మనకి అలాంటి దివ్యలోకం దక్కితే!
    చాలా బాగుంది మైథిలీ మీ కథనం.
    వచ్చే వారం ఏ దేవత ఎవరికీ యే వరాన్నిస్తుందో ఇప్పుడే తెలుసుకోవాలని ఉంది :)

  • Rekha Jyothi says:

    కల్మషం లేని పసి మనసుల పరిచయంతో ప్రారంభమూ, నేపధ్యమూ చాలా చాలా బాగుంది Mam, & “… నెమ్మదిగా చల్లగా పారే నీటిజల పెద్ద ప్రవాహం లాగా మారిపోయింది ….. ” , అందమైన సుజీవన శిల్పాన్ని చెక్కడానికి ఫెయిరీ వేసిన ఉలి దెబ్బలు ఆ విడిపోయిన మూడు సంవత్సరాలు . Absolutely the emotion mirrored with a beautiful word flow without break. Enormously a much relaxed , honored climax. _/\_ TQ Mam

  • alluri gouri lakshmi says:

    ఎంతో చక్కగా సుకుమారంగా ఉంది కధ ! కృతజ్ఞతలు !

  • padmaja says:

    ఆకుపచ్చటి తీగలతో అల్లారు. మంచుబిందువులతో అలంకరించారు. ఆరు చిన్న కుందేళ్ళు లాగుతున్న ఆ రథాన్ని ఎక్కి కొద్ది సేపట్లోనే నీటిధార మొదలైన మైదానం లోకి వెళ్ళారు…..
    రధం వర్ణన ….పిల్లలకు ఎంత ఆసక్తి కలిగిస్తుందో !!నిజంగా అద్భుతమైన కథ మైధిలి గారూ….

  • మైథిలి అబ్బరాజు says:

    ధన్యవాదాలు రేఖా జ్యోతి, శివరామ కృష్ణా రావు గారూ ,! పద్మజ గారూ మీకు నచ్చినందుకు చాలా ఆనందం ! అల్లూరి గౌరీ లక్ష్మి గారూ థాంక్ యూ మాడం !

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)